బుధవారం 05 ఆగస్టు 2020
Warangal-city - Aug 01, 2020 , 02:05:38

ఆలయాల్లో శ్రావణ సందడి

ఆలయాల్లో శ్రావణ సందడి

  •  ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

వరంగల్‌ కల్చరల్‌, జులై 31 : పవిత్ర శ్రావణ మాస వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. భద్రకాళీ దేవాలయం, శ్రీ రాజరాజేశ్వరీ ఆలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. ములుగురోడ్‌లోని వాసవీ మాత ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని శ్రీ సంతోషీమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సిద్ధేశ్వరాలయంలో శ్రీ లక్ష్మీమాత ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకం, బిల్వ పుష్పార్చన, మహాహారతి నిర్వహించారు. హన్మకొండ శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో పద్మాక్షి అమ్మవారికి షోడాషకలాశాభిషేకం, ద్రవ్య లక్ష్మీతో (వెయ్యి రూపాయలతో) అమ్మవారిని అలంకరించారు. కాగా, ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేసుకోవడానికి అనుమతి లేకపోవడంతో మహిళలు ఇండ్లలోనే వ్రత కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. భద్రకాళీ ఆలయ ఈవో సునీత, సూపరింటెండెంట్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదపండితులు నాగిళ్ల శంకర్‌శర్మ, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, సిద్ధేశుని రవికుమార్‌, సురేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. logo