బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Aug 08, 2020 , 01:52:56

‘హలో మీ ఆరోగ్యం ఎలా ఉంది..

‘హలో మీ ఆరోగ్యం ఎలా ఉంది..

‘హలో మీ ఆరోగ్యం ఎలా ఉంది.. నిన్నటి కంటే కాస్త మెరుగైందా.. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ తగ్గిపోతుంది’ అంటూ కరోనా పాజిటివ్‌ బాధితులకు హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ చేసి ధైర్యాన్నిస్తున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి వైద్యులు, సిబ్బంది హోం ఐసొలేషన్‌లో ఉన్న వ్యాధిగ్రస్తులకు ఫోన్‌ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. తమ సూచనలు, సలహాలు పాటిస్తే వైరస్‌ మటుమాయమవుతుందని వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రతి రోజూ బాధితులకు వీడియో కాల్‌ చేసి ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని సూచిస్తున్నారు.  ప్రస్తుతం 3028 మంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 745 మంది కరోనాను జయించారు.     

జిల్లావ్యాప్తంగా కొవిడ్‌-19 రోజురోజుకూ విజృంభిస్తున్నది. ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. హోం ఐసొలేషన్‌ ఉంటున్న వారికి వైద్యులు, సిబ్బంది ఫోన్‌ చేసి వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కరోనా కిట్‌ను పంపిణీ చేశారు. కొవిడ్‌ పేషెంట్లు ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హోం ఐసొలేషన్‌ కిట్‌లో ఉన్న సూచనల ప్రకారం మందులు వాడుతూ, జాగ్రత్తలు పాటిస్తూ ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన వారు ఫోన్‌ చేసి వైద్య సలహాలు పొందుతున్నారు. 

బాధితులకు హెల్ప్‌డెస్క్‌తో ధైర్యం..

హోం ఐసొలేషన్‌లో ఉంటున్న కరోనా పాజిటివ్‌ బాధితులకు వైద్యాధికారులు ఫోన్‌ చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ ధైర్యాన్ని నూరిపోస్తున్నా రు. పాజిటివ్‌ నిర్ధారణ జరిగి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం17 రోజుల వరకు ఇంటిలో ప్రత్యేకమైన గదిలో ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ బయ టకు రావొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు 83418 12395, 81792 43595 నంబర్ల లో సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో 79939 69104, 1800 5994455 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. ప్రతి రోజూ 50 మంది హెల్ప్‌ డెస్క్‌కు ఫోన్‌ చేస్తున్నారు. 

ఆరోగ్య సమస్యల నివృత్తికి టెలీ మెడిసిన్‌..

రోజూ ఫోన్‌ చేసి ఆరోగ్య సమస్యలను నివృత్తిని చేసుకునేందుకు టెలీ మెడిసిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉంటున్న వారికి, ఇతరులకు అవగాహన, ప్రాథమిక చికిత్స కోసం టెలీ మెడిసిన్‌ ఎంతో ఉపయోగకరం. 9392469344, 7995118405 నంబర్లు రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మెడిసిన్‌ పేర్లను వైద్యులు ఫోన్‌ ద్వారా తెలియజేస్తున్నారు. వారు చెప్పే లక్షణాలను బట్టి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.

వాట్సాప్‌ వీడియో కాల్‌!

వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. నేరుగా వీడియో ద్వారా బాధితులను వీక్షించి వైద్యులు సేవలందిస్తున్నారు. బాధితుల సమస్యను తెలుసుకొని సలహాలు ఇస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. 


logo