సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 10, 2020 , 02:17:12

కోట‌కు కొత్తందం

కోట‌కు కొత్తందం

  • చారిత్రక ప్రదేశానికి పచ్చలహారం
  •  పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం
  • రూపురేఖలు మార్చిన ‘హరితహారం’
  • ఐదేళ్ల నుంచి 4వేలకు పైగా మొక్కలు పెంచుతున్న ‘కుడా’
  • కంటికి రెప్పలా సిబ్బంది సంరక్షణ
ఖిలా వరంగల్‌ : చారిత్రక ఓరుగల్లు కోటంతా కొత్తందాన్ని సంతరించుకున్నది. ఎటు చూసినా ఏపుగా పెరిగిన వృక్షాలతో ఈ ప్రాంతమంతా నందనవనంలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ర్టాన్ని హరితమయం చేయాలన్న సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ద్వారా ఓరుగల్లు కోటంతా పచ్చదనాన్ని పరుచుకున్నది. మట్టికోట చుట్టూ నాలుగు వరుసలతో నాటిన మొక్కలు పచ్చలహారం తొడిగినట్లుగా ఉండి పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. హరితహారం కార్యక్రమాన్ని భిన్నంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలనే దృఢ సంకల్పంతో కోటలో ఓ ప్రణాళికతో మొక్కలు నాటారు. కోటను హరితవనంలా తీర్చి దిద్దేందుకు రెండో విడుత కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో కోట చుట్టూ 4400 మొక్కలు నాటించారు. వాటిని పార్కు నిర్వాహకుడు తీగల శ్రీధర్‌ స్థానిక రైతుల సహకారంతో ఐదేళ్లుగా సంరక్షిస్తున్నారు. 

కంటికి రెప్పలా కాపాడుతూ

12 కిలోమీటర్ల చుట్టూ ఉన్న మట్టికోటకు ఆనుకొని రావి, మర్రి, చింత, వేప, కదంబ, మారేడు, మామిడి, నేరేడు, బొడ్డుమల్లెలు, ఇతర పూల మొక్కలను నాలుగు వరుసలుగా నాటారు. ఎండకాలంలో నీటి ఎద్దడి ఉన్నా తిప్పారపు సాంబారావు అనే రైతు తన బావి నుంచి ఉచితంగా నీటిని మొక్కలకు అందించారు. వ్యవసాయ బావి నుంచి కిలోమీటరు వరకు నీటిని డ్రిప్‌ పద్ధతిన పెట్టేవారు. అక్కడి నుంచి మరో మోటరును బిగించి నీటిని మరో కిలోమీటరు దాకా తరలించి ఎండాకాలంలో మొక్కలు ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోజూ నలుగురు, పని ఎక్కువ ఉన్నప్పుడు పది మంది వరకు కూలీలతో కలుపు తీయడం, కందకాలు తవ్వి ఎరువులు వేయడం వంటివి చేశారు. ఫలితంగా కొన్ని మొక్కలు పూలు పూసి పర్యాటక శోభను మరింత పెంచాయి. 

50 వేల మొక్కలకు అవకాశం

కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న మట్టికోటలో ప్రస్తుతం వారి సహకారం మేరకు 4400 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. కోటకు హద్దులు నిర్ణయించి జిల్లా అధికారయంత్రాంగానికి ఇస్తే మరో 50 వేల మొక్కలు నాటుకునే వీలుందని పరిశీలకులు చెబుతున్నారు. మట్టికోట 12 కిలోమీటర్ల చుట్టూ రెండు వైపులా ఆరో విడుత హరిత హారంలో భాగంగా మొక్కలు నాటితే మరింత బాగుంటుందని సూచిస్తున్నారు. కిలోమీటరుకు 1800 మొక్కల చొప్పున కోటలోపలి చుట్టూ నాటితే 12కిలోమీటర్లకు సుమారు 21వేల మొక్కలు కావాలి. కోట అవతలి భాగాన అగడ్త వైపు కూడా 21వేల మొక్కలు నాటే వీలుంది. కేంద్ర పురావస్తుశాఖ అనుమతి లభిస్తే శతృదుర్బేధ్యమైన మట్టికోట హరిత వనమవుతుంది. 

పండ్ల మొక్కలతో ఉపాధికి  వీలు..

హరితహారంలో మట్టి కోట చుట్టూ రెండు వైపులా పండ్ల మొక్కలు నాటితే భవిష్యత్‌ తరాలకు ఎంతగానో మేలు చేసినట్లవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురికి ఉపాధి దొరుకుతుంది. ప్రధానంగా మామిడి, జామ, సీతాఫలం, సపోట, నిమ్మ, బత్తాయి, పనస, ఖర్జూర, నేరేడు మొక్కలు కోటకు ఆనుకొని పెంచితే వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, అటు వ్యాపారులకు, నిర్వహణ బాధ్యతలు చేపట్టే వారికి, స్థానికులకు ఉపాధి లభించే అవకాశముంది. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపడితే స్థానికులకు, పర్యాటకులకు పిక్నిక్‌ పాయింట్‌గా మారుతుంది.  

అధికారుల సూచనలతో ముందుకు

రెండో విడుతలో నాటిన మొక్కలను కుడా అధికారుల సలహాలు, సూచనలతో సంరక్షించాం. ఎప్పటికప్పుడు కలుపు తీయడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేసేవాళ్లం. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్న సమయంలో స్థానిక రైతుల సహకారంతో బావుల నుంచి మోటర్ల ద్వారా మొక్కలకు నీరు పారించాం.  

-తీగల శ్రీధర్‌,  పార్కు నిర్వాహకుడు


logo