మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 09, 2020 , 01:37:43

సొంతింటి కల.. సాకార వేళ‌

సొంతింటి కల.. సాకార వేళ‌

  •  రాయపర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో 140 ఇండ్లు రెడీ
  • మంత్రి ఎర్రబెల్లి చొరవతో చకచకా పూర్తి  
  • లబ్ధిదారుల జాబితా ప్రదర్శన

తొలివిడతగా మండల కేంద్రం రాయపర్తి, కేశవాపురం, మైలారం, కొండూరు, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనులు పూర్తయ్యాయి. రంగులు వేయడం, విద్యుత్‌, రోడ్లు ఇతర మౌలిక సదుపాయలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రెండో విడుత కింద కొలన్‌పల్లి, కాట్రపల్లి, గన్నారం, పెర్కవేడు, గట్టికల్‌లో చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను వందశాతం పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందించాలని ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించగా ఆ మేరకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ మేరకు మండలంలో నిర్మాణం పూర్తయి న ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.             -  రాయపర్తి 

నాలుగు గ్రామాలు-140 గృహాలు 

మండలంలోని రాయపర్తిలో 50, కేశవాపురంలో 30, కొండూరుకు 50, వెంకటేశ్వరపల్లిలో 10 ఇండ్లు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. గ్రామాల్లో తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. పంచాయతీ కార్యాలయ నోటీస్‌ బోర్డులపై జాబితాలను బుధవారం ప్రదర్శించారు. మంత్రి ఆధ్వర్యంలో మరో వారం పదిరోజుల్లోనే లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిసింది.  

త్వరలోనే ప్రారంభం 

కేశవాపురం, రాయపర్తి, కొండూరు, వెంకటేశ్వరపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో త్వరలోనే లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తాం. మైలారంలో పనులు పూర్తయినా అనివార్య కారణాలతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాల్సి వస్తున్నది. లబ్ధిదారుల ఎంపికలో ఏవైనా పొరపాట్లు, మార్పులు చేర్పులు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలి.

- సత్యనారాయణ, తహసీల్దార్‌, రాయపర్తి

వందశాతం పనులు పూర్తి 

రాయపర్తి, మైలారంతోపాటు ఎంపిక చేసిన గ్రామా ల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనులు వంద శాతం పూర్తి చేయించాం. కాంట్రాక్టర్లకు  ఎప్పటికప్పుడు సూచనలిస్తూ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పా టించేలా చూస్తూ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తాం.  

-అమర్‌నాథ్‌, ఐబీ ఏఈ
logo