గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jul 29, 2020 , 02:00:43

కరో నయా మార్గం

కరో నయా మార్గం

వరంగల్‌ నగరంలో కూరగాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. వినియోగంతో పాటే అమ్మేవారి సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు మార్కెట్‌కే పరిమితమైన కూరగాయలు, పండ్లు.. ఇప్పుడు ప్రతిచోటా దొరుకుతున్నాయి. కొన్ని ఏరియాల్లోనైతే దారి వెంట వరుసగా స్టాళ్ల మాదిరిగా వెలిశాయి. ఆటోట్రాలీల్లో మైక్‌ పెట్టుకొని అమ్మేవాళ్లు.. ఇంటింటా తిరిగే వాళ్లు సరేసరి. కరోనా కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మూసిఉంటున్నాయి. అడపాదడపా తెరిచినా బయటి ఆహార పదార్థాలు తినాలంటేనే జనం జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఇంట్లోనే వంట చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లోనూ కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది.

వీధివీధినా వ్యాపారం..

ప్రతి వీధిలో కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయ్‌. కరోనాతో కుదేలైన చిరు వ్యాపారులు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. పెట్టుబడి కూడా తక్కువే కాబట్టి ముందుడగు వేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు కిరాణా దుకాణాలున్న వారు సైతం కూరగాయలు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడచూసినా మిగతా వాటికి అంతగా గిరాకీలు లేకపోవడం వల్ల అందరూ నిత్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కూరగాయల బాట పడుతున్నారు. ఉదయాన్నే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలను తక్కువ ధరలకు తీసుకురావడం, ఓ వీధి చివర కొంత గిట్టుబాటు ధరకు అమ్మడం, మిగిలిన వాటిని ఇంట్లోకి వాడుకోవడం, కొన్ని వారి బంధువులకు, శ్రేయోభిలాషులకు పంపిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఇలా ప్రతీ ఒక్కరికి అనువుగా ఉండడం వల్ల వెల్లుల్లి, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీన వంటివి తెచ్చుకొని రోడ్ల పైన అమ్మేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పైగా పనిలేదనే సమస్యలేకుండా రోజుకు రూ.800ల నుంచి 1000 దాకా సంపాదిస్తున్నారు.

అన్నీ అమ్ముడువోతాన్నయ్‌..

మా ఊరిలో మాకు కొంచెం వ్యవసాయం ఉంది. దాంట్ల కూరగాయలు పండిస్తున్నం. అవి గాక మార్కెట్‌కు పోయి ఇంకొన్ని కూరగాయలు తెస్తున్న. వాటిని ఎన్‌జీవోస్‌ కాలనీ రోడ్డు పక్కన అమ్ముతున్న. గిరాకీ ఎప్పటి లెక్కనే ఉంటాంది. గీ కరోనా మొదలైనకాన్నుంచి ఎక్కడెక్కడోళ్లో వచ్చి ఇక్కడ కాయగూరలమ్మవట్టె. అయినా ఎవ్వలకచ్చె గిరాకీ వాళ్లకత్తాంది. ఎన్ని కూరగాయలు పెడితే అన్ని అమ్ముడువోతాన్నయ్‌. - చల్లాయి శ్రీనివాస్‌, కూరగాయల వ్యాపారి, దేవన్నపేట

అంతటా దొరుకుతున్నాయ్‌..

ఇదివరకు పొద్దున్నే సైట్‌ మీదికి వెళ్లేవాళ్లం. అంత పొద్దున్నే ఇంట్లో వంట చేయరు కదా. బయట టిఫిన్‌, మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్‌, లేదా చికెన్‌ మంచూరియా లాంటివి తినేవాళ్లం. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బయటి ఫుడ్‌ తినాలంటే నాకే కాదు.. అందరికీ భయమే. ఎక్కడ కరోనా సోకుతుందోనేమోనని ఏమున్నా ఇంట్లోనే చేసుకుంటున్నాం. అలా కూరగాయలు, పండ్ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మార్కెట్‌కు వెళ్లే పని తప్పింది. రోడ్డుపైకి వస్తే చాలాచోట్ల దొరుకుతున్నాయి.

- హరిప్రసాద్‌, వినియోగదారుడు, హన్మకొండ


logo