మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Jul 18, 2020 , 02:06:43

వెల్లివిరిసిన ఆనందం..

వెల్లివిరిసిన ఆనందం..

  • మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
  • ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని తిరుపతిలో గుర్తింపు
  • తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

చెన్నారావుపేట, జూలై 17: కుమారుడు ఏమయ్యాడో అని నిత్యం కుమిలిపోతున్న అమ్మానాన్నలకు పోలీసులు తీపికబురు చెప్పడంతో సంతోషం పట్టలేక పోలీస్‌స్టేషన్‌ వైపు పరుగులు తీశారు. ఇక రాడనుకున్న కొడుకు కళ్లెదుట సాక్షాత్కరించడంతో ఆ తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. మూడేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ ఇంటర్‌ విద్యార్థి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా పోలీసులు అతడిని తిరుపతిలో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట గ్రామానికి చెందిన ఉప్పుల వీరస్వామి, రజిత దంపతుల కుమారుడు వెంకటప్రసాద్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో 2017లో ఇంట్లో నుంచి వెళ్లపోయాడు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు వెతకని రోజూ లేదు. అయినా విద్యార్థి జాడ మాత్రం లభించలేదు. చివరకు ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఎస్సై శీలం రవి, కానిస్టేబుల్‌ సురేశ్‌ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

ఇలా మూడేళ్లు గడిచాయి. చివరకు విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్నాడని గుర్తించి స్థానిక పోలీసులు తిరుపతికి వెళ్లి పట్టుకున్నారు. దీంతో వెంకటప్రసాద్‌ను చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి శుక్రవారం స్టేషన్‌కు పిలిపించి వారికి అప్పగించారు. మూడేళ్ల తర్వాత కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇక లేడనుకున్న కుమారుడిని వెతికి పట్టుకొచ్చిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్‌ను పట్టుకున్న కానిస్టేబుల్‌ సురేశ్‌ను నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌, సీఐ తిరుమల్‌, ఎస్సై శీలం రవి, తోటి సిబ్బంది అభినందించారు.


logo