సోమవారం 03 ఆగస్టు 2020
Warangal-city - Jul 13, 2020 , 01:20:42

బాలల సదనాన్ని తరలించొద్దు

బాలల సదనాన్ని తరలించొద్దు

  • ఆటోనగర్‌లోనే అన్ని సదుపాయాలు 
  • చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ పరశురాములు

పోచమ్మమైదాన్‌, జూలై 12: వరంగల్‌ ఆటోనగర్‌లో రెండు దశాబ్దాల నుంచి ఉన్న బాలల సదనాన్ని (చిల్డ్రన్స్‌ హోం) హన్మకొండకు తరలించొద్దని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ మండల పరశురాములు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఆటోనగర్‌లోని జువైనల్‌ హోం ఆవరణలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, గతంలో మాదిరిగా ఇక్కడే కొనసాగించాలని పేర్కొన్నారు. బాలల సదనంలో ఉన్న పిల్లలకు సమీపంలో ప్రభుత్వ పాఠశాలలు, వైద్య సౌకర్యాల కోసం ఎంజీఎం దవాఖాన, రక్షణ చర్యల కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతర రవాణా సదుపాయాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ముఖ్యంగా విశాలమైన స్థలం, భవన సముదాయం అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికే ఇక్కడి నుంచి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కార్యాలయం, జువైనల్‌ జస్టిస్‌ బోర్డును హన్మకొండకు తరలించి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని, బాలల సదనంను కూడా అద్దె భవనంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి లక్షలాది రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. సంబంధిత డైరెక్టర్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యే చొరవ తీసుకుని గతంలో మాదిరిగా ఆటోనగర్‌లోనే బాలుర పరిశీలక గృహం, బాలల సదనం, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కార్యాలయం, జువైనల్‌ జస్టిస్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


logo