శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 22, 2020 , 01:44:59

నెరవేరనున్న గుడిసెవాసుల కల

నెరవేరనున్న గుడిసెవాసుల కల

కరీమాబాద్‌, జూన్‌ 21 : ఇళ్ల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుడిసెవాసుల కల నెరవేరనుంది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ చొరవతో వారికి ఇళ్ల పట్టాలు రానున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో దశాబ్దాల కాలంగా పట్టాల కోసం పోరాటాలు చేసిన పేదల కల సాకారం కానుంది.

గుడిసెవాసులకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత అంతటి నగరంగా పేరున్న వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఏళ్ల తరబడిగా అభివృద్ధికి నోచుకోని లోతట్టు ప్రాంతాలు, గుడిసెల కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులను కల్పించింది. ఇప్పటికే రోడ్లు, కాల్వల నిర్మాణం చేపట్టింది. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు సైతం చర్యలను చేపట్టింది. కాలనీల్లోని విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలివ్వాలని అసెంబ్లీలో కోరగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. తాజాగా పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశం ఇవ్వడంతో గుడిసె కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

  సుమారు 550 మందికి లబ్ధి..

అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతం 21, 22, 23వ డివిజన్‌లో పట్టాల పంపిణీతో దాదాపుగా 550 మందికి లబ్ధి చేకూరనుంది. 23వ డివిజన్‌లోని సీఆర్‌ నగర్‌లో 100, రాజీవ్‌నగర్‌లో 120, బీఆర్‌నగర్‌లో 180, ఎన్‌ ఎన్‌నగర్‌లో 100 మంది లబ్ధిదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. అదేవిధంగా 21, 22 డివిజన్లలో కూడా 50 మంది వరకు అర్హులు ఉన్నారు. పట్టాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో గుడిసెవాసులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపుని నరేందర్‌ చిత్రపటాలకు ఇటీవల క్షీరాభిషేకం చేశారు. logo