శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jul 21, 2020 , 01:34:12

ఉద్యాన రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు

ఉద్యాన రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు

 కేసముద్రంటౌన్‌: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడికి ఎకరానికి రూ.10 వేలు, రైతు బీమా, రుణ మాఫీ, 24 గంటల విద్యుత్‌ సరఫరా, నాణ్యమైన విత్తనాలు, మద్దతు ధర అందిస్తున్నది. ఈ క్రమంలో నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని సూచిస్తూ ఉద్యాన  రైతులను ప్రోత్సహిస్తున్నది. వీటి సాగును ఉపాధి హామీ పథకంలో చేర్పించి, పంటలకు నీటి సరఫరా కోసం డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టంను రైతులకు సబ్సి డీపై అందించనుంది. అయితే మొదటి దఫాగా మామిడి, నిమ్మ, జామ, సపోట వంటి తదితర పండ్ల తోటలకు, ఆయిల్‌ పామ్‌, శ్రీగంధం చెట్లు పెట్టిన రైతులకు సబ్సిడీపై బిందు సేద్య పరికరాలను ఇవ్వ నుంది. గతంలో జిల్లాకు డ్రిప్‌ యూనిట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి అధికంగా నిధులు కేటా యించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

రైతులను ప్రోత్సహించేందుకు..

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని రైతులు అవలంబిస్తున్నారు. ఆయా జిల్లాలకు అవసరమైన పంట ఉత్పత్తులను ఆ జిల్లాలోనే పండించేలా ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో జిల్లాలో పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, శ్రీగంధం సాగుపై రైతులకు ఉద్యాన వన శాఖ అధికారులు అవగాహన కల్పిసున్నారు. అధికంగా ఆదాయం వచ్చే ఈ పంటల సాగుతో రైతులకు లబ్ధి చేకూరనుంది. రాయితీలతోపాటు సాగులో తక్కువ ఖర్చు అవుతుండడంతో ఈ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పండ్లను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండడంతో ఇక్కడే పండించాలని ఉద్యాన అధికారులు నిర్ణయించారు. ఆయిల్‌పామ్‌ తోటలను విరివిగా నాటించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ భూసారాన్ని పరీక్షిస్తున్నారు. శ్రీగంధం, మల్బరీ, పండ్ల, ఆయిల్‌పామ్‌ తోటలను పెట్టిన, పెట్టనున్న రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలను అందిస్తుంది. డ్రిప్‌ని వినియోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నా యని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందించ నున్నారు. 

దరఖాస్తు విధానం..

మామిడి, జామ, నిమ్మ తదితర పండ్ల తోటలు, శ్రీగంధం, ఆయిల్‌పామ్‌, మల్బరీ వంటి వాటిని సాగు చేసే రైతులు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఫాం 1బీ, బ్యాంక్‌ ఖాతా పుస్తకం, పాస్‌ ఫొటోతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాలను సంబంధిత ఉద్యాన  అధికారులకు అందించాలి. 

  •  30 నుంచి 70 శాతం సాగునీరు ఆదా అవుతుంది.
  •  40 శాతం వరకు అధిక దిగుబడి వస్తుంది.
  •  విద్యుత్‌ వినియోగం 40 నుంచి 45 శాతం తగ్గుతుంది.
  •  కూలీల ఖర్చు 60 శాతం వరకు   తగ్గించవచ్చు.
  •  రసాయన ఎరువుల వాడకంలో 30 నుంచి 40 శాతం వరకు పొదుపు చేయవచ్చు. 
  •  కలుపు నివారణ ఖర్చును 60శాతం నుంచి 90శాతం వరకు ఉండదు.
  •  ఎండాకాలంలో తక్కువ నీటితో రెట్టింపు సాగు చేయవచ్చు.
  •  బిందు సేద్యం భూసారాన్ని      కాపాడుతుంది.