మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 11, 2020 , 01:06:10

జంగా మెడ‌పై సీఐడీ కత్తి!

జంగా మెడ‌పై సీఐడీ కత్తి!

 • మాజీ చైర్మన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
 • తెరపైకి డీసీసీబీ గత పాలకవర్గ బాగోతం
 • అవినీతి, అక్రమాలపై విచారణకు రంగంలోకి ‘డిపార్ట్‌మెంట్‌'
 • ‘నమస్తే’ వరుస కథనాలతో సంచలనం
 • తాజా పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ

డీసీసీబీ గత పాలకవర్గ అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీఐడీ రంగంలోకి దిగనుండడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదనే అనుమానాలను తాజా పరిణామాలు మరింత బలపరుస్తున్నాయి. సహకార చట్టం జీవో 51 ప్రకారం శాఖా పరమైన విచారణ చేపట్టిన అనంతరం అప్పటి అధికారి శ్రీనివాసరావు, పూర్తి డొంకను కదిలించడం కోసం సీఐడీకి సిఫారసు చేయడం.. నేడో రేపో అది విచారణ చేపట్టనుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజల సొమ్మును కొల్లగొట్టాలని చూస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దనే ఉద్దేశంతో సర్కారు ముందుకు పోతున్నట్లు స్పష్టమవుతున్నది. 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: డీసీసీబీలో జరిగిన అవినీతిపై 2017లో సీనియర్‌ ఆడిటర్‌ శ్రీనివాసరావు తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా నాలుగున్నర నెలలపాటు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు పరిధిలోని అన్ని శాఖల్లో లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పటి డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి మిగతా 17 మంది డైరెక్టర్లు బ్యాంకు సొమ్మును సొంత ఆస్తిగా భావించి ఇష్టారీతిగా లూటీ చేసిందని విచారణలో తేలింది.

వెలుగులోకి వచ్చిన  అక్రమాల చిట్టా ఇదీ..

 • డీసీసీబీ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి ఉన్న కాలంలో ఉద్యోగులను బలవంత పెట్టి వ్యక్తిగత ప్రయోజ నాల కోసం, సొంత వాళ్ల లబ్ధి కోసం బ్యాంకు నుంచి రూ.7,99,33,200లను ఓడీ రుణాలు ఇష్టారీతిగా మంజూరు జారీ చేసి బ్యాంక్‌కు నష్టం వాటిల్లేలా చేశాడు. 
 • బంగారం తనఖా పెట్టకుండానే తన కుటుంబసభ్యుల పేరు మీద ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున రూ. 60 లక్షలను ఫోర్జరీ సంతకాలతో రుణాలు కాజేశాడు. అంతేకాకుండా మరో రూ. 45 లక్షల రుణా లను ఎటువంటి బంగారం తనఖా పెట్టకుండానే హన్మకొండ బ్రాంచ్‌లో మంజూరు చేశాడు. బ్యాంక్‌ మేనేజర్‌ తన మిత్రులు, కుటుంబసభ్యుల పేరుమీద బంగారు రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని తమ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. 
 • సహకార చట్టాలు, పదోన్నతుల విషయంలోనిబంధనలు పాటించలేదు. తనకు అనుకూలంగా ఉన్న ఎస్‌ మధు, గొట్టం స్రవంతికి డీజీఎంలుగా పదోన్నతి కల్పించారు. 
 • రాఘవరెడ్డి తన వాహనం కోసం నిబంధనలు పాటించకుండా వాహన రుణం పొందడమే కాకుండా అది చెల్లింపు చేయలేదు.
 • 24మంది స్వీపర్లు, అటెండర్లను అక్రమంగా నియమించారు. కొందరిని క్రమబద్ధీకరించారు. 
 • పరకాల, ఘన్‌పూర్‌ శాఖలకు సంబంధించి భవన నిర్మాణాల విషయంలో దాదాపు రూ. 26లక్షలను ఎటువంటి రివైజ్‌డ్‌ ఎస్టిమేట్స్‌ తయారు చేయకుండా 70 శాతం మొత్తాన్ని చెల్లించాడు. 
 • హన్మకొండ శాఖలో ఆర్‌బీఐ నిబంధనలకు(కేవైసీ నార్మ్స్‌) విరుద్ధంగా రూ. 34లక్షల 19వేలు అనధికారికంగా లావాదేవీలు జరిగాయి. 
 • డీసీసీబీ కేంద్ర కార్యాలయ భవనం లీజు విషయంలో అక్రమాలు జరిగాయని, దీని వల్ల బ్యాంక్‌కు రూ. కోటి 38 లక్షల నష్టం వాటిల్లింది. 
 • ఉద్యోగులకు 45రోజుల ఎక్స్‌గ్రేషియా పొందే విషయంలో రూ. 64 లక్షలలు చైర్మన్‌ సహా ఇతర పాలక వర్గానికి లంచంగా ముట్టచెప్పారని విచారణలో తేలింది. 
 • మహబూబాబాద్‌ శాఖకు సంబంధించి 1879 చ.గజాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా డీసీసీబీ పాలక వర్గం వేలం వేసి మరీ విక్రయించింది. 
 • ఇక మార్ట్‌గేజ్‌ రుణాల జారీ విషయంలో సరైన పూచీకత్తు పెట్టకుండానే రూ. 9,95,53,812 అదనపు రుణాలను పాలక వర్గం మంజూరు చేసింది. అదేవిధంగా ఎఫ్‌డీఆర్‌లు, టెస్కాబ్‌కు ఏ మాత్రం సమా చారం ఇవ్వకుండా బ్యాంక్‌కు రూ. 6,16,232 నష్టం జరిగింంది. 
 • బ్యాంక్‌లో నగదుకు, రికార్డులో ఉన్న మొత్తాలకు పొంతన లేదని స్పష్టమైంది. 
 • బ్యాంక్‌ చైర్మన్‌ తన పరిధికి మించి సీఈవో, పాలకవర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టి తన ఇష్టారీతిగా వ్యవహరించారని విచారణలో తేలింది. 
 • విచారణ సందర్భంగా 18మంది ఉద్యోగులు పాలకవర్గంపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని పేర్కొనడమే కాకుండా 45 రోజుల ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ. 64లక్షలు వసూలు చేసి ఇచ్చారని స్పష్టమైంది.

బయటికొచ్చిందిలా..

డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బయట పెట్టి రైతులను కాపాడాలని అప్పటి పాలకుర్తి ఎమ్మెల్యే, ప్రస్తుత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌కు 2017 మార్చిలో ఫిర్యా దు చేశారు. దీంతో సర్కారు బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వం కోర్టు తీర్పును సహకార, ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా పాలక వర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయమే.


logo