శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 27, 2020 , 02:46:06

పల్లెల ప్రగతికి పెద్దపీట

పల్లెల ప్రగతికి పెద్దపీట

  • అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం
  •  రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పల్లెల ప్రగతికి రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తున్నదని, అభివృద్ధి, సంక్షేమానికి కోట్లాది నిధులు మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం తొర్రూరులో అధికారులతో సమీక్షించి మాట్లాడారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సర్పంచ్‌, కార్యదర్శిపై వేటు తప్పదని హెచ్చరిస్తూనే, పారిశుద్ధ్యం, హరితహారం విజయవంతానికి ఉపాధి నిధులతోపాటు కూలీలను వినియోగించుకోవచ్చని సూచించారు.                  - తొర్రూర్‌

తొర్రూరు/తొర్రూరురూరల్‌: పల్లెల ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పని చేస్తున్నదని, ఇందులో భాగంగానే కొత్త పం చాయతీలు ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమానికి కావాల్సి న నిధులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచులు, కార్యదర్శి, వార్డు సభ్యులు అలసత్వం చూపితే వేటుతప్పదని హెచ్చరించారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌లో జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల తీరు, ఎస్సారెస్పీ కాల్వ ల సమస్యలు, ఉపాధిహామీ నిధుల వినియోగం, పల్లె ప్రగ తి కార్యక్రమ నిర్వహణ, హరితహారంపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

పల్లెలో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం పకడ్బందీగా అమలుకు ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న సిబ్బందికి తోడు ఉపాధి పనులకు వెళ్లే కూలీలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. తొర్రూరు, పెద్దవంగర మండలాలు పల్లె ప్రగతిలో వెనుకబడి ఉన్నాయని, పారిశుద్ధ్య లోపంతో కనిపిస్తున్నాయని అన్నారు. పది రోజుల్లో తాను కలెక్టర్‌ గౌతమ్‌ కలిసి ఆకస్మిక పర్యటన చేస్తామని, పరిస్థితి మెరుగుపడకపోతే సంబంధిత సర్పంచ్‌, కార్యదర్శిపై వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, డంప్‌యార్డుల ఏర్పాటు, మురుగుకాల్వల నిర్వహణ వంటి పనులన్ని పరిశీలిస్తామని చెప్పారు.

అనుమతి లేకుండా చెట్టు నరికితే రూ.5వేల నుంచి రూ.10వేలు దాకా జరిమానా విధించాలని, ఇందుకు సర్పంచ్‌, కార్యదర్శి బాధ్యత తీసుకోవాలన్నారు. అనుమతితో ఒక్క చెట్టు నరికితే ఆరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటానని సదరు వ్యక్తితో అంగీకార పత్రం తీసుకోవాలని సూచించారు. 

వచ్చే నెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రవేశాలు

తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామాల్లో మొదటి, రెండో విడుతల్లో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. వచ్చే నెల 1, 2వ తేదీల్లో లేదా మొదటి వారంలో  ప్రారంభించేందుకు గడువు నిర్ణయించారు. మిగతావి ఆగస్టులో ప్రారంభించాలని, ఎక్కడైనా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం చేస్తే వెం టనే తొలగించి ఇతరులకు పని అప్పగించాలని ఆదేశించా రు. ఆకేరు, పాలేరు వాగులపై నూతనంగా మంజూరైన 10 చెక్‌డ్యాంల నిర్మాణానికి స్థలాల గుర్తింపును పూర్తి చేసి వారంలోగా పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. 

సాగునీటి పనులకు అడ్డుపడితే సహించం..

కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నందున చెరువులన్ని నింపేలా కష్టపడుతున్నామని, ఎక్కడైనా సాగునీటి కాల్వల తవ్వకం విషయంలో ఎవరైనా అడ్డుపడితే సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు. మడిపల్లి గ్రామ చెరువు కు నీరు వెళ్లేందుకు గతంలో తవ్విన కాల్వల పరిహారం చెల్లింపులో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో నూతనంగా కాల్వ తవ్వకానికి భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ కోరగా, వెంటనే ఆదేశాలు ఇచ్చారు.

నేరుగా చెరువుల్లోకి గోదావరి జలాలు చేరేలా అవసరం ఉన్న చోట ఓటీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఈశ్వరయ్య, డీఆర్‌డీవో విద్యాచందన, డీపీవో రంగాచారి, జిల్లా ఇరిగేషన్‌ అధికారి రాధాకృష్ణ, డీఎస్పీ వెంకటరమణ, డీఏవో ఛతృనాయక్‌, డీఎఫ్‌వో టి.కృష్ణమాచారి, డిప్యూటీ ఈఈ శామలనాయక్‌, షఫిమీయా, ఎంపీపీలు తుర్పాటి చిన్నఅంజయ్య, రాజేశ్వరిఐలయ్య, జడ్పీటీసీలు మంగళప ల్లి శ్రీనివాస్‌, జ్యోతిర్మయిసుధీర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌ ఉన్నారు. 

పీపీఈ కిట్లు.. చెక్కులు పంపిణీ..

మడిపల్లిలోని కపిల్‌ హోమ్స్‌ గ్రీన్‌ల్యాండ్‌, తొర్రూరులోని బాలికల పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌ ఆవరణలో కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ వైద్యులకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. తొర్రూరులో డీసీసీబీ ఆధ్వర్యంలో రైతులకు రూ.కోటి విలువైన పంట రుణాల చెక్కులను, హార్వెస్టర్‌, కారును మంత్రి దయాకర్‌రావు పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీరాం, క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాజు, కె.నర్సింహారెడ్డి, పి.రమేశ్‌, ఉప గవర్నర్లు టి.లక్ష్మినర్సింహారావు, కె.పరుశరాములు, పూర్వ గవర్నర్‌ డాక్టర్‌ కె.రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా డైరెక్టర్‌ కాకిరాల హరిప్రసాద్‌ ఉన్నారు. 


logo