శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 25, 2020 , 03:07:53

ప్రతి ఊరూ ఉద్యానవనం కావాలి

ప్రతి ఊరూ ఉద్యానవనం కావాలి

  • అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి 
  • నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
  •  రాష్ట్ర మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు    
  • సంరక్షణ అందరి బాధ్యత: మంత్రి సత్యవతిరాథోడ్‌ 
  • హన్మకొండలో అర్బన్‌, రూరల్‌ జిల్లాల అధికారులతో సమీక్ష
  • పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

హరితహారం రాష్ర్టానికి గొప్ప వరమని, ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి, ప్రతి ఊరునూ ఉద్యానవనంలా  మార్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్బోధించారు. మొక్కలు నాటితే సరిపోదని, సంరక్షిస్తేనే అసలు లక్ష్యం నెరవేరుతుందని సూచిస్తూనే, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో హరితహారం, కొవిడ్‌-19 స్థితిగతులపై హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.   

న్యూశాయంపేట: తెలంగాణకు హరితహారం గొప్పవరమని, ప్రతి ఊరును ఒక ఉద్యానవనంగా మార్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్బోధించారు. ఆరో విడత హరితహారంలో గతంలో కంటే భిన్నంగా ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలని, అన్ని భాగస్వామ్యశాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు అద్భుతమైన హారాన్ని తెలంగాణకు హరితహారం రూపంలో తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు.

ఇందులో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘నిధుల కొరత లేదు. మొక్కల కొరత అసలే లేదు. మీకెన్ని కావాలంటే అన్ని మొక్కలు ఇస్తాం. నాటిన మొక్క నూటికి నూరు శాతం బతకాలని’ ఆయన స్పష్టం చేశారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ రెండు జిల్లాల్లో హరితహారం, కొవిడ్‌-19 స్థితిగతులపై హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఈ సారి హరితహారంలో నాటిన మొక్కలు వంద శాతం కాపాడకపోతే సహించేది లేదని అధికారులకు హెచ్చరించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు నెలకొల్పేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెద్ద మొక్కలు మాత్రమే నాటే లా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ పనులకు ఉపాధి హామీతో అనుసంధానం చేసి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో నీటి వనరులు పెంపొందించేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. రైతు వేదికలు, పశువుల కొట్టాలు, షెడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు వాడుకోవచ్చని సూచించారు. 

గతేడాది కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కూరగాయల సాగుచేసేవారికి మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులు ఎక్కువ మంజూరవుతాయని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఉద్యావనాల కోసం ఎకరం జాగ దొరికినా సరే దాన్ని గ్రామ పార్కుగా మార్చేందుకు పూనుకోవాలన్నారు. చెరువుల్లో పూడిక తీసి శిఖాల్లో పెద్ద మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి కోసం ఎకరం స్థలం కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి ఇంటికీ కృష్ణ తులసి మొక్కను ఇవ్వాలని చెప్పినట్లు వివరించారు. 

సంరక్షణే అసలు లక్ష్యం.. 

 ఆరో విడత హరితహారం విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను రక్షించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని సూచించారు. చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ మాట్లాడుతూ అర్బన్‌ జిల్లాలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ హైవేలో పెట్టిన మొక్కలు ఆహ్లాదపరుస్తున్నాయని, అదే స్ఫూర్తితో నగరంలో ప్రతి లే-అవుట్‌ ప్లాట్లలో మొక్కలు నాటే విధంగా చూడాలని సూచించారు. ఆకుపచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని అరూరి రమేశ్‌ పిలుపునిచ్చారు. అర్బన్‌లో మొక్కల రక్షణ ఇబ్బందిగా మారిందని, నాటిన ప్రతి మొక్క బతికినప్పుడే మన లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ చెప్పారు. చెరువు పూడికతో మిషన్‌ భగీరథ పనులను ఉపయోగించి వర్షాకాలంలో చెరువు నిండేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్టుగా ప్రతి స్థానిక సంస్థ తమ బడ్జెట్‌లో పది శాతం హరిత హారానికి కేటాయించాలని ఎంపీ బండా ప్రకాశ్‌ అన్నారు. మనిషికి పుట్టుక నుంచి చావు దాకా ప్రతి మనిషికి అవసరమయ్యే అన్ని పథకాలను తీసుకొచ్చిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచం అంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే రైతు వేదికల నిర్మాణాలు చేపట్టడం, రైతుబంధు కింద నిధులు ఇచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ దక్కిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీర్తించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతోనే ఏ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించుకోగలిగామని, హరితహారంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మె ల్యే ఒడితెల సతీష్‌కుమార్‌ సూచించారు. ఇక్కడ ఎంపీలు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌, వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, నగర పాలకసంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, జడ్పీ చైర్మన్లు జీ. సుధీర్‌కుమార్‌, గండ్ర జ్యోతి ఉన్నారు.