శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Aug 06, 2020 , 03:34:35

13 వరకు ప్రజా మరుగుదొడ్లు పూర్తిచేయాలి

13 వరకు ప్రజా మరుగుదొడ్లు పూర్తిచేయాలి

వరంగల్‌, ఆగస్టు 5 : ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలను ఈనెల 13వ తేదీలోగా పూర్తిచేయాలని  వరంగల్‌ మహానగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.  బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజా మరుగుదొడ్లు, హరితహారం, తాగునీటి సరఫరా, స్మార్ట్‌సిటీ పురోగతిపై బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో 1000 ప్రజా మరుగుదొడ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులపై పనితీరు బాగాలేదన్నారు.స్మార్ట్‌సిటీ పథకం కింద చేపట్టిన 2 పనుల్లో ఆర్‌-1 పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. నగర నాలుగు ఆహ్వాన ముఖద్వారాల సుందరీకరణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. హరితహారంలో నిర్దేశించిన 36 లక్షల మొక్కలను నాటేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. పోతన జంక్షన్‌ నుంచి భద్రకాళీ ఆలయం వరకు గల రహదారి సుందరీకరణ కోసం ప్రణాళికలు తయారు చేయాలని, నగరంలో ప్రతిరోజూ తాగునీటిని సరఫరా చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఈఈలు రాజయ్య, శ్రీనివాస్‌, లక్ష్మారెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.  

‘కుడా’ కార్యాలయంలో పనుల పరిశీలన

 కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల పురోగతిని ఆమె పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థల్లో తప్పకుండా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌ రెడ్డి, ఈఈ భీంరావు, బల్దియా డీఈ సంతోశ్‌బాబు తదితరులు ఉన్నారు.

వీధి వ్యాపారులకు రుణాలు  ఇవ్వాలి

వరంగల్‌ మహానగరపాలక సంస్థ పరిధిలోని వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్‌ నిధి కింద అందించే రుణాలను తక్షణమే మంజూరు చేయాలని కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లు, మెప్మా సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు వీధి వ్యాపారులను గుర్తించి కార్డులు, పత్రాలు అందజేస్తామని తెలిపారు. 1994 మందికి రుణాల కోసం ప్రతిపాదనలు పంపగా 313 మందికి రుణాలు మంజూరయ్యాయన్నారు. బ్యాం కర్లు రుణాల మంజూరులో ఉదారంగా వ్యవహరించాలని, వారంలోగా రుణాల మంజూరులో పురోగతి కనిపించా లని, బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది పరస్పర సహకారంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. టౌన్‌ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, ఏడీఎంసీ సతీశ్‌ పాల్గొన్నారు. 

 పీపీఈ కిట్ల అందజేత

  వరంగల్‌ మహానగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతికి క్రెడాయ్‌ సంస్థ బాధ్యులు 200 పీపీఈ కిట్లను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్‌ జిల్లా అధ్యక్షుడు బాల్నె శరత్‌బాబు, ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌, సెక్రటరీలు సత్యనారాయణరెడ్డి, ప్రేమ్‌ సాగర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సురేందర్‌, కమిటీ సభ్యులు శాఖమూరి అమర్‌, భాస్కర్‌, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో నారాయణరావు పాల్గొన్నారు.