బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Jul 10, 2020 , 02:23:10

ఆదాయానికి ‘హరిత’ ఊతం

ఆదాయానికి ‘హరిత’ ఊతం

  • టేకు, జామాయిల్‌ సాగుతో రైతులకు లాభాలు 
  • ‘హరితహారం’లో ఉచితంగా మొక్కల పంపిణీ
  • వాటి సంరక్షణకు ప్రభుత్వ సాయం
  • నెలకు ఒక్కో దానికి రూ. ఐదు చొప్పున చెల్లింపు
  • పొలంగట్లు, ఖాళీ స్థలాల్లో పెంచితే ఆర్థిక దన్ను
  • ఎకరంలో 600 మొక్కలు పెంచే వీలు.. 
  • 15-20 ఏళ్లలో మంచి రాబడి

కేసముద్రం టౌన్‌ : ప్రస్తుతం టేకు కలప దొరక్క పోవడం, మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో రైతు ల ద్వారా ఈ మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. టేకు మొక్కలు నాటితే భవిష్యత్తులో రైతులకు సిరులు కురిపిస్తాయని కాంక్షిస్తున్నది. ఆర్థిక వనరులను సమకూర్చుకునే స్థాయికి ఎదిగేందుకు టేకు, జామాయిల్‌ మొక్కలు ఉపయోగపడతాయని భావిస్తున్నది. ఈ క్రమంలో వ్యవసాయ పంటలపైనే కాకుం డా ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న టేకు, జామాయిల్‌ మొక్క ల పెంపకంపై ఆసక్తి చూపాలని వ్యవసాయ, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలం గట్లపైన ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి సంరక్షిస్తే ఆర్థికంగా భరోసా కలుగుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశముంది.  

‘హరితహారం’లో ఉచితంగా పంపిణీ

హరితహారం పథకంలో భాగంగా టేకు, జామాయిల్‌ మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తారు. వీటిని పొలంగట్లు, బంజరు భూములు, ఖాళీ స్థలాల్లో పెంచితే ఉపాధి హామీ పథకంలో ఒక్కో టేకు మొక్క నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.5 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.  ఇలా రెండేళ్లపాటు ఖర్చులు చెల్లిస్తుంది. ఒక రైతు 500 మొక్కలు నాటితే నెలకు రూ. 2500 ఇస్తుంది. 

అందుబాటులో టేకు మొక్కలు..

మహబూబాబాద్‌ జిల్లాలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో నర్సరీల్లో 20,48,758 టేకు మొక్కలను పెంచుతున్నారు. వీటిని పెంచితే వచ్చే లాభాలను రైతులకు అధికారులు వివరిస్తూ పంపిణీ చేస్తున్నారు. ఎకరంలో 600 మొక్కలు పెంచవచ్చు. ఒక్కో మొక్క 12 ఏళ్ల తర్వాత 20 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఫలితాన్ని పొందవచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిస్తే అంత నాణ్యమైన కలప ఉత్పత్తి అవుతుంది. ఒక్కో ఎకరంలో పెంచిన 600 టేకు మొక్కలకు పెట్టుబడి ఖర్చులు పోగా సుమారు రూ.30లక్షల నుంచి రూ.50 లక్షలకు పైబడి ఆదాయాన్ని పొందే అవకాశముంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. 

అమ్మడమూ సులభమే..

చేతికొచ్చిన టేకు చెట్లను నరికే ముందు అటవీ శాఖ అధికారుల అనుమతి కోరాలి. దీంతో రేంజ్‌ పరిధిలోని అటవీ శాఖ అధికారి సంబంధిత రైతు టేకు వనాన్ని సందర్శించి అనుమతి ఇస్తారు. అనేక మంది వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. అమ్మిన మొక్కలను అనుమతి పత్రాలతో ఎక్కడికైనా తరలించే అవకాశముంటుంది. చెట్టును నరికిన తర్వాత దానికి మళ్లీ పిలకలు పెట్టి చెట్టులాగా తయారవుతుంది. మహబూబాబాద్‌ జిల్లాలోని 16 మండలాల్లో టేకు మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

టేకు పెంపకంతో మంచి ఆదాయం

ప్రస్తుతం టేకు మొక్కల పెంపకంతో మంచి లాభాలున్నాయి. ఖాళీ స్థలాల్లో, పొలం గట్లపై పెంచితే అదనపు ఆదాయం పొందవచ్చు. దీంతోపాటు ప్రభుత్వమే ఉచితంగా మొక్కలు పంపిణీ చేసి రెండేళ్లపాటు నిర్వహణ ఖర్చులు ఇస్తుంది. ఇది రైతుకు మరింత తోడ్పడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- విద్యాచందన, డీఆర్డీవో, మహబూబాబాద్‌

మండలం    టేకు మొక్కలు

కేసముద్రం 218410

బయ్యారం 105143

చిన్నగూడూరు 78000

దంతాలపల్లి 38000

డోర్నకల్‌ 148906

గంగారం 13500

గార్ల 111000

గూడూరు 122000

కొత్తగూడ 65000

కురవి 158115

మహబూబాబాద్‌ 109000

మరిపెడ 443214

నర్సింహులపేట 123040

నెల్లికుదురు 222080

పెద్దవంగర 50100

తొర్రూరు 46450  


logo