శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Aug 01, 2020 , 01:53:58

ఇల్లే లోకం.. మాస్కే శరణ్యం!

ఇల్లే లోకం.. మాస్కే శరణ్యం!

  • n కాలు బయట పెట్టనివ్వని కరోనా
  • n రోజురోజుకూ వ్యాపిస్తున్న వైరస్‌
  • n ఇల్లు విడిచి వెళ్లాలంటే జంకుతున్న జనం
  • n మూడు నెలలుగాబంధుమిత్రులకు దూరం
  • n ఏ కార్యమైనా కలుసుకోలేని దుస్థితి
  • n ఫోన్‌లోనే మాటామంతీ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
  • n జాగ్రత్తలకు ప్రాధాన్యం.. మారిన జీవనశైలి

ఐనవోలు/ చెన్నారావుపేట: కరోనా.. మనిషి జీవనశైలినే మార్చేసింది. రోజురోజుకూ వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పెళ్లి, పుట్టినరోజు.. ఇలా ఏ వేడుకైనా బంధుమిత్రుల సందడి లేక వెలవెలబోతున్నది. శుభకార్యమైనా.. అయినవాళ్లకు ఏదైనా కష్టమొచ్చినా ఫోన్లో మాట్లాడి తెలుసుకోవడం తప్ప నేరుగా కలిసి మంచీచెడు పంచుకోలేని దుస్థితి వచ్చింది. మాస్క్‌లు ధరిస్తూ, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ మహమ్మారి బారిన పడకుండా ఎవరికి వారు ఇల్లే లోకంగా బతకాల్సి వస్తున్నది.  

ఫంక్షన్లకు దూరం..

కరోనా తీవ్రత మొదలైన ఫంక్షన్లల్లో సందడి తగ్గిపోయింది. సాధారణంగా ఏ శుభకార్యమైనా హంగూఆర్భాటాల మధ్య వందలాది మం ది బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. ఫంక్షన్‌ అంటేనే ఒక సా మూహిక వేడుక. అందులో పెళ్లంటే కొన్ని రోజుల ముందునుంచే ప్లానింగ్‌ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో, ఇంకొందరు విమానాల్లో తమ పనులు వాయిదా వేసుకొని పెళ్లి మంటపానికి చేరుకునే వారు. వారం రోజుల పాటు ఇలా హడావిడిగా సాగే ఆ వేడుక కరోనా రాకతో కళ తప్పింది. స్నేహితులు, శ్రేయోభిలాషులే కా దు కనీసం బంధువులు రాలేకపోతున్నారు. కేవలం పరిమిత సంఖ్యలోనే ఆహ్వానిస్తూ మమ అనిపిస్తున్నారు. ఓ వైపు శ్రావణమాసం మొదలై మంచి ముహుర్తం నాడు పెళ్లి చేసుకుంటున్నందుకు సంబురపడాలో.. అతిథులెవ్వరూ రాలేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో నూతన వధూవరులు మాస్కులు కట్టుకొని పెళ్లిపీటలెక్కుతున్నారు.

సాదాసీదాగా బర్త్‌డేలు..

అంతేకాదు పిల్లల పుట్టినరోజు ఫంక్షన్‌ అంటే వాళ్ల వయస్సు వాళ్లే గాక అందరూ వస్తుంటారు. ఇక అపార్ట్‌మెంట్‌లో బర్త్‌డే పార్టీల గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి బర్త్‌డే కేక్‌ కోసం బేకరీల వైపు వెళ్లకుండా యూట్యూబ్‌లో చూసి, నేర్చుకొని ఇంకొందరు ఇంట్లోనే వాటిని తయారుచేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వాటితో సాదాసీదాగా ఫంక్షన్‌ చేసుకొని పరిమిత సంఖ్యలో చుట్టుపక్కల వారిని ఆహ్వానిస్తూ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అది కూడా మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటిస్తూనే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

ఎలాంటి మాస్కులు వాడాలి..

మెడికల్‌ లేదా క్లాత్‌ మాస్కులను వాడవచ్చు. మెడికల్‌ మాస్కులను ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు మాత్రమే ధరించాలి. ఒకవేళ మెడికల్‌ మాస్కులు వాడినైట్లెతే ఒక్కసారి మాత్రమే వినియోగించి పారవేయాలి. క్లాత్‌ మాస్కులు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు అని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అంతేగాక క్లాత్‌ మాస్కులను వాడిన తర్వాత వాటిని ప్రతిరోజూ శుభ్రంగా నీటిలో సబ్బుతో గానీ డెటాల్‌తో గాని కడుక్కొని వాడుకోవాల్సి ఉంటుంది.

మాస్కు ఇలా ధరించాలి..

మాస్కు ధరించినప్పుడు ముక్కు, నోరు పూర్తిగా మూసి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మాస్కు బయటి భాగాన్ని వీలైనంత వరకు చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఒకవేళ దానికి వైరస్‌ ఉంటే అది చేతుల ద్వారా అంటుకునే ప్రమాదం ఉంటుంది.

క్లాత్‌ మాస్కులను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా రెండు, మూడు రోజులకొకసారి శుభ్రం చేసుకున్నైట్లెతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.

 క్లాత్‌ మాస్కులను వేడి నీటితో శుభ్రం చేసి ఎండలో అరబెట్టిన తర్వాతే ముఖానికి వాడాల్సి ఉంటుంది.

ఎలాంటి ప్రదేశాల్లో ధరించాలి..

రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పకుండా మెడికల్‌ లేదా క్లాత్‌ మాస్కులను ధరించాలి.

ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతిసారి మాస్కు ధరించాలి.

కార్యాలయాల్లో గానీ లేదా బయటికి వెళ్లినప్పుడు ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి.

మాస్కు వాడకుంటే రిస్క్‌..

కరోనా వైరస్‌ అనేది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ద్రవ రూపంలో ఉండే తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా వైరస్‌ ఎదుటి వారి శ్యాసకోశ వ్యవస్థలోకి సులువుగా ప్రవేశిస్తుంది. కరోనా వైరస్‌ అనేది తుంపర్లలో మూడు గంటల పాటు బతికే ఉంటుంది. కనుక ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను వాడడం వల్ల వైరస్‌ సోకిన వారి తుంపర్లు ఇతరులపై పడకుండా మాస్కులు అడ్డుగా నిలవడంతో పాటు శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.

అన్నీ ఫోన్‌లోనే..

ప్రస్తుతం అన్నింటికీ ఫోన్‌ మాత్రమే పెద్ద దిక్కయ్యింది. అనారోగ్యంతో ఉన్న వారినైనా, చనిపోయిన వారి కుటుంబ సభ్యులనైనా ఫోన్‌లోనే పరామర్శించాల్సి వస్తోంది. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతానికి వెళ్లి ప్రమాదం కొనితెచ్చుకొనే కంటే దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నారు. అందుకే కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎంత దగ్గరి బంధువైనా వారి దగ్గరికి వెళ్లేందుకు సాహసించడం లేదు. తప్పనిసరి పరిస్థితిలో మాస్కులు పెట్టుకొని, శానిటైజర్‌ వెంట తీసుకొని బయల్దేరుతున్నారు. అది కూడా భయంభయంగానే.

ఒంటరిగా బాల్యం..

స్కూల్‌కు రెండు రోజులు సెలవులొచ్చాయంటేనే పిల్లల్లో చెప్పలేనంత సంబురం. బతుకమ్మ, దసరా పండుగప్పుడు పది, పదిహేను రోజులు.. పరీక్షలు అయిపోయాక మహా అంటే ఒక నెలన్నర రోజులు ఆ ఊరికి, ఇంకో ప్లేసుకి చక్కర్లు కొట్టొచ్చేవాళ్లు. మరి ఇప్పుడు పండుగా పబ్బం, ఉత్సవాలేవీ కాదు కదా.. కేవలం కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఆ చిన్నారులంతా ఇంటిపట్టునే కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి. తరగతి గదిలో ప్లేగ్రౌండ్‌లో, లంచ్‌ టైమ్‌ లో ఒకరికొకరు కలుసుకొని, మాట్లాడుకునే, పోట్లాడుకునే ఆ చిన్నారులు ఇప్పుడు దిగాలుగా ఆ నాలుగు గోడల మధ్యే ఉంటున్నారు. అటు పాఠాలు చెప్పే టీచర్లుగా, ఆటలాడి, ముచ్చట్లు చెప్పే స్నేహితులుగా ఇలా ఏదైనా అమ్మానాన్నలతో రోజంతా గడుపుతున్నారు.

చాలా జాగ్రత్తగా ఉండాలి..

కరోనా రోజురోజుకు వేగంగా వాప్తి చెందుతోంది. కొద్దిరోజుల క్రితం పట్టణాలు, నగరాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. బయటికి వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా మాస్కు ముఖానికి ధరించి బయటికి రావాలి. లేకపోతే తుంపర్ల ద్వారా వైరస్‌ శ్వాస వ్యవస్థలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

- ఉషారాణి, వైద్యాధికారి, చెన్నారావుపేట