మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 24, 2020 , 01:15:27

‘కాళేశ్వర’ బలం సాగు గణం

‘కాళేశ్వర’ బలం సాగు గణం

  • రూరల్‌ జిల్లాలో అనూహ్యంగా పెరిగిన పంటల విస్తీర్ణం
  •  ‘హరిత’ జాతర చేద్దాం
  • నేడు మంత్రి కేటీఆర్‌  జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరూరా మొక్కలు నాటుదాం
  • జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు పాదుకోవాలి
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపు 

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సాగు గణనీయంగా పెరిగింది. ఈ ప్రాజెక్టును 2019 జూన్‌ 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించగా, గతేడాది నుంచి అందుబాటులోకి వచ్చింది. గత వానకాలం సీజన్‌లో కరీంనగర్‌లోని ఎల్‌ఎండీకి చేరిన కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీ కాలువల ద్వారా జిల్లా చెరువులకు తరలివచ్చింది. వేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. దీంతో భూగర్భ జలమట్టం పెరిగింది. దీనికి 24గంటల ఉచిత కరెంట్‌ సరఫరా తోడు కావడంతో యాసంగిలో చెరువులు, బోర్లు, బావుల కింద ఉన్న వ్యవసాయ భూములన్నింటినీ రైతులు సాగు చేశారు. సాగు విస్తీర్ణం పెరిగి, మున్నెన్నడూ లేని రీతి లో దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిలో వరంగల్‌రూరల్‌ జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో మక్క, 86 వేల ఎకరాల్లో వరి అనూహ్యంగా సాగులోకి వచ్చింది. జిల్లాలో ఇది రికార్డుగా అధికారులు ప్రకటించారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జిల్లాకు కాళేశ్వరం నీరు రావడం వల్లే ఇది సాధ్యమైంది. 

ఈ సారి ముందుగానే వరి నాట్లు

వానకాలం, యాసంగిలో జిల్లాలో ఎప్పుడూ ఆలస్యంగానే పంటల సాగు మొదలయ్యేది. ఇక్కడి రైతులు వర్షాలపై ఆధార పడడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. జిల్లాలో మైలారం, చలివాగు రిజర్వాయర్‌, పాకాల సరస్సు, 401 పంచాయతీల పరిధిలో 1,050 చెరువులున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రిజర్వాయర్లు, చెరువులు నిండేవి. భారీ వర్షాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో పడేవి. అప్పుడే చెరువుల్లోకి నీరు వచ్చేది. రిజర్వాయర్లు, చెరువుల్లోకి చేరిన వరద నీటితో ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు వరి నాట్లు వేసేవారు. వర్షాలు సమృద్ధిగా పడకుంటే  పాకాల వంటి సరస్సు, బోర్లు, బా వుల కింద మాత్రమే నాట్లు వేసేవారు. ఇలా ప్రతి సీజన్‌లో ఆలస్యంగా వరి నాట్లు పడడం వల్ల పంట దిగుబడి కూడా ఇతర జిల్లాల కంటే ఇక్కడ నెల రోజుల తర్వాతే వచ్చేది.

గత యాసంగిలో నూ ఇదే జరిగింది. యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వం కేవలం ఐదు జిల్లాల్లో మినహా ఇతర అన్ని జిల్లాల్లో గత జూన్‌ 8వరకే కొనుగోలు చేసింది. వరి దిగుబడి ఆలస్యంగా రావడంతో ఐదు జిల్లాల్లో కొనుగోళ్లను జూన్‌ 15దాకా పొడిగించింది. వీటిలో వరంగల్‌రూరల్‌ కూడా ఒకటి. ఏప్రిల్‌ 15వరకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీటిని ప్రభు త్వం చెరువుల్లో నింపడంతో వరంగల్‌రూరల్‌ జిల్లాలోని పలు చెరువులు ఎండాకాలంలోనూ మత్తళ్లు దుంకాయి. ఇప్పటికీ జలాలు నిల్వ ఉన్నా యి. వర్షాలూ కురుస్తున్నాయి. దీనికితోడు త్వరలో కాళేశ్వరం నీటిని ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇదే భరోసాతో రైతులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి జూన్‌లోనే నారు పోశారు. తొలిసా రి జూలైలో అంటే గతం కంటే నెలరోజుల ముందు వరి నాట్లు వేయటం మొదలుపెట్టారు. వర్ధన్నపేట, పరకాలలో నాట్లు ఊపందుకున్నాయి. తాజాగా నర్సంపేటలోనూ మొదలయ్యాయి. జిల్లాలో ఈ వానకాలం 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగుకు వ్య వసాయ శాఖ ప్రణాళికలు వేయగా ఇప్పటివరకు సుమారు పది వేల ఎకరాల్లో నాట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం జలాలతోనే ఇ లా జూలైలోనే వరి నాట్లు పడుతున్నాయని సర్వ త్రా రైతులు చర్చించుకుంటున్నారు. 

మత్తడి దుంకుతున్న చెరువులు

జిల్లాలోని 16మండలాల్లో మొత్తం 1,050 చె రువులున్నాయి. ఏప్రిల్‌ 15వరకు ఎస్సారెస్పీ కా ల్వల ద్వారా చెరువుల్లోకి నీరు రావడం, కొద్ది రో జుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో అన్ని చెరువుల్లోనూ ప్రస్తుతం నిండా నీరుంది. కొద్ది రోజుల నుంచి వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న 83 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిగతా వాటి లో 182 చెరువులు 75 నుంచి 100 శాతం, 269 చెరువులు 50 నుంచి 75 శాతం, 276 చెరువులు 25 నుంచి 50 శాతం, 240 చెరువులు 25 శాతం నీటితో ఉన్నట్లు జల వనరుల శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లోకి కాళేశ్వరం నీరు తరలుతున్నది. త్వరలో తొలి దశ పరిధిలో ఉన్న వరంగల్‌రూరల్‌ జిల్లాలో ని చెరువుల్లోకి కాళేశ్వరం నీరు రానుంది. దీంతో చెరువులన్నీ మత్తడి దుంకే అవకాశముంది.  

కాళేశ్వరం నీటితో రైతుల్లో సాగు భరోసా  


ప్రాజెక్టు నీటితో సాగుపై రైతుల్లో నమ్మకం ఏర్పడింది. గతంలో వర్షాల కోసం ఎదురుచూసేవారు. వర్షాలు పడితేనే నారు పోసేవారు. చెరువుల్లోకి వర్షపు నీరు వస్తేనే నాట్లు వేసేవారు. దీంతో ప్రతి వానకాలం సీజన్‌లోనూ ఆగస్టు, సెప్టెంబర్‌లో నాట్లు పడేవి. ఈసారి చెరువుల్లో ఇప్పటికే నీరుండడం వల్ల వర్షాల కోసం ఎదురుచూసే అవసరం లేకుండా జూన్‌లోనే నార్లు పోశారు. గతం కంటే నెల  ముందుగా ఈసారి వరి నాట్లు వేస్తున్నారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువుల్లో కాళేశ్వరం నీటిని నింపుతుందనే నమ్మకమే రైతులను ముందుకు నడిపిస్తున్నది.

    - టీ శ్రీనివాసరావు, ఏడీఏ, నర్సంపేట


logo