సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 16, 2020 , 01:01:39

కరోనా బాధితులకు ఎంజీఎంలో పూర్తి వైద్యసేవలు

కరోనా బాధితులకు ఎంజీఎంలో పూర్తి వైద్యసేవలు

  • ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు
  • కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం
  • త్వరలోనే ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌
  •  సమన్వయ కమిటీతో పర్యవేక్షణ
  •  విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, భయంతో అటూఇటు తిరిగి ఆగం కావద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వైరస్‌ కట్టడి, వైద్యశాలల్లో బెడ్లు, సామర్థ్యం పెంపు, మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై హన్మకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమాన్యాలతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని, ఎంజీఎంలో పూర్తి వైద్య సేవలందిస్తున్నామని స్పష్టం చేశారు.      హన్మకొండ

హన్మకొండ : ‘కరోనా వచ్చిందనో.. వస్తుందనో ప్రజలు ఆందోళన చెందవద్దు.. అక్కడికిక్కడికి తిరిగి ఆగం కావద్దు.. కరోనా బాధితులకు ఎంజీఎంలో పూర్తి వైద్యసేవలు అందిస్తున్నం. కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసినం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసానిచ్చారు. జిల్లాలో కరో నా వ్యాప్తి, కట్టడి, ఎంజీఎం, వైద్య కళాశాలల్లో బెడ్లు, సామర్థ్యం పెంపు, మున్ముందు వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హన్మకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంజీఎం వైద్యులు, ప్రైవేట్‌ వైద్యశాలల యాజమాన్యాలతో బుధవారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడా రు. ఏ ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని, ఇందుకు నిధుల కొరత కూడా లేదని వివరించారు. బాధితులందరికీ ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో వైద్య సేవలందిస్తున్న సిబ్బందికి జీతాలు పెంచేందుకు జీవో జారీ చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్లు, సిబ్బందికి నేటి నుంచి నగదు, ప్రోత్సాహకాలు, అవార్డులు, రివార్డులు ఇవ్వనున్న ట్లు చెప్పారు. సరైన సేవలు అందించకుంటే చర్యలు ఉంటాయన్నారు. ఎంజీఎంను, వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌ ఆవరణలో నిర్మించిన 200 పడకల వైద్యశాల ను పూర్తిగా కొవిడ్‌ సేవల కోసం వినియోగించు కోవాలని  నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాకు అవసరమైన రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు వెంటనే సమకూర్చాలని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ హాస్పిటళ్లను కూడా కరోనా చికిత్స కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు హైరానా పడవద్దని, హైదరాబాద్‌కు పరుగులు పెట్టవద్దని సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉండే బాధితులకు కూడా అన్ని వసతులూ కల్పిస్తామన్నారు. కరోనా నియంత్రణకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐసోలేషన్‌ వార్డుగా కేయూ, వైద్యుల వసతి కోసం హరిత కాకతీయ హోటల్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి అధికారులు, డాక్టర్లు, వారానికి ఒకసారి ప్రజాప్రతినిధులు సమీక్షించనున్నట్లు చెప్పారు. కరోనా చికిత్సకు ఇక 24గంటల్లోనే ప్రైవేట్‌ దవాఖానలకు అనుమతులివ్వాలని ప్రభు త్వం నిర్ణయించిందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి పాల్గొన్నారు. 

ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు 

హసన్‌పర్తి :ప్రభుత్వ భూముల పరిరక్షణకు సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్‌ మండలం పైడిపల్లి శివారులోని పలు ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ వరంగల్‌ నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ భూము ల్లో మంకీ  ఫుడ్‌ కోర్టు లు, చిన్నపిల్లల పా ర్కులను, ఔషధ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  పైడిపల్లి రెవెన్యూ శివారులోని 42ఎకరాల ప్ర భుత్వ భూ మిని పరిశీలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఈ భూములపై తగిన నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ ఇక్బాల్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌, కార్పొరేటర్‌ వీర భిక్షపతి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ లలితాయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరికృష్ణ, ఒకటో డివిజన్‌ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, బుద్దె వెంకన్న, మంగ నర్స య్య, అధికారులు పాల్గొన్నారు.logo