గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 11, 2020 , 01:10:52

కలిసే కాటికి..

కలిసే కాటికి..

  • కొడుకులకు భారం కాలేక వృద్ధ దంపతుల విషాదాంతం
  • వెంటాడిన అనారోగ్యం
  • పురుగుల మందుతాగి బలవన్మరణం

ఖానాపురం, జూలై 10 : మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. జీవిత చరమాంకం వరకూ ఒకరికొకరు తోడునీడగా బతికారు. ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చి పేదరికం అడ్డు వచ్చినా కష్టపడి వారిని పెంచి పెద్ద చేశారు. అనంతరం వివాహాలు సైతం జరిపించారు. పిల్లలు ఉన్నంతలో ఎవరికాళ్లపై వారు బతికేలా చేశారు. ఇక వృద్ధాప్యం మీదపడుతుండంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తమ వృద్ధాప్యం కొడుకులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఈ హృదయవిదారక ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై సాయిబాబు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అశోక్‌నగర్‌కు చెందిన తొగరు అల్లూరు(80), ఎల్లమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు ఐలయ్య తన కుటుంబంతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటూ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు రమేశ్‌ ఇదే మండలం చిలుకమ్మనగర్‌లో నివాసముంటూ హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు.

మానని గాయంతో ఇబ్బందులు

అల్లూరు వృత్తి రీత్యా గొర్రెల కాపరి. ఎల్లమ్మ కూలీ పనులు చేస్తుంది. నాలుగేళ్ల క్రితం అల్లూరి కాలుకు గాయమైంది. అది తగ్గకపోగా రానురాను గాయం పెద్దదిగా మారింది. దీంతో కాలు పూర్తిగా దెబ్బతిన్నది. నాలుగేళ్లుగా భార్య ఎల్లమ్మ సపర్యలు చేస్తూ వస్తున్నది. కొన్ని నెలల నుంచి ఎల్లమ్మ ఆరోగ్యం సైతం బాగా లేదు. వృద్ధాప్యం మీదపడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, కొడుకులు పేదరికంలో ఉండడంతో జీవిత చరమాంకంలో పిల్లలకు భారం కాకూడదని ఆ వృద్ధ దంపతులు నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేసి పడుకున్నారు. వారితోపాటు పక్క గదిలో వారి పెద్దకుమారుడు భార్యాపిల్లలతో కలిసి నిద్రపోయాడు.

శుక్రవారం తెల్లవారుజామున ఇంటి పక్కనే ఉన్న బాత్‌రూంలోకి వెళ్లి ముందు తెచ్చిపెట్టుకున్న పురుగుల మందును వృద్ధ దంపతులిద్దరూ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారిన తర్వాత కుటుంబ సభ్యులు నిద్రలేచారు. ఇంటి ఆవరణలో పురుగుల మందు వాసన రావడంతో బాత్‌రూంలోకి వెళ్లి చూడగా వృద్ధ దంపతులు విగతజీవులై ఉన్నారు. రాత్రి వరకూ తమతో మాట్లాడిన తల్లిదండ్రులు తెల్లవారేసరికి విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అశోక్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర, దుగ్గొండి సీఐ సతీశ్‌బాబు, ఎస్సై సాయిబాబు సందర్శించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం నర్సంపేట ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడి పెద్దకుమారుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కుటుంబ కలహాలతో ఒకరు..

నర్సంపేట: నర్సంపేటలోని సరోజినీదేవి రోడ్డులో నివాసముంటున్న రాజు(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉంటు న్న రాజుకు కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


logo