బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jul 14, 2020 , 04:59:16

రైతన్నకు ఎస్సారెస్పీ భరోసా

రైతన్నకు  ఎస్సారెస్పీ భరోసా

  • నీటి విడుదలకు రంగం సిద్ధం
  • ఎంఎంఆర్‌ నుంచి ఎల్‌ఎండీకి నీరు..
  • ఎస్సారెస్పీ స్టేజ్‌-1లో 863 చెరువులు
  • గతేడాది యాసంగి మాదిరిగానే టెయిల్‌ టు హెడ్‌ విధానం అమలు
  • ప్యాకేజీ 13బీపై ప్రభుత్వానికి నివేదిక?

సర్కారు మాట ఇచ్చిందంటే తప్పదని మరోసారి రుజువైంది. పంటలకు నీటి ఢోకా లేకుండా చేస్తానని సీఎం కేసీఆర్‌ అన్న మాటకు తిరుగులేదని స్పష్టమైంది. మునుపెన్నడూలేని విధంగా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులతో వానకాలం నీటి విడుదలపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 15 నాటికి ఎస్సారెస్పీ జలాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని మిడ్‌ మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేశారు. ఎల్‌ఎండీ నుంచి ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఎస్సా రెస్పీ స్టేజ్‌-1లో పది నియోజకవర్గాల్లోని 863 చెరువుల్ని నింపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది యాసంగి మాదిరిగానే ఈసారి కూడా టెయిల్‌ టు హెడ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. కాగా, డీబీఎం 38లోని ప్యాకేజీ 13బీ లోపభూయిష్టంగా ఉండడంపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.


వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సర్కారు మాటంటే రైతన్నకు భరోసా అని మరోసారి స్పష్టమైంది.  రైతన్న పంటకాలం కోసం మొగులు చూడాల్సిన పనిలేకుండా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటకు తిరుగులేదని నిరూపితమైంది. జూలై 15 నుంచి ఎస్సారెస్పీ ద్వారా నీరు రైతన్న పంట పొలాలకు చేరుతుందని ఇటీవల(ఈనెల 8న) ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ పరీవాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు పేర్కొ న్నట్టుగానే కాలువల్లో నీటి అడుగులు పడుతున్నాయి.  అందులో భాగంగానే సోమవారం కరీంనగర్‌లోని మిడ్‌మానేర్‌ నుంచి ఎల్‌ఎండీకి నీటివిడుదల ప్రారంభమైంది. ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన (కాకతీయ) కాలువ ద్వారా స్టేజ్‌-1కు నీరు చేరే ప్రధాన ఘట్టం మొదలైంది. దీంతో ప్రభుత్వం అన్న మాట ప్రకారం నిర్దేశిత గడువునాటికి 863 చెరువులకు నీరు చేరేందుకు కావాల్సిన చర్యలు మొద ల య్యాయి.  కాళేశ్వరం జలాలతో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో చెరువుల్లో సగానికి పైగా నీరుంది. గత యా సంగి పంటలకు సరిపడా నీరిందించిన ప్రభుత్వం ఈసారి వానకాలంలోనూ ప్రతి ఎకరాకు సాగు నీరిందించేందుకు సకల సన్నాహాలు చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.  ఎస్సారెస్పీ చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ పరివాహక ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌,  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సహా ఎస్పారెస్పీ స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ వాన కాలం నీటి విడుదలపై సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇందులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 15 నాటికి ఎస్సారెస్పీ జలాలు రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి. సమా వేశం అనంతరం కాలువ పొడవునా ఉన్న డిస్ట్రిబ్యూటరీల పరిస్థితిని అధికారులు సమీక్షించారు. అయితే ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఇటీవలే కాలువ మరమ్మతులు చేసిన విషయం తెలిసిందే.  ప్రధాన డిస్ట్రిబ్యూటరీకి మరమ్మతుల అవసరం లేకపోడంతో రైతులకు వరి పంటకు నీరు అందించేందుకు ఎటువంటి అవరోధాలు లేకపోవడంతో అనుకున్నగడువులోగా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా గత యాసంగిలో అనుసరించిన పద్ధతే కొనసాగుతుంది. టెయిల్‌ టు హెడ్‌ ప్రాతిపదికన నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు అయి న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి చెరువుల్ని నింపుకుంటూ వచ్చే ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం మిడ్‌మానేర్‌ నుంచి ఎల్‌ఎండీకి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఎల్‌ఎండీ నుంచి ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్‌-1లో పది నియోజకవర్గాల్లోని 863 చెరువుల్ని నింపా లని ఎస్సారెస్పీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

పది నియోజకవర్గాలు.. 863 చెరువులు 

వానకాలంలో ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపా రుదల శాఖ అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. స్టేజ్‌-1లో ఎల్‌ఎండీ నుంచి ఖమ్మం నియోజకవర్గం దాకా ఉన్న 863 చెరువుల్ని నింపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్సారెస్పీ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గతేడాది యాసంగి మాదిరిగానే ఈసారి కూడా టెయిల్‌  టు హెడ్‌ విధానంతో చెరువుల్ని నింపుకుంటూ వస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం రైతులకు ఎటువంటి నీటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 

ప్యాకేజీ 13బీపై సర్కారుకు నివేదిక

ములుగు-బండారుపల్లి కాలువ పనుల నిర్లక్ష్యంపై త్వరలో నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసు కోబోతుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఎస్సారెస్పీ డీబీఎం 38లోని ప్యాకేజీ 13బీపై ఇటీవల జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అధికారులు క్షేత్ర పర్యటన చేసి నివేదిక రూపొందించినట్లు తెలుస్తున్నది. ఈ ప్యాకేజీ లోపభూయిష్టంగా ఉండడమే కాకుండా సాంకేతికంగా అనేక సమస్యలున్నాయని అధికారులు గుర్తించినట్టు తెలుస్తున్నది. అయితే 2002లో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటికీ తుది రూపానికి రాకపోవడమే కాకుండా అక్కడి రైతులకు నీరివ్వలేని పరిస్థితి నెలకొన్నదని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ ప్యాకేజీ పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసి ఇతర ఏజెన్సీకి అప్పగించే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ సమాచారం. logo