బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jun 28, 2020 , 01:18:15

ఉద్యమంలా హరితహారం

ఉద్యమంలా  హరితహారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం ఉద్యమంలా నడుస్తున్నది. వరంగల్‌ నగరంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం, ఎంపీ దయాకర్‌, రేగొండ మండలం దమ్మన్నపేట, కనిపర్తి, రాయపర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర మొక్కలు నాటారు. ఖానాపురం మండలంలో 10 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించారు. ములుగు జెడ్పీ కార్యాలయ ఆవరణలో చైర్మన్‌ జగదీశ్వర్‌ మొక్కలు నాటారు.

ఖానాపురం, జూన్‌ 27: ఆరో విడత హరితహారం కార్యక్రమం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నది. శనివారం అన్ని ప్రాంతాల్లో ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఇందులో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని దబ్బీర్‌పేట-కీర్యీతండా శివారు సరిహద్దుల్లో 10 హెక్టార్ల విస్తీర్ణంలో 11,111 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీసీఎఫ్‌ అక్బర్‌తో కలిసి వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించడంతోనే పర్యావరణ సమతుల్యం ఏర్పడి మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఆదాయాన్నిచ్చే పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.  సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం అడవులే ఉన్నాయని, 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో  జిల్లా అటవీ శాఖాధికారి అర్పన, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఆర్డీవో పవన్‌కుమార్‌, తహసీల్దార్‌ సుభాషిణి, ఏసీపీ ఫణీందర్‌, సీఐ సతీశ్‌బాబు, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీడీవో రమాదేవి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కలను సంరక్షించాలి

రెడ్డికాలనీ: మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత స్థానిక నాయకులు, అధికారులకు ఒక్కో వ్యక్తికి ఒక చెట్టును కేటాయించాలని చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండ 30వ డివిజన్‌ కాకాతీయ కాలనీలో హరితహారం చేపట్టారు. ఈ సందర్భంగా దాస్యం వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 30వ డివిజన్‌లో కమ్యూనిటీ అలంకార్‌ సమీపంలో టాయిలెట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ బోడ డిన్నా, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ సునీత, ఇతర అధికారులు, డివిజన్‌ అధ్యక్షులు పేర్ల మనోహర్‌, శంకర్‌, రమేశ్‌, దర్శన్‌సింగ్‌, బొట్ల కుమార్‌, ప్రభాకర్‌, అశోక్‌, చింతాకుల ప్రభాకర్‌, పులి రజినీకాంత్‌ పాల్గొన్నారు.

ప్రతి గ్రామం హరిత వనం కావాలి

రేగొండ: ప్రతి గ్రామం.. హరిత వనంగా మారాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమ్మన్నపేట, కనిపర్తి, రాయపల్లె లో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యంరావు, పీఎసీఎస్‌ చైర్మన్‌ మడిపల్లి విజ్జన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్‌, సర్పంచ్‌లు శ్రీనివాసరావు, నారాయాణరెడ్డి అన్నారు.

హరితహారంతో పర్యావరణ పరిరక్షణ

ములుగు: హరితహారంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతున్నదని జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జెడ్పీ సీఈవో పారిజాతం, కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఇక్బాల్‌, వినిత్‌రెడ్డి, కిర్మాణి, రవి, దినేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo