శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jul 29, 2020 , 02:00:45

కరోనా వైరస్‌పై ఆందోళన చెందొద్దు

కరోనా వైరస్‌పై ఆందోళన చెందొద్దు

 ప్రత్యేక పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌, జూలై 28 : ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా నగర ప్రజలకు కీలకమైన సేవలందిస్తున్న బల్దియా ఉద్యోగులు, సిబ్బంది అధైర్యపడొద్దని నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన మంగళవారం బల్దియా ఉద్యోగులతో ఫోన్‌లో మాట్లాడారు. బల్దియా ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్న ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. బల్దియా ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యంగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. హోం క్వారంటైన్‌లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్‌ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు. నగరంలోని 14 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కరోనా నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్‌ అందజేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులు అధైర్య పడకుండా 17 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండి వైద్యులు ఇచ్చిన మందులు వాడితే కరోనాను జయించవచ్చని అన్నారు. కరోనాసోకిన వారు త్వరగా కోలుకోవాలని మేయర్‌ ఆకాంక్షించారు.

రెండో రోజూ బల్దియాలో కరోనా పరీక్షలు

ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మంగళవారం రెండో రోజూ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌ పరీక్షల శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న ఉద్యోగులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మానసిక ైస్థెర్యంతోనే కరోనాను జయించవచ్చని ఆయన అన్నారు. 44 మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ అరవింద, సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుమన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ బాకం సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.