సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 04, 2020 , 02:46:55

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

  • n పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
  • n పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలి
  • n మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్

మహబూబాబాద్ రూరల్: ఆరో విడుత హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. మండలపరిధిలోని నడివాడ పంచాయతీలో ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం పల్లె ప్రకృతి వనాల పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటి వాటికి నీరందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి జీపీలో ప్రకృతి వనాలను పెంచి వాటి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రకృతి వనాల్లో ఒకేరకం కాకుండా 30 రకాల మొక్కలను వివిధ వరుస క్రమంలో నాటాలన్నారు. ఎకరానికి సుమారు 4 వేల మొక్కలను నాటేలా గుంతలను సిద్ధం చేయాలన్నారు. గత హరితహారంలో క్యాంపు కార్యాలయంలో 1152 మొక్కలను నాటి వాటిని సంరక్షించడం వల్ల ఈరోజు ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య మౌనిక, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సర్పంచులు పెదగాని నర్మద, భూక్య వస్రాం, ఎంపీటీసీ శ్రీపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లునావత్ అశోక్ నాయక్, తేళ్ల శ్రీను, గుట్టయ్య, మందుల రఘు, అధికారులు డీఆర్‌డీఏ పీడీ విద్యాచందన, ఎంపీడీవో రవీందర్, తసీల్దార్ రంజిత్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి ఆనంద్‌కుమార్, ఏపీవో పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలి

ధర్మసాగర్: గ్రామాలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని నారాయణగిరిలో రూ. 6.49 లక్షలతో చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ముప్పారంలో మంకీ ఫుడ్‌కోర్డు పనులను ప్రారంభించి అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరో విడత హరితహారంలో ప్రతి గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, ఎంపీడీవో జీ జవహర్‌రెడ్డి, తహసీల్దార్ సీహెచ్ రాజు, డీఎఫ్‌వో భిక్షపతి, డిప్యూటీ డీఎఫ్‌వో సురేశ్‌కుమార్, ఏపీవో సంపత్, సర్పంచ్‌లు గోనెల సమ్మక్క, కర్ర సోమిడిరెడ్డి, ఎంపీటీసీలు పెద్ది శ్రీనివాస్, రైతుబంధు మండల కో అర్డినేటర్ సోంపెల్లి కరుణాకర్, ఎంపీవో మిమల, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo