సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-city - Jul 15, 2020 , 01:47:30

పుడమికి.. పచ్చని చీర

పుడమికి.. పచ్చని చీర

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బీళ్లు పడి ఉండేది. ఎవుసం ఒక సాహసమై ఇక్కడి రైతులకు వలసలు తప్పకపోయేది. అపర భగీరథుడై ముఖ్యమంత్రి కేసీఆర్‌, సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయించడంతో జనగామ జిల్లాలోని మెట్ట ప్రాంతాలు ఇప్పుడు పంటపొలాలతో కళకళలాడుతున్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నర్మెట మండలం గండిరామారంలో నిర్మించిన రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. దీనికింద సుమారు 12వేల ఎకరాలకు సాగునీరందుతుండడంతో ఇదిగో ఇలా కను చూపు మేర పైర్లతో పుడమి తల్లి పచ్చని చీరను సింగారించుకున్నట్లు కనిపిస్తున్నది.   -స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, జనగామ

జనగామ జిల్లా కేంద్రానికి 28కిలోమీటర్ల దూరాన ఉన్న నర్మెట మండలం గండిరామారం వద్ద (మల్లన్నగండి) కట్టిన రిజర్వాయర్‌తో ఏళ్లనాటి దారిద్య్రానికి చెల్లుచీటీ పాడినట్లయింది. ఒకప్పుడు నీటి వసతి లేక భూములన్నీ బీళ్లు పడి చేసేదేంలేక రైతులు ఉపాధి కోసం వలస బాట పట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆవిర్భవించిన స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలుపెరుగని కృషితో సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వచ్చింది. చకచకా నిర్మాణాలు పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడంతో వాటికింద భూములకు ప్రాణం పోసినట్లయింది. జే చొక్కారావు (దేవాదుల) ఎత్తిపోతల పథకంలో భాగంగా గండిరామారంలో కట్టిన రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. మెట్ట ప్రాంతాలు సాగునీటికి నోచుకొని ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో సుమారు 12వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిలుపూరు మండలాల్లోని పలు చెరువులను నింపుతున్నారు. వానకాలం సీజన్‌లో ప్రాజెక్టు కింద సాగు పెరిగి ఎటు చూసినా పచ్చని పైర్లు కనువిందు చేస్తున్నాయి. పుడమి తల్లి పచ్చని చీరను సింగారించుకున్నట్లుగా మారి ప్రకృతి సోయగాలు మైమరపింపజేస్తున్నాయి. 

  -స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, జనగామ 


logo