సోమవారం 06 జూలై 2020
Warangal-city - Jun 30, 2020 , 05:28:35

ఇంటి కిటికీల గ్రిల్స్‌ తొలగించి చోరీలు

ఇంటి కిటికీల గ్రిల్స్‌ తొలగించి చోరీలు

  • నిందితుడిని పట్టుకున్న పోలీసులు
  • రూ. 34 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

వరంగల్‌ క్రైం, జూన్‌ 29: రాత్రి వేళల్లో ఇంటి కిటికీల గ్రిల్స్‌ తొలగించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సుబేదారి, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ మేరకు అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.

హన్మకొండలోని జూలైవాడకు చెందిన సయ్యద్‌ కైసర్‌ 2012లో ఉద్యోగం కోసం విజిట్‌ వీసాపై దుబాయ్‌కి వెళ్లి తిరిగొచ్చాడు. అతడు మద్యానికి బానిసై డబ్బుల కోసం హైదరాబాద్‌లో చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. సయ్యద్‌ కైసర్‌ తన దగ్గరి బంధువు ద్వారా ఉద్యోగ వీసా రావడంతో మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ రెండేళ్లపాటు బేకరీలో పని చేశాడు. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తీసివేశారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని కొద్ది రోజులు ఆటో డ్రైవర్‌గా పని చేశాడు. తర్వాత హన్మకొండ జూలైవాడలోని తన సొంత ఇంటికి చేరుకున్నాడు.

జల్సాల కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. రాత్రిపూట ఇంటి కిటికీల గ్రిల్స్‌ తొలగించి చోరీలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఈ నేపథ్యంలో 2017 నుంచి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సుబేదారి, కేయూసీ, మట్టెవాడ, మీల్స్‌కాలనీ పీఎస్‌ల పరిధిలో 14 చోరీలు చేశాడు. చోరీలపై దృష్టి సారించిన అదనపు డీసీపీ తిరుపతి, క్రైం ఏసీపీ బాబురావు పర్యవేక్షణలో సీసీఎస్‌, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ నిందితుడి కదలికలపై దృష్టిని కేంద్రీకరించారు. సయ్యద్‌ కైసర్‌ చోరీ చేసిన ఆభరణాలను వరంగల్‌ బులియన్‌ మార్కెట్‌లో అమ్మేందుకు హంటర్‌రోడ్డులో ఆటో కోసం వేచి చూస్తుండగా సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నాడు.

దీంతో అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 637 గ్రాముల బంగారు ఆభరణాలు, 1200 గ్రాముల వెండి, రెండు కెమెరాలు, ఏడు చేతి గడియారాలు, ఆరు మొబైళ్లు, ట్యాబ్‌, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సీసీఎస్‌ సిబ్బందిని సీపీ అభినందించారు.


logo