శుక్రవారం 14 ఆగస్టు 2020
Warangal-city - Aug 02, 2020 , 08:38:15

వీడిపోనిది స్నేహ‌మొక్క‌టే..

వీడిపోనిది స్నేహ‌మొక్క‌టే..

  •  జీవితంలో మధుర జ్ఞాపకం స్నేహం
  •  రక్తబంధం కన్నా గొప్పది
  •  సోషల్‌ మీడియాతో పెరిగిన అంతరం
  •  వాట్సాప్‌, ఫోన్లోనే పలకరింపులు
  •  నేడు స్నేహితుల దినోత్సవం

నర్సంపేట రూరల్‌/చెన్నారావుపేట : స్నేహం ఒక మధుర జ్ఞాపకం. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా సాగే జీవన పోరాటంలో ఎంతోమంది మనతో కలిసి ఉన్నా అతికొద్ది మంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతారు. అది కష్టమైనా, సుఖమైనా ఎలాంటి సందర్భంలోనైనా మన వెన్నంటి ఉండేవాళ్లే స్నే‘హితులు’. ఎల్లకాలం ఉండే స్నేహబంధం.. రక్తబంధం కంటే గొప్పది. అలాంటి గొప్ప అనుభూతిని సంబురంగా మార్చుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఫ్రెండ్‌షిప్‌ డే.

ఫ్రెండ్‌షిప్‌ డే ఎలా వచ్చిందంటే..

1935లో యూఎస్‌ఏ ప్రభుత్వం ఒక వ్యక్తికి మరణ శిక్షణ వేసింది. అది భరించలేక అతడి స్నేహితుడు మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రుడి మరణాన్ని తట్టుకోలేక అతడు తనువు చాలించిన రోజు ఆదివారం. ఇలా ఆగస్టు మొదటివారంలో వచ్చే ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అప్పటినుంచి ప్ర పంచ వ్యాప్తంగా వైభవంగా ఫ్రెండ్‌షిప్‌ డే జరుపుకొంటున్నారు. మం చి స్నేహితులతో గడిపిన క్షణాలు చివరి దాకా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. స్నేహానికి బాల్యదశలో పునాదులు పడతాయి. ఆ వయస్సులో ఏర్పడిన స్నేహం దృ ఢంగా, మధురంగా ఉంటుందంటారు. వారికి ఉన్న పరిచయాలను బట్టి కొందరికి తక్కువగా మరికొందరికి ఎక్కువ మంది ఉంటారు. పాత రోజుల్లో స్నేహాల పరిస్థితి వేరు. ప్రస్తుత స్నేహాల పరిస్థితి వేరు.

 పెరిగిన అంతరం

ప్రస్తుతం స్నేహితుల మధ్య అంతరం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు కావచ్చు.. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మిత్రుల ప్రత్యక్ష పలకరింపులు తగ్గాయని చెప్పవచ్చు. వీటికి ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ కూడా కారణం కావచ్చు. స్మార్ట్‌ఫోన్లు వచ్చినప్పటి నుంచి సోషల్‌ మీడి యా ప్రభావం యువతపై ఎక్కువగా పడింది. ఒకప్పుడు ఎంత దూరంలో ఉన్నా తరచూ కలుసుకునే స్నేహితులు కేవలం వాట్సాప్‌ చాటింగ్‌లకే పరిమితమయ్యారు. దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండడంతో ప్రత్యక్షంగా కలుసుకునే సందర్భాలు అరుదుగానే ఉంటున్నాయి. అదే సమయంలో సోషల్‌ మీడియాతో కొత్త స్నేహితుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్స్‌, మెయిల్స్‌, చాటింగ్‌ తదితర వాటి సహాయంతో చేసే స్నేహం కలుసుకోవడం ద్వారా జరిగే అనుభూతిని దూరం చేస్తుందని చెప్పవచ్చు. స్నేహాలు చిరకాలం ఉండాలంటే తోటి మిత్రులను ఎక్కువగా కలుసుకోవాలి. స్నేహితుల యోగక్షేమాలు, మంచి, చెడులు తెల్సుకోవడంతో పాటు వారి కష్ట, సుఖాల్లో పాలు పంచుకోవాలి. రాష్ట్రంలో 35శాతం మంది స్నేహితులు మాత్రమే తమ స్నేహితులను ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడుతున్నట్లు గణాంకాల్లో తేలింది. స్నేహానికి మించినది ఈలోకాన ఏదీలేదని విద్యావేత్తలు చెబుతున్నారు. దేవుడు తల్లిదండ్రులను ఇస్తే మంచి స్నేహితులను ఎంచుకునే అవకాశం మనకే ఇచ్చాడు. తల్లిదండ్రుల తర్వాత స్థానం స్నేహితులదే.

పాత మిత్రులను ఏకం చేస్తున్న ఫేస్‌బుక్‌

ఇంటర్నెట్‌ రాకతో ఓ వైపు స్నేహితుల మధ్య దూరం పెరుగుతుండగా, పాత్ర మిత్రులను కలుపుతోంది. చదువుకోసమో, ఉద్యోగం కోసమే దూర ప్రాంతాలకు వలస వెళ్లిన స్నేహితులను ఫేస్‌బుక్‌ ఏకంచేస్తోంది. పదేళ్ల క్రితం విడిపోయి, దూరమైనందుకు బాధపడ్డ చాలామంది ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల వల్ల దగ్గరయ్యామని సంబురపడుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులు ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు.

స్నేహం విలువ పెంచాలి..

సమాజంలో విష సంస్కృతి పెరిగిపోయింది. ప్రస్తుత తరుణంలో స్నేహం విలువలను పెంచడంలో యువతరం ముందుండాలి. స్నేహంలో నమ్మకద్రోహానికి, మోసాలకు తావివ్వొద్దు. ఆత్మీయుల కన్నా మిన్నగా అండగా నిలిచే నిజమైన స్నేహమే కలకాలం నిలుస్తుంది. కష్టాలు, నష్టాలు, ఆపద సమయాల్లో వెన్నంటి ఉండేవారే నిజమైన స్నేహితులు. రక్త బంధం కన్నా స్నేహ బంధం గొప్పదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఆపద సమయాల్లో వెన్నంటి ఉంటూ కష్టాల్లో పాలు పంచుకునే వారే నిజమైన స్నేహితులు. చిరకాలం ఉండే స్నేహం విలువను పెంచాల్సిన అవసరం అందరిపై ఉంది.

స్నేహితులను ఎంచుకొనే విధానం..

స్నేహితులను ఎంచుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్నేహానికి విలువ ఇచ్చేవారు, తోటి వారు ప్రయోజకులయ్యేందుకు తోడ్పడే వారు, చెడు తిరుగుళ్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉన్న వారిని, పరిస్థితులను అర్థం చేసుకునే వారే నిజమైన స్నేహితులు. స్నేహితుల మధ్యలో స్వార్థపు ముసుగులు ఉండకూడదు. ప్రస్తుత సమాజంలో కొంత అలాంటి ధోరణి కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్నేహం అనేది చచ్చేంత వరకు విడిపోని బంధంలా ఉండాలే తప్ప, అవసరానికి వాడుకొనేలా కాదు. స్నేహం స్నేహితుడి హితాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తుంది. పిల్లల స్నేహాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ సరైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉండాలి. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్నేహితుడిని ఎంచుకొన్న తర్వాత ఆచరించడం, అనుకరించడం చాలా ముఖ్యం.

ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు సిద్ధం

జిల్లాలోని పలు దుకాణాల్లో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నో రకాల బ్యాండ్‌లు మార్కెట్‌లోకి వచ్చా యి. రబ్బర్‌, లెదర్‌, ధారంతో తయారు చేసినవి కూడా ఉన్నాయి. కొందరు స్నేహితులకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కట్టి గిఫ్ట్‌లు కూడా ఇ స్తారు. యువతను ఆకట్టుకునేందుకు గాను వారికి కావాల్సిన కొత్త కొత్త మోడల్‌ గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ తెప్పించారు.


తాజావార్తలు


logo