గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jul 13, 2020 , 01:07:52

అర్వింద్‌ ఓ 420

అర్వింద్‌ ఓ 420

  • ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే సహించం
  • వరంగల్‌పై ప్రేమ ఉంటే కాజీపేటను డివిజన్‌ చేయండి
  • కోచ్‌ ఫ్యాక్టరీని తెప్పించండి
  • నిజామాబాద్‌ ఎంపీపై టీఆర్‌ఎస్‌ నాయకుల ఫైర్‌  
  • బీజేపీ తీరును తూర్పార బట్టిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌
  • ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌కి టీఆర్‌ఎస్‌ సెగ  

నయీంనగర్‌, జూలై 12 : ‘నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఓ 420. బీజేపీకి నిజంగా వరంగల్‌ మీద ప్రేమే ఉంటే కాజీపేట రైల్వే డివిజన్‌ కలను సాకారం చేయాలి. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని తీసుకురావాలి. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు ఉనికి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే సహించేది లేదు’ అని టీఆర్‌ఎస్‌ హెచ్చరించింది.

అధర్మపురి అర్వింద్‌ : ప్రభుత్వ చీఫ్‌ విప్‌

నిజామాబాద్‌ ఎంపీ అధర్మపురి అర్వింద్‌ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ‘కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ తామే చేసినట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోజులు కొడుతున్నది. వరంగల్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని నిజామాబాద్‌ ఎంపీ ఆరోపించడంపై దాస్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ తాను గెలిచిన ఆర్నెళ్లకే నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెస్తానని నమ్మబలికి, అసలు తనకు పసుపు రైతులు ఓటేయలేదని బుకాయించడం సిగ్గుచేటని విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా అర్వింద్‌ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ వల్ల ఎంత మంది పేదలకు న్యాయం జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది వలస కూలీలను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా భావించి, వారికి 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు ఇచ్చి ఆదుకున్న మహనీయుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. బీజేపీ అసత్య ఆరోపణలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరన్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజా తీర్పును గౌరవించి,  నిజామాబాద్‌లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని దాస్యం హెచ్చరించారు.

చిత్తశుద్ధితో అభివృద్ధి : ఎమ్మెల్యే నన్నపునేని

వరంగల్‌ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ఇటీవలే స్మార్ట్‌ బోర్డు సమావేశమై రూ. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిందన్నారు. అందులో రూ. 700 కోట్ల పనులు సాగుతున్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంతేకాకుండా వరంగల్‌ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించడం అర్వింద్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. ఒకవేళ తాను ఎక్కడైనా ఒక్క గజం కబ్జా చేసినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. తానొక ఎంపీ అన్న సంగతి కూడా మరిచిపోయి చిల్లరగా వ్యవహరిస్తున్నారని దయ్యబట్టారు. అంతేకాకుండా నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఆడబిడ్డగా బతుకమ్మ పండుగను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సందర్భంగా అర్వింద్‌ రాజస్థాన్‌లోని యూనివర్సిటీ పేరు మీద ఎంబీఏ పూర్తి చేశానని తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి నిజామాబాద్‌ ప్రజల్ని మోసం చేశారని ఎద్దేవా చేశారు. మాట మీద నిలకడలేని, అపరిపక్వ రాజకీయాలతో వరంగల్‌కొచ్చి తామే అన్ని చేస్తున్నట్లు ప్రకటించడం ఆయన నీచమైన రాజకీయ బుద్ధికి నిదర్శమని అన్నారు.

అర్వింద్‌ కాన్వాయికి టీఆర్‌ఎస్‌ సెగ

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆదివారం నగరానికి వచ్చి పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని,  కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ తామే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వరంగల్‌ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్‌కు లేఖ రాస్తానని పేర్కొనడమే కాకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు ధర్మపురి అర్వింద్‌ను అడ్డుకొని నిరసన తెలిపేందుకు బయల్దేరారు. అప్పటికే నిజామాబాద్‌ ఎంపీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటనపై బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇంటి మీదకు బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


logo