మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 05, 2020 , 03:02:49

కరోనా బాధితులకు భరోసా

కరోనా బాధితులకు  భరోసా

పోచమ్మమైదాన్‌, ఆగస్టు 4 : కరోనా పాజిటివ్‌ బాధితులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పిస్తుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ కేఎంసీలో పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ దవాఖాన భవనం పనులను చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ హరిత, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు మందులు, పడకల కొరత రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీ భవనంలో మరో 200 పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికి అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేయడానికి వైద్య సిబ్బంది ముందుకు రావాలని కోరారు. కరోనా బాధితుల వైద్య పరీక్షల కోసం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్స్‌ సరిపోను ఉన్నాయన్నారు. ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. ఎంజీఎంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ఎంజీఎంలో ఎవరూ పనిచేయడం లేదని అనడం సరికాదన్నారు. లోపాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.   

12న కేఎంసీలో ప్రత్యేక కొవిడ్‌ బ్లాక్‌ ప్రారంభం 

కేఎంసీలోని సూపర్‌స్పెషాలిటీ భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ బ్లాక్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ నెల 12న ప్రారంభిస్తారని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. తొలుత 120 పడకలకు అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మూడు అంతస్తుల్లో కరోనా బాధితులకు సేవలందేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వ్యాధి తీవ్రతను బట్టి  పడకలను పెంచుతామన్నారు. ఇటీవల ఈ భవనం పెండింగ్‌ పనుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా రూ.12కోట్లు ఇచ్చారని  దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే ఎంజీఎంలో కరోనా పేషంట్లకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు నాణ్యమైన భోజనం కోసం నూతన కాంట్రాక్టర్‌ను నియమించామని వివరించారు. అలాగే, ఎంజీఎం సూపరింటెండెంట్‌ రాజీనామా విషయంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేదని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్‌డీవో వాసుచంద్ర, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, తహసీల్దార్‌ కిరణ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు. 


logo