సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 09, 2020 , 01:32:18

ప్రతి ఎకరాకు నీరందాలె..

ప్రతి ఎకరాకు నీరందాలె..

హన్మకొండ/న్యూశాయంపేట : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరందాలని, కాల్వల మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేసి మరో వారం పది రోజుల్లో నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ నుంచి వానకాలం సీజన్‌కు నీటి విడుదలపై హన్మకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, సంబంధిత అధికారులతో కలిసి బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఆమలు చేస్తున్న పథకాల లక్ష్యాలు చేరుకోవాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరముందన్నారు. ఒక్క నీటి చుక్క కూడా వృథాపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కాల్వల మరమ్మతుల కోసం ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. చివరి ఆయకట్టు వరకు, చిట్ట చివరి రైతుకు కూడా సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై 15వ తేదీకి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. పాత కాల్వలను వదిలివేయకుండా వాటికి మరమ్మతులు చేసి రైతులకు నీరందేలా చూడాలన్నారు. కాల్వల కింద అవసరమైన మేరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్దమనసుతో  రైతులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రం తొలి ప్రాధాన్యం వ్యవసాయమని స్పష్టం చేశారు. అధికారులు, కలెక్టర్లు, ఎప్పటికప్పుడు కాల్వలు, నీటిని పర్యవేక్షించాలని సూచించారు. ఎల్‌ఎండీ కింద 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. 

ఎస్సారెస్పీ నీళ్లే ఉద్యమాన్ని రగిలించాయి : మంత్రి జగదీశ్‌రెడ్డి

ఎస్సారెస్పీ నీళ్లే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ‘నేను ఎస్సారెస్పీ నీటికోసం ఎదురుచూస్తూ ఉద్యమంలోకి వచ్చిన’ అని తెలిపారు. ఎస్సారెస్పీ నీరు అందుకునే ఆఖరి గ్రామం సీతారాం తండా అని, ఈ నీటితో సూర్యాపేట జిల్లా ఎక్కువ లాభపడుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, తెలంగాణ రాకుంటే ఎస్సారెస్పీ కాల్వల్లో నీటిని చూసి ఉండేవాళ్లమే కాదని గుర్తు చేశారు. ప్రజలకు నీరందించడంలో సీఎం కేసీఆర్‌ సఫలమయ్యారని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో నీరందని రైతులు సైతం ఇపుడు నీళ్లు వద్దనే స్థాయికి సీఎం తీసుకొచ్చారని గుర్తు చేశారు. చివరి ఆయకట్టుకు నీరందాలంటే 20 రోజుల ముందే విడుదల చేయాలని కోరారు.  

తెలంగాణ ఎడారయ్యేది : మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రం ఏర్పడకున్నా, కేసీఆర్‌ సీఎం కాకున్నా తెలంగాణ ఎడారిగా మారి ఉండేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీరందుతున్నదని స్పష్టం చేశారు. నీళ్ల కోసం కొట్టుకున్న రోజులు పోయాయని, ఇప్పుడు ఇగ చాలు అనేంతగా నీళ్లొస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల చెరువులు నిండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వల ద్వారా ఏడు జిల్లాల్లో 1677 చెరువులను నింపి 12లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేయాలన్నారు. కాలువల మరమ్మతులను ఉపాధి పథకం ద్వారా పూర్తి చేయాలని, కాల్వల వెంట హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు.  

సమన్వయంతో సాగాలి : మంత్రి సత్యవతి రాథోడ్‌

నీటి విడుదల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ సమన్వయంతో సాగాలని  గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ సూచించారు. కష్టాలను అధిగమించి సీఎం కేసీఆర్‌ రైతులకు సాగునీరందిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌, రైతుల నమ్మకం వమ్ముకాకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ఎంపీలు పసునూరి దయార్‌, కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు, తుంగతుర్తి, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు, జెడ్పీ అధ్యక్షులు, డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, గండ్ర జ్యోతి, రసమయి బాలకిషన్‌, కుసుమ జగదీశ్‌, హర్షిణి, కలెక్టర్లు రాజీవ్‌గాంధీహన్మంతు, ఎం హరిత, గౌతం, అజీమ్‌, కృష్ణ ఆదిత్య, వినయ్‌కృష్ణారెడ్డి, శశాంక, ఎస్సారెస్పీ ఈఎన్సీ నాగేంద్ర, సీఈ శంకర్‌ పాల్గొన్నారు.  

మొదటి సారి నీళ్లు చూశాం : రెడ్యానాయక్‌, ఎమ్మెల్యే, డోర్నకల్‌

డోర్నకల్‌ నియోజకవర్గ చరిత్రలో మొదటిసారి ఎస్సారెస్పీ కాల్వల నిండా నీటి ప్రవాహం చూశాం. టీఆర్‌ఎస్‌ సర్కారు కొలువుదీరిన తర్వాత కొద్ది రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేవలం మూడేళ్లలో పూర్తి చేసి గత యాసంగికి నియోజకవర్గం రైతులకు నీరు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల తరఫున ధన్యవాదాలు. ఇందుకు కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులకు కృతజ్ఞతలు. డోర్నకల్‌, సూర్యపేట నుంచి నీళ్లు నింపితేనే మాకు న్యాయం జరుగుతుంది. కాలువల్లో సిమెంట్‌ పనులు, ఓటీ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం రైతులు నార్లు పోస్తున్నారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2లకు వారం చొప్పున నీటిని విడుదల చేయాలి. స్టేజీ-2 ఉన్న చివరి ఆయకట్టు వరకూ నీరందేలా చూడాలి 

రైతుల సంక్షేమానికి సీఎం కృషి : శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే, మహబూబాబాద్‌

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. కనీసం ఒక్క ఎకరానికి కూడా సరిపడా నీరందించలేదు. ఉద్యమ నేత, బంగారు తెలంగాణ ప్రధాత సీఎం కేసీఆర్‌ రైతుల గురించి ఆలోచిస్తూనే వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తొమ్మిది లక్షల క్వింటాళ్ల ధాన్యం పండించి రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. గూడూరు మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టి లష్కర్లను నియమించాలి. ఏరియా దవాఖానలను అప్‌గ్రేడ్‌ చేయాలి. ఈ నెల 22, 25 తేదీల మధ్య నీరందిస్తే రైతులకు మేలు కలుగుతుంది.  

డీబీఎంలపై దృష్టి పెట్టాలి  : పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని డీబీఎంలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పటికీ గత సీజన్‌లో నింపిన నీటితో చెరువులు నిండి ఉన్నాయి. అధికారులను సమన్వయం చేసుకొని రైతులకు సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డీబీఎం-38, 48 కాల్వ చాలా పొడవుగా ఉంది. చివరి ఆయకట్టుకు నీరు పోవడం ఇబ్బందిగా ఉంది. కాల్వల మరమ్మతులకు వెంటనే టెండర్లు వేసి రైతులకు మేలు కలిగేలా చూడాలి. ఆగస్టు 10తర్వాత నీటిని విడుదల చేస్తే బాగుంటుంది. 

చివరి ఆయకట్టుకూ అందాలె  : గండ్ర  వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, భూపాలపల్లి

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. 30 ఏళ్లలో మా నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయి నీరందిన దాఖలాల్లేవు. గత సీజన్‌లో ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్న సందర్భంలో సీఎం కేసీఆర్‌ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసిన్రు. నియోజకవర్గంలో అన్ని చెరువులనూ నింపినందుకు ప్రజలు, రైతులు తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. మూడు పంటలు సాగు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. భూపాలపల్లిలో దవాఖానలను ప్రారంభించాలి. ఎస్సారెస్పీ భూముల విషయంలో రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేదు. వాటిని సరిచేయాలె.  

ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలి :  చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే, పరకాల

పరకాల నియోజకవర్గంలో ప్రస్తుతం అన్ని చెరువులు 60 నుంచి 70 శాతం నిండి ఉన్నయ్‌. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేస్తే రైతులకు మేలు. అదేవిధంగా ఎస్సారెస్పీ కాల్వలు, షెట్టర్లకు మరమ్మతులు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు.

కోటి ఎకరాలకు సాగు నీరు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు

కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో 63లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. అంచనాలకు మించి రైతులు పంటలు పండిస్తున్నరు. ఇందుకు కారణం వ్యవసాయానికి సాగునీరందించడమే. 33 జిల్లాలకు 25 జిల్లాలో నీరు సమృద్ధిగా  ఉంది. ఏడు జిల్లాలో నార్మల్‌గా, నిర్మల్‌లో తక్కువ నీరుంది. జూన్‌ 16వరకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయిన రైతులందరికీ రైతు బంధు పథకం డబ్బులు జమయ్యాయి. ఇప్పుడు రైతులు ఎస్సారెస్పీ నీరు అనకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అనాలె.  

సీఎం ఆలోచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మితమవుతున్నాయి. ఎస్సారెస్పీ కాల్వలు ఏడు జిల్లాల్లో విస్తరించాయి. తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్‌కు జన్మాంతం రుణపడి ఉంటారు. కేసీఆర్‌ ఆశయాలకు తగ్గట్టుగా అధికారులు చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ఎస్సారెస్పీ భూములకు రక్షణ కల్పించాలి. ఈ భూముల్లో ఆర్గానిక్‌, తోటలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. మత్స్యకారుల కుటుంబాలకు శిక్షణ ఇస్తే ఆ  ఉపయోగం ఉంటుంది. 

చెరువులు అన్యాక్రాంతంకాకుండా చూడాలి : రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌

ఎస్సారెస్పీ ద్వారా అద్భుత పలితాలు వచ్చాయి. వ్యవసాయంతో పాటు మత్స్య శాఖ కూడా బాగుపడింది. దీంతో చాపలు సుమారు 35 కిలోలవరకు పెరిగాయి. సీఎం మత్స్యశాఖను అభివృద్ధి చేస్తున్నారు. వ్యసాయంతో పాటు మత్స్య పరిశ్రమకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులు సాధించిన ప్రగతిపై త్వరలో ఒక డాక్యుమెంటరీ విడుదల చేయనున్నాం. చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.

   ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడాలి : మానకొండూర్‌ ఎమ్మెల్యే  బాలకిషన్‌

ప్రతి నీటి చుక్కను ఎంతో పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్వల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలి. ఇంత పెద్ద స్థాయిలో ఎస్సారెస్పీ సమీక్ష సమావేశం జరుగడం ఇదే మొదటి సారి. 


logo