బుధవారం 30 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 05, 2020 , 05:28:51

కరోనాతో భయం వద్దు : ఐఎంఏ

కరోనాతో భయం వద్దు : ఐఎంఏ

పోచమ్మమైదాన్‌, ఆగస్టు 4 : కరోనాతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలని వరంగల్‌ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తగట్టు శ్రీనివాస్‌ కోరారు. ఐఎంఏ హాల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ బారిన పడిన వైద్యులకు ఐఎంఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుని చికిత్స చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనాతో ప్రైవేట్‌ దవాఖానల్లో సిబ్బంది పనిచేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. నగరంలో ఓ వైద్యుడు కరోనా వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్‌ బైరి లక్ష్మీనారాయణ, డాక్టర్‌ పీ విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 

కొవిడ్‌ బాధిత ఉద్యోగులకు భరోసా కల్పించాలి

హన్మకొండ : కొవిడ్‌ బాధిత ఉద్యోగులకు భరోసా కల్పించాలని టీఎన్జీవో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. ఎంజీఎం ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న లాబ్‌టెక్నీషియన్‌ ఖుర్షీద్‌ కొవిడ్‌ వైరస్‌ బారినపడి మరణించడం ఉద్యోగలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అలాగే, కొవిడ్‌ విధుల్లో భాగంగా మరణించిన వారికి బీమా డబ్బులను వెంటనే అందించాలని పేర్కొన్నారు. ఖుర్షీద్‌ మృతికి సంతాపం తెలుపుతున్నామని, ఆయన కుటుంబానికి తమ సంపూర్ణ సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు. 

    జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద టెంపరేచర్‌ రికార్డు చేయాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించాలని, శానిటైజర్లు ఉపయోగించడం తప్పనిసరి చేయాలన్నారు. వారంలో ఒక రోజు కార్యాలయాన్ని సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో క్లీనింగ్‌ చేయించాలని, ఉద్యోగులను ప్రతి రోజు కాకుండా రొటేషన్‌ పద్ధతిలో కార్యాలయానికి హాజరయ్యేలా ప్రభుత్వం అనుమతించాలని, కార్పొరేషన్‌ పరిధిలో వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రవేశపెట్టాలని సూచించారు. కొవిడ్‌ బారిన పడిన ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌లో వైద్యం అందించాలని, ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని ఆయన కోరారు.


తాజావార్తలు


logo