శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jul 16, 2020 , 01:20:08

పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి

పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి

  •  ‘హృదయ్‌', ‘స్మార్ట్‌సిటీ’, ‘అమృత్‌' పనులు వెంటనే పూర్తి చేయాలి
  •  ‘దిశ’ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్‌
  •  పాల్గొన్న చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు కెప్టెన్‌, బండా, అధికారులు

హన్మకొండ, జూలై 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ (దిశ) సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, డాక్టర్‌ బండా ప్రకాశ్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, కమిషనర్‌ పమేలా సత్పతి, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్‌ పాల్గొన్నారు.  ఎంపీ దయాకర్‌  మాట్లాడుతూ పథకాలను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రొటోకాల్‌ తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా నగరంలో ‘హృద య్‌', ‘స్మార్ట్‌సిటీ’, ‘అమృత్‌' పథకాల ద్వారా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.   

డొమెస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలి : బండా 

జిల్లాలో వంద శాతం డొమెస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ అన్నా రు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల విషయంలో సర్వే చేసి అవసరమైన వారికి కూడా కనెక్షన్లు ఇప్పించాలని సూచించారు. నగరంలో ఓపెన్‌ స్థలాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు. టీబీ, మలేరియాపై సర్వే చేసి చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వేయి స్తంభాల ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలన్నా రు. నగరంలో 81 అంగన్‌వాడీ కేంద్రాల శాశ్వత భవనాల నిర్మాణానికి స్థలం సేకరించాలన్నారు.  

లో వోల్టేజీ సమస్య ఉంది : వినయ్‌భాస్కర్‌

నగరంలోని ఎక్సైజ్‌ కాలనీలో లో వోల్టేజీ సమస్య ఉందని, గతంలో సబ్‌స్టేషన్‌ మంజూరు చేసినా స్థలం అంశం కోర్టు కేసులో ఉన్నందున మచిలీబజార్‌కు మార్చినట్లు చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ చెప్పారు. కేసు పరిష్కారం తర్వాత 33/11 సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో మరో ఐదు సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. కాజీపేటలో 20 పడకల దవాఖాన కోసం పంపిన ప్రతిపాదనలు పరిశీలించాలని వైద్యాధికారికి సూచించారు.   

 సమస్యలను  ఎమ్మెల్యేల దృష్టికి తేవాలి : కెప్టెన్‌

వైద్యారోగ్య సమస్యలను కలెక్టర్‌, సంబంధిత ఎమ్మెల్యేలకు చెబితే పరిష్కారమయ్యే అవకాశాలుండేవని డీఎంహెచ్‌వోకు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు సూచించారు. భీమదేవరపల్లి దవాఖానకు సిబ్బందిని కేటాయించాలని, ముల్కనూర్‌ దవాఖానకు కాంపౌండ్‌, ఎల్కతుర్తి పీహెచ్‌సీ భవన నిర్మాణ పను లు వెంటనే చేపట్టాలని జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ కోరా రు. పట్టణ ప్రాంత నిరుపేదలు, కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ద్వారా ప్రత్యేక పథకాన్ని అమలు చేసేందుకు తీర్మానించాలని చీఫ్‌ విప్‌ దాస్యం కోరగా సభ్యులంతా ప్రతిపాదించారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి సోలార్‌ మోటర్ల వాడకంపై ఆసక్తి ఉన్న రైతులకు ఇవ్వాలని సూచించారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే వాటిని ‘కుడా’ ద్వారా చేపట్టేలా నిర్ణయం తీసుకోవాలని చీఫ్‌విప్‌ సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రసూనారాణి, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, ఎంపీపీలు పాల్గొన్నారు.