మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 22, 2020 , 01:30:38

‘చూడామణి’ కనువిందు

‘చూడామణి’ కనువిందు

  • ప్రత్యేక పరికరాలతో సూర్యగ్రహణ వీక్షణం
  • సంప్రోక్షణ అనంతరం ఆలయాల్లో దర్శనం

 ఖిలావరంగల్‌, జూన్‌ 21: మృగశిర నక్షత్రం మిధునరాశిలో రాహు గ్రస్త ‘చూడామణి’ నామక ఖండగ్రాస సూర్యగ్రహణం ముగిసింది. భారత కాలమాన ప్రకారం వరంగల్‌లో ఆదివారం ఉదయం 10.47 గంటలకు సర్పకాలం, మధ్యాహ్నం 12.02 గంటలకు మధ్యకాలం కాగా.. 1.47 గంటలకు మోక్షకాలం పూర్తయింది. ఆద్యంత పుణ్యకాలం 3.30 గంటలపాటు సూర్యడు వివిధ ఆకృతులతో కనువిందు చేశాడు. జిల్లా అంతటా ఔత్సాహికులు ప్రత్యేక పరికరాలతో గ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని ఆలయాలనూ శనివారం రాత్రే మూసివేయగా, గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. ప్రజలు సూర్యగ్రహణం పట్టు, విడుపు స్నానాలు ఆచరించి, గ్రహణం వీడిన తర్వాత ఇళ్లను శుద్ధి చేసుకొని యథా శక్తి పూజలు చేశారు. అనంతరం ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేశారు. స్వయం పాకం, వెండితో తయారు చేసిన సూర్యుడి ప్రతిమలు, తెల్లని వస్ర్తాలను దానం చేశారు.

వరంగల్‌ కల్చరల్‌: సూర్యగ్రహణం అనంతరం భద్రకాళీ ఆలయాన్ని శుద్ధి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉమారాణి తెలిపారు. సోమవారం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శాకాంబరీ నవరాత్రులు శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. 

దేవరుప్పుల/పాలకుర్తి: మండలకేంద్రంలో అర్ధ చంద్రాకార సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన బోనగిరి యాదగిరి పల్లెంలో రోకలిని నిలిపి సూర్యగ్రహణ విశిష్టతను తెలిపారు. పాలకుర్తి సోమేశ్వరాలయంలో శుద్ధి చేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

రెడ్డికాలనీ: చారిత్రక శ్రీరుదేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయాన్ని సూర్యగ్రహణం విడిచిన తర్వాత శుద్ధి చేశారు. అనంతరం పూజలు చేసినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

భీమదేవరపల్లి: కొత్తకొండలోని వీరభద్రస్వామి దేవస్థానంలో సంప్రోక్షణ అనంతరం స్వామి వారికి అభిషేకాలు, అలంకారాలు, నిత్యవిధిపూజ, ఆరగింపు జరిపారు. అనంతరం భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సులోచన తెలిపారు.

కురవి: సూర్యగ్రహణం అనంతరం మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయాన్ని కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రధాన పూజారి రామన్న ఆధ్వర్యంలో సాయంత్రం 3.30 గంటలకు తెరిచారు. గుండ్రాతిమడుగు ఆంజనేయ సమేత శివాలయాన్ని సాయంత్రం 4 గంటలకు పూజారి రంగాభట్టార్‌ ఆధ్వర్యంలో తెరిచి పూజలు చేశారు.

ఐనవోలు: మండలకేంద్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఏడు గంటలకు పవళింపు సేవ చేపట్టి ఆలయ ద్వారాలు మూసివేశారు.


logo