బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Aug 06, 2020 , 03:04:02

సర్వాంగ సుందరంగా ఆచార్య జయశంకర్‌ సార్‌ స్మృతి వనం

సర్వాంగ సుందరంగా ఆచార్య జయశంకర్‌ సార్‌ స్మృతి వనం

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి సందర్భంగా ప్రతి ఊరూ ఆయనను యాది చేసుకుంటున్నది. ఆయనకు గుర్తుగా కుడా ఆధ్వర్యంలో బాలసముద్రంలో ‘జయశంకర్‌ స్మృతి వనం (ఏకశిలా పార్క్‌)ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేడు ఆచార్యుడి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. 

తెలంగాణనే కలగని..

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌, ప్రస్తుత వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూర్‌ మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు. తుదిశ్వాస వరకూ తెలంగాణనే కలగన్నారు. ఏడో తరగతిలోనే వందేమాతర గీతం ఆలపించి జాతిభక్తిని చాటుకున్న రోజు నుంచి మొదలైన ఆయన జీవన పోరాట ప్రస్థానం పతాకస్థాయికి చేరింది. 1952లో నాన్‌ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాదు.. ఆర్ట్స్‌ కాలేజీలో అయ్యదేవర కాళేశ్వరరావును నిలిదీసిన కాలం వరకు తెలంగాణ వెనుకుబాటుతనాన్ని అధ్యయనం చేసి తన చుట్టూ ఉన్నవాళ్లు ఆచరించేలా శాస్త్రీయతను రూపొందించారు. విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయుడిగా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా, వైస్‌ చాన్స్‌లర్‌గా ఏ స్థాయిలో ఉన్నా తన కలను విడిచిపెట్టలేదు. ఆ కల సాకారం కోసం అవసరమైన అధ్యయనాన్ని విడిచిపెట్టలేదు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా రైట్‌ టు లెఫ్ట్‌ అన్ని రాజకీయ పక్షాలనూ ఒప్పించి మెప్పించడంలో ఆచార్యుడు అలుపెరుగని అక్షరసాగు చేశారు. ఆయన జీవితాంతం అధ్యయనం, బోధనలోనే సంతృప్తి చెందారు. వాటి ద్వారానే ఆయన సమరాంగానికి సైనికుల్ని సిద్ధం చేశారు. ఏ రాజకీయ వాదమైన సరే తెలంగాణకు అనుకూలమని ఎవ్వరు మాట్లాడినా వారందరికీ జయశంకర్‌ సార్‌ గొంతుకయ్యారు. తెలంగాణ కోసమే ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్‌ఎస్‌కు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. ఎవరెన్ని పోరాట రూపాలను ఎంచుకున్నా చివరికి రాజకీయ నిర్ణయంతోనే తెలంగాణ సిద్ధిస్తుందని బలంగా నమ్మి అందుకోసమే పుట్టిన టీఆర్‌ఎస్‌పై, ఆ పార్టీ అధినేత, ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణశీలతను, ఆయన పట్టుదలను అందరి కంటే ఎక్కువ విశ్వసించిందీ ఆచార్య జయశంకరుడే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులను, మంత్రి పదవులను రాజీనామా చేసిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమైనా జయశంకర్‌ మాత్రం అదే అసలైన నిర్ణయంగా ప్రకటించారు. ఓవైపు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు, మరో వైపు జయశంకర్‌ సార్‌ ఆలోచనా విధానానికి ఏకరూపకత సాధించేందుకు ప్రధాన భూమిక పోషించింది ఆ ఇద్దరికీ ఉన్న తెలంగాణ సాధన కమిట్‌మెంట్‌ అనే చెప్పొచ్చు. ఆచరణ శీలత అనేది తెలంగాణ వచ్చిన తర్వాతే అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఒకరంటే ఒకరికి అభిమానం, ఒకరి ఆచరణపై మరొకరికి నమ్మకం. అందువల్లే ఇద్దరూ తెలంగాణకు పూర్వజన్మ సుకృతంగా నిలిచారు.

జయంతికి ఏర్పాట్లు

హన్మకొండ : ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 87వ జయంతి వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, గ్రామ స్థాయిలో జయంతి వేడుకలు జరుపుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అభిమానులు ప్రొఫెసర్‌ జయంతి వేడుకలను జరుపుకోవాలని సూచించారు.  


logo