గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jul 18, 2020 , 02:05:36

న‌క‌రాల ఖైదీ

న‌క‌రాల ఖైదీ

  • ఎంజీఎం నుంచి పరారీ
  • గత నెల 29న దొంగతనం కేసులో అరెస్ట్‌
  • జైలుకు రాకముందే గతంలో పోలీసుల నుంచి ఎస్కేప్‌?
  • తాజాగా రెండోసారి ‘కరోనా’ పేరుతో నాటకాలు
  • గురువారం సాయంత్రం టెస్ట్‌ ఫలితం వచ్చేలోపు మళ్లీ జంప్‌
  • ఎట్టకేలకు జఫర్‌గఢ్‌లోని బంధువుల ఇంట్లో చిక్కిన వైనం

వరంగల్‌ క్రైం, జూలై 17: పలు దొంగతనాల కేసులో రిమాండ్‌ ఖైదీగా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్‌ కైసర్‌ ఎంజీఎం దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డు నుంచి గురువారం రాత్రి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మట్టెవాడ పోలీసులు 24 గంటల్లోగా ఖైదీని జఫర్‌ఘడ్‌లోని అతడి బంధువుల ఇంట్లో శుక్రవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జూలైవాడకు చెందిన సయ్యద్‌ కైసర్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 14 చోరీలకు పాల్పడ్డాడు. గత నెల 29న సుబేదారి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.


గత సీపీ రవీందర్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి అతడిని రిమాండ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. జూన్‌ 29న అరెస్టయిన కైసర్‌ను సుబేదారి పోలీసులు మాత్రం ఈ నెల 10న సెంట్రల్‌ జైలుకు పంపించారు. ఈ 11 రోజుల్లో నిందితుడు తప్పించుకున్నాడు. సుబేదారి పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, ఎట్టకేలకు కైసర్‌ను పట్టుకుని ఈ నెల 10న జైలుకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. జైలుకు వచ్చిన కైసర్‌ మరుసటి రోజే తనకు దగ్గు, జలుబు ఉందని, వాసన, రుచి తెలియడం లేదని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకురాగా, జైలు వైద్యులతో పరీక్షలు చేయించి చక్కెర, ఉప్పు తినిపించారు. అయినా తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేయడంతో జైలు సూపరింటెండెంట్‌ మురళిబాబు ఏఆర్‌ ఎస్కార్ట్‌ మధ్య వరంగల్‌ ఎంజీఎం దవాఖానలోని కొవిడ్‌-19 విభాగానికి పంపించారు. కమిషనరేట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రామన్న, రమేశ్‌ ఖైదీని ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లారు. 

భోజనం తీసుకొచ్చేలోగా..

ఖైదీ నుంచి శాంపిల్స్‌ తీసుకున్న వైద్య సిబ్బంది రిపోర్ట్స్‌ వచ్చే వరకూ ఇక్కడే ఉండాలని సూచించారు. ఈ క్రమంలో అదేరోజు సాయంత్రం 6.30 సమయంలో ఎస్కార్ట్‌లోని ఓ కానిస్టేబుల్‌ కింది అంతస్తుకు వెళ్లగా, మరో కానిస్టేబుల్‌ ఖైదీకి వచ్చిన భోజనం తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ఖైదీ గది నుంచి పరారయ్యాడు. ఖంగుతిన్న ఎస్కార్ట్‌ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అప్రమత్తమైన మట్టెవాడ, ఏఆర్‌ పోలీసులు జూలైవాడలోని ఖైదీ ఇంటి వద్ద నిఘా పెట్టారు. వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న సమయంలో జఫర్‌ఘడ్‌లోని తన బంధువుల ఇంట్లో కైసర్‌ తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు మట్టెవాడ పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఖైదీ పరారైన సమయంలో విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరి కానిస్టేబుళ్లపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జరిగిన ఘటనపై ఏఆర్‌ అధికారులు ఇప్పటికే సీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.


logo