ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jul 09, 2020 , 01:43:58

నీటి రాకలో.. నవశకం

నీటి రాకలో.. నవశకం

  • ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు జల భరోసా
  • ప్రజాప్రతినిధులు, అధికారుల ‘సుజల భేటీ’.. 
  • పసిడి ధాన్యపు సిరులకు దారి 

(వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ)

 ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నవశకం. కనీవినీ ఎరుగనిరీతిలో ప్రణాళికా రచన. వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అనేది పాత నానుడి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో వాన రాకడ స్పష్టంగా తెలియకపోయినా పంటలకు నీళ్లెప్పుడు వస్తాయో చెప్పే ప్రణాళికా వ్యూహరచన. దశాబ్దాలపాటు తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాల్వల్లో నిరుడు జలసిరులు నాట్యంతో కనువిందు చేశాయి. మునుపెన్నడూలేనివిధంగా ఆయకట్టు రైతులకు ప్రణాళికాబద్ధంగా నీటి విడుదలకు సర్కారు శ్రీకారం చుట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తూనే సమాంతరంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేయడం వల్ల పుష్కలమైన సాగునీరు వినియోగించుకునే అవకాశం కలిగింది. పేరుకు ఎస్సారెస్పీ కాల్వే అయినా అందులో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీరు కాకుండా మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలో కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం ద్వారా అదిప్పుడు కాళేశ్వరం కాల్వగా రూపాంతరం చెందింది. ఆయకట్టు రెండు పంటలకు సాగునీరు అందే భరోసా, విశ్వాసాన్ని ప్రభుత్వం ఇస్తున్నది. దశాబ్దాల కింద తవ్విన కాల్వల్లో రైతులు నీటిని చూసి ఎరుగరు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం వల్ల గత యాసంగిలో తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చరిత్ర సృష్టించారు. 347 కిలోమీటర్ల పొడవునా ఎస్సారెస్పీ కాల్వ ఆర్నెళ్లపాటు అప్రతిహతంగా జలప్రవాహంతో మురిసిపోయింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని చిన్నసీతారాం తండా దాకా వెయ్యికి పైగా చెరువులు నింపడం ద్వారా బంగారు పంటలు పండాయి. ఈ దృశ్యం ఎప్పటికీ కొనసాగాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెల రోజుల క్రితం ఎస్సారెస్పీ కాల్వ (ప్రాజెక్టు) పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశానికి కొనసాగింపుగానే బుధవారం ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ వానకాలంలో నీటి విడుదలపై వరంగల్‌లో సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎస్పారెస్పీ ఈఎన్‌సీ, సీఈ, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వానకాలం పంట సాగుకు

ముందు ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కింద ఉన్న ఆయకట్టు ఎంత? ఎన్ని చెరువులున్నాయి? ప్రస్తుతం ఎక్కడెక్కడ వరి నాట్లు వేశారు? చెరువుల్లో నీరెంత ఉన్నది? పంటలకు నీరు ఎప్పుడు అవసరం? ప్రభుత్వం నీటిని ఎప్పటి నుంచి అందివ్వాలి తదితర అంశాలతో మునుపెన్నడూ ఇంత పకడ్బందీగా ప్రణాళికా రచన జరగలేదు. చరిత్రలో మొదటిసారి ఇలా సమావేశం నిర్వహించి రైతులకు నీటి భరోసా ఇచ్చిన జలభేటీ అని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వమే షెడ్యూల్‌ విడుదల చేయడం రైతులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన భరోసా అని నేతలు పేర్కొనడం విశేషం. 



logo