గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Aug 08, 2020 , 02:09:37

వేయిస్తంభాల గుడిలో కమాండోల మాక్‌డ్రిల్‌

వేయిస్తంభాల గుడిలో కమాండోల మాక్‌డ్రిల్‌

వరంగల్‌ క్రైం : అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వేయిస్తంభాల ఆలయాన్ని ఒక్కసారిగా అధునాతన ఆయుధాలతో ఆక్టోపస్‌ కమాండోలు చుట్టుముట్టారు. డాగ్‌ స్కాడ్‌తో బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. గన్నులతో ముష్కర వేట కొనసాగించారు. అసలు ఏం జరుగుతుందో తెలియక అక్కడి భక్తులు, చుట్టుపక్కలవారు హడలిపోయారు. ఇదంతా నిజం కాదని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ అని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రార్థనా మందిరాలు, పర్యాటక ప్రాంతాల్లో ముష్కరులు చొరబడితే ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వారిని ఎలా అంతమొందిస్తారో ఆక్టోపస్‌ కమాండోలు ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. శుక్రవారం వేయిస్తంభాల ఆలయానికి నల్లటి దుస్తులు చేతిలో అధునాతన ఆయుధాలతో ఆక్టోపస్‌ ఉన్నతాధికారి అనంతయ్య నేతృత్వంలో 40 మంది కమాండోలు ఆరు బృందాలుగా వచ్చారు. ముష్కరులు ప్రతిదాడులకు దిగిన సమయంలో, బాంబుల ను అమర్చిన సమయంలో కమాండోలు ఎంతటి సాహసాలతో ఎదుర్కొని నిర్వీర్యం చేస్తారో ప్రదర్శన పూర్వకంగా చేసి చూపించారు. మాక్‌డ్రిల్‌లో అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ సైతం పా ల్గొని ముష్కరుల దాడి సమయంలో ఆ శాఖల ప్రాధాన్యతను చాటుకున్నాయి. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ గిరిరాజు, హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ పత్తిపాక దయాకర్‌, ఆర్‌ఐ నగేశ్‌, ఫైర్‌ అఫీసర్‌ ఆంగొతు నాగరాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్యస్వామి, ఆలయ పూజారి ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. 


logo