బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Jun 21, 2020 , 02:45:09

నిండుకుండలా నీటి కుంటలు

నిండుకుండలా నీటి కుంటలు

  • వర్షాలతో చేరుతున్న వరద 

ఏటూరునాగారం, జూన్‌ 20 : దట్టమైన అడవుల మధ్య అటవీశాఖ నిర్మించిన నీటి కుంటలు చిన్నపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్నాయి. ఏటూరునాగారం అటవీశాఖ రేంజ్‌ పరిధిలో పలు చోట్ల నీటి నిల్వ చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి నీటి కుంటలు ఏర్పాటు చేశారు. ఆయా నీటి కుంటల నిర్మాణం కోసం రూ.3.5లక్షల నుంచి రూ. ఐదు లక్షల వరకు వెచ్చించారు. వేసవిలో వన్య ప్రాణుల దాహం తీర్చడంతో పాటు భూగర్భ జలాలను పెంచేందుకు అటవీశాఖ అధికారులు దట్టమైన అడవిలో బోర్లు వేసి సోలార్‌ అనుసంధానం చేశారు. దీంతో సోలార్‌ పంపు సెట్లు నిత్యం నడుస్తున్నాయి. ఇక బోరు ద్వారా వచ్చే నీళ్లు కుంటలోకి చేరుతున్నాయి. నీటి సామర్థ్యం ఎక్కువగా ఉండేందుకు కూడా చేపట్టారు. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో వ్యూపాయింట్‌, మండల కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో కూడా మరో నీటి కుంటను నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్స్‌కు రక్షణగా చుట్టూ ఫెన్షింగ్‌ కూడా నిర్మించారు. వేసవిలో నీటి నిల్వ ఉండేందుకు ఏర్పాటు చేసిన కుంటలు వర్షాలు పడడంతో అవి కాస్త చెరువులా మారిపోతున్నాయి. బోరు నీటితోనే కాకుండా వర్షాలు కురిస్తే కుంటలోకి వర్షం నీరు చేరే విధంగా అనువైన ప్రదేశాలను గుర్తించి అటవీశాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు కుంటల్లోకి వరద చేరింది. వర్షాలు విస్తారంగా కురిస్తే నిండు కుండలా దర్శనమిచ్చి పచ్చని అడవిలో కనువిందు చేసే విధంగా కన్పించనున్నాయి. వేసవిలో సోలార్‌ పంపు సెట్లతో నీటి నిల్వ ఉండే కుంటలు వర్షా కాలంలో వర్షం నీటితో నిండి జలకళను సంతరించుకుంది. వానకాలంతో పాటు వేసవిలో కూడా వన్య ప్రాణుల దాహం తీర్చడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 

తాత్కాలిక రోడ్ల నిర్మాణం 

అటవీశాఖ అధికారులు నేరుగా నీటి కుంటల వద్దకు వెళ్లేందుకు గాను తాత్కాలికంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ సమయంలో వాహనాలు అక్కడి వెళ్లేందుకు, అటవీశాఖ అధికారులు తరచూ వాటిని పర్యవేక్షించేందుకు దారులు తప్పని సరిగా భావించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సోలార్‌ పంపు సెట్లు నిర్వహణ లోపం ఏర్పడితే వెంటనే తగు చర్యలు చేపట్టేందుకు కూడా ఈ దారులు ఉపయోగపడనున్నాయి. గతంలో అధికారులు అడవిలో వన్య ప్రాణుల దాహం తీర్చేందుకు సాసర్‌ పిట్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పలు అటవీశాఖ రేంజ్‌ల పరిధిలో పలు చోట్ల ఇలాంటి సోలార్‌ పంపు సెట్లతో నీటి కుంటలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నీటి కుంటలు ఇటు వన్య ప్రాణుల దాహం తీర్చడంతో పాటు భూ గర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండే విధంగా ఉపయోగపడుతున్నట్లు రేంజ్‌ ఆఫీసర్‌ అసఫ్‌ అలీ తెలిపారు. రేంజ్‌ పరిధిలో సోలార్‌తో నడిచేవిధంగా ఏర్పాటు చేసిన ఈ పంపు సెట్లు విజయవంతంగా నడుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.logo