మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 24, 2020 , 01:28:32

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

  • n గ్రామగ్రామాన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ
  • n ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

వర్ధన్నపేట: కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండడంతో కట్టడికి అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పిచికారీ చేయిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజల్లో ధైర్యం నింపుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లందలో వైద్య సిబ్బంది గురువారం ఇంటింటి సర్వే చేపట్టారు. సర్పంచ్‌ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వార్డుల వారీగా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వెంటనే సీహెచ్‌సీకి తరలిస్తున్నారు. అనుమానితులకు పరీక్షలు చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సీహెచ్‌సీ వైద్యులకు సూచించారు.

హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

ఆత్మకూరు: మండలకేంద్రంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు కార్యదర్శి మేడ యాదగిరి తెలిపారు. వాడల్లో బ్లీచింగ్‌ ఫౌడర్‌ను చల్లించినట్లు చెప్పారు. ఉపసర్పంచ్‌ వంగాల స్వాతి భగవన్‌రెడ్డి, వార్డు సభ్యులు బయ్య రాజు, పాపని రవీందర్‌, నత్తి రవి, బైగాని రాజేందర్‌, కాడబోయిన రవి, కారోబార్‌ రాంబాబు, సిబ్బంది పొగాకుల రాజు, పెరుమాండ్ల సదానందం, నల్లాల రవి పాల్గొన్నారు.

సోమ్లాతండాలో..

సంగెం: మండలంలోని సోమ్లాతండాలో సర్పంచ్‌ హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే, బ్లీచింగ్‌ ఫౌడర్‌ చల్లించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, మాస్కులు ధరించాలని సర్పంచ్‌ మంగ్యనాయక్‌ కోరారు. ఆయన వెంట కారోబార్‌ సుమన్‌, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

స్వచ్ఛందంగా షాపులు బంద్‌

గీసుగొండ: వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మూడో డివిజన్‌ ధర్మారంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు అన్ని రకాల షాపులు బంద్‌ చేయాలని గ్రామస్తుల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గోలి రాజయ్య, రమేశ్‌, రాజయ్య, నాగరాజు, చిరంజీవి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో కరోనా విజృంభిస్తున్నందున స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించినట్లు తెలిపారు. వారి వెంట గ్రామస్తులు మోహన్‌, సురేందర్‌, కొమ్మాలు, నారాయణ, భరత్‌, శ్రీకాంత్‌, మహేశ్‌, సురేందర్‌ ఉన్నారు.

భయభ్రాంతులకు గురికావొద్దు

శాయంపేట: ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని పీహెచ్‌సీ వైద్యాధికారి నాగశశికాంత్‌ అన్నారు. మండలంలోని నేరేడుపల్లిలో ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.

‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి’

పరకాల: కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్డీవో కిషన్‌కు  వినతిపత్రం అందించారు. ఎస్‌ఎఫ్‌ఐ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి మంద శ్రీకాంత్‌, నాయకులు కల్యాణ్‌, వంశీ, అన్సర్‌, సీఐటీయూ నాయకుడు వీరేశ్‌ పాల్గొన్నారు.


logo