సోమవారం 21 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 05, 2020 , 03:14:15

ప్రాణాయామం.. ఆయువు భద్రం

ప్రాణాయామం.. ఆయువు భద్రం

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై  శ్రద్ధ పెరిగింది. అందుకే వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో యోగాలో భాగమైన ప్రాణాయామం చేయడం ద్వారా సర్వరోగాలు దూరం కావడమే గాక ఆయువు భద్రంగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా బారి నుంచి తమను తమను కాపాకునేందుకు అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా పనిలో పడ్డారు. ఆరోగ్యంగా ఉండడమే నివారణోపాయామని చాలామంది పౌష్ఠిక ఆహా రం తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు యోగా సాధన చేస్తున్నారు. యోగా చేయడం ద్వారా శరీరంతో పాటు ప్రాణశక్తి దృఢమవుతుంది. అయితే యోగా అంటే కేవలం శరీరాన్ని వివిధ భంగిమల్లో వంచడం మాత్రమే కాదు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం కలయికని భారతీయ సనాతన యోగులు ‘యోగా’గా అభివర్ణించారు. మనిషి బతకడానికి ఆధారమైన ప్రాణవాయువు(ఆక్సిజన్‌)ను ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే శరీర వ్యవస్థ అంత సమర్థవంతంగా పనిచేస్తుంది. శ్వాస సంబంధ రుగ్మతలతో ప్రాణాలనే కోల్పోతున్న ప్రస్తుత సమయంలో యోగాలో భాగమైన ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకోవచ్చు.

సర్వరోగాలు మటుమాయం..

‘ప్రాణాయామేన యుత్తేన సర్వరోగ క్షయు భవేత్‌' అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే.. సర్వరోగాలు హరించిపోతాయని పతంజలి యోగాసూత్రాలు చెబుతున్నాయి. శ్వాస తీసుకోవడం(పూరకం), వదలడం(రేచకం), నిలిపి ఉంచడం(కుంభకం) లాంటి మూడు క్రియల ద్వారా శ్వాసను సరైన రీతిలో నియంత్రించడమే ప్రాణాయామంగా పేర్కొంటారు. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల బీపీ, హుద్రోగాలు వంటి శారీరక అనారోగ్యాలే కాకుండా ఒత్తిడి, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు తీరుతాయని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించాయి. 

ఊపిరితిత్తులు దృఢంగా..

కరోనా వైరస్‌ మనిషి ఊపిరితిత్తుల్లో తిష్టవేసి వాటిని బలహీనపరిచి, చివరికి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతుంది. ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణే, కావున ఇది శ్వాసకోశ వ్యవస్థకు మంచిది. ప్రాణాయామాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా అవసరమైనంత ప్రాణవాయువు అంది ఊపిరితిత్తులు దృఢంగా మారి వాటి సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసక్రియ ద్వారా పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్‌ ఎక్కువగా సరఫరా అవుతుంది. తద్వారా జీవకణాలు శక్తివంతమవుతాయి. ప్రాణాయామం సాధనలో శ్వాసక్రియను నిర్ణీత వేగానికి పెంచడం, తగ్గించడం వల్ల అంతర్గత అవయవాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి. 

మలినాల విసర్జనలో..

ప్రతిరోజు నీటితో కడగడం ద్వారా బాహ్య శరీరం శుభ్రపడుతుంది. అలాగే ప్రాణాయామం అంతర్‌ శరీరంలోని మలినాలను బయటకు విసర్జించి నిర్విషీకరణ చేస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలు శుభ్రమవుతాయి. ముక్కు నుంచి కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందున ప్రస్తుతం ముక్కుకు మాస్కులను ధరిస్తున్నాం. ప్రాణాయామంలోని నాడీశోధన్‌, కపాలబాతి, భస్త్రిక క్రియ ల ద్వారా ము క్కులోని నాసల్‌ ప్యా సేజ్‌ శుభ్రపడి ఎలాంటి క్రిములున్నా నశించే అవకాశాలున్నాయి. 

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై  శ్రద్ధ పెరిగింది. అందుకే వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో యోగాలో భాగమైన ప్రాణాయామం చేయడం ద్వారా సర్వరోగాలు దూరం కావడమే గాక ఆయువు భద్రంగా ఉంటుంది.

వ్యాధి నిరోధక శక్తిలో కీలకం..

ప్రాణాయామంలో వేగంతో చేసే కపాలబాతి, నియమబద్ధ యోగిక్‌ క్రియలు శరీరంలో రక్తప్రసరణలను పెంచడం వల్ల శరీర మార్గాలకు సక్రియ చేకూరి శక్తిస్థాయులు పెరుగుతాయి. మనుషులకు వచ్చే అన్ని రోగాలకు ఆ వ్యక్తి శరీర వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపాలే మూల కారణం. క్రమపద్ధతిలో ప్రతినిత్యం చేసే ప్రాణాయామ సాధనతో శరీరానికి ప్రాణవాయువు విస్తృతంగా లభించడంతో రక్తం శుద్ధి జరిగి, ప్రతిఒక్క జీవకణానికి శక్తి అంది రోగనిరోధక శక్తి ఉద్దీపనమవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సంబంధిత వైద్యుల సూచనమేరకు యోగా గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే ప్రాణాయామం సాధన చేయాలి. ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో మాత్రమే చేసే సాధన మంచి ఫలితాలను అందిస్తుంది. రోజులో ప్రాణాయామానికి వెచ్చించే కొద్దిపాటి సమయం ఆయువును రక్షించేందుకు తోడ్పతుంది.

కొన్ని ప్రాణాయామ క్రియలు..

భస్త్రిక ప్రాణాయామం : భస్త్రిక అంటేనే నిప్పుకొలిమి చేసే శబ్దం అని అర్థం. ఈ ప్రాణాయామంలో తీసుకునే శ్వాసక్రియ ఉచ్ఛాస నిశ్వాసలు వేగంగా ఉంటాయి కనుక దీనికి ఆ పేరువచ్చింది.  ఈ ప్రాణాయామాన్ని చేసేటపుడు శరీరం అడగకుండానే ఎక్కువ పరిణామంలో ఆక్సిజన్‌ పంప్‌ చేస్తుంది. శరీరానికి కావాల్సినంత ప్రాణశక్తిని ఈ ఒక్క క్రియ ద్వారా లభిస్తుంది.

ఉపయోగాలు : భస్త్రిక ప్రాణాయామంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సైనస్‌, బ్రోన్కైటిస్‌, ఇతర శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది.

నాడీశుద్ధి ప్రాణాయామం : నాడి అనేది సంస్కృత పదం, దీని అర్థం ‘సూక్ష్మ శక్తి చానల్‌', శుద్ధి అంటే ప్రక్షాళన అని అర్థం. ఈ ప్రాణాయామ సాధనతో సూక్ష్మశక్తి మార్గాలను శుభ్రపరిచి, తద్వారా ప్రాణం శరీరం ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. చేతి వేళ్లతో ఒక ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చుకుని, మరొక ముక్కు రంధ్రం నుంచి గాలిని వదిలేసి, గాలి వదిలిన ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చుకుని, తిరిగి వేరే ముక్కు రంధ్రం నుంచి వదిలి వేసే ఈ ప్రక్రియను అనులోమ విలోమ, నాడీ శుద్ధి ప్రాణాయామమంటారు. తీసుకునే, వదిలే శ్వాసల్లో సమానత్వం పాటించాలి. అవిశ్రాంతంగా జరిగే శ్వాసక్రియల్లోనే అంతర కుంభకం, బాహ్య కుంభకం రెండు ప్రక్రియల ద్వారా శరీరంలోని శక్తిస్థాయిలు ఉన్నత స్థితికి చేరుకుంటాయి.

ఉపయోగాలు : నిరంతర సాధనతో సిస్టోలిక్‌, డయాస్టోలిక్‌ రక్తపోటును తగ్గిస్తుంది. కరోనా సమయంలో ఏర్పడే శ్వాసకోశ సమస్యలను, ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఎడమ, కుడి నాడీలను సమతుల్యం చేసి ప్రాణశక్తి ఛానల్‌ క్రియాశీలకంగా పనిచేసేలా చేస్తుంది.

కపాలభతి: కపాలభతి అంటే అగ్నిశ్వాస అని అర్థం. సంస్కృతంలో కపాల అంటే పుర్రె, భతి అంటే ప్రకాశించడం. ఇందులో శ్వాసను తీసుకోవడం ఉండదు. కేవలం శ్వాసను స్థిరమైన వేగంతో వదిలేస్తూ.. పొట్టను వెనక్కు నెట్టాలి. తద్వారా పొట్టలోని అనవసర వాయువులు బయటికి వెళతాయి. శ్వాసను శక్తివంతంగా విసర్జించడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం రెట్టింపవుతుంది.

ఉపయోగాలు : జీవక్రియ రేటును పెంచడమే కాకుండా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. శరీరంలోని సూక్ష్మ శక్తి మార్గాలను శుభ్రపరుస్తుంది. నాడీ వ్యవస్థను శక్తివంతం చేసి మెదడు కణాలను చైతన్యపరుస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడంతో పాటు అది పోషకాలను సమీకరించుకునేందుకు తోడ్పతుంది.

ప్రాణశక్తిని పెంచుతుంది..

నిరంతరం ప్రాణాయాయం సాధన చేస్తే శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందడమే గాక సహజసిద్ధంగా ప్రాణశక్తి రెట్టింపవుతుంది. పూరక, రేచక, కుంభక క్రియలను సక్రమంగా, స్థిరమైన వేగంతో అర్థవంతంగా చేయడమే ప్రాణాయామం. ఎన్నో వేల ఏళ్ల నుంచి భారతీయ రుషులు పరిశోధించి దీనిని మానవాళికి అందించారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాయామ సాధన శ్రేయస్కరం. శ్వాసకోశ సమస్యలను నియంత్రించడమే కాకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. - ప్రభుచైతన్య, యోగా గురువు


logo