ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jun 20, 2020 , 01:04:27

‘30 రోజుల ప్రణాళిక’తో మారిన పల్లె ముఖచిత్రం

‘30 రోజుల ప్రణాళిక’తో మారిన పల్లె ముఖచిత్రం

n పట్టణాలకు దీటుగా అర్బన్‌ పార్కు

n సిటీని తలపించేలా సెంట్రల్‌ లైటింగ్‌

n చెరువుకు చేరనున్న స్వచ్ఛమైన నీరు

n తీరనున్న దశాబ్దాల సమస్య

n పాత, కొత్త కలెక్టర్ల చొరవతో కొత్తరూపు

‘30 రోజుల కార్యాచరణ ప్రణాళిక’తో నెల్లుట్ల ప్రగతి బాట పట్టి మిరిమిట్లు గొలుపుతున్నది. సిటీని తలపించేలా సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ, ఆటవిడుపుతో పాటు ఆహ్లాదం పంచే అర్బన్‌ పార్కు ఆ ఊరికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పట్టుదల.. పాత, కొత్త కలెక్టర్ల చొరవతో రూ.85 లక్షలతో గ్రామం అన్నింటా అభివృద్ధి సాధిస్తున్నది. ఇన్నాళ్లూ మురుగు నీటితో కలుషితమైన చెరువులోకి ఇక స్వచ్ఛమైన గోదావరి నీళ్లు రానుండడంతో దశాబ్దాల సమస్య తీరనుంది.                      - లింగాలఘనపురం 

జనగామ జిల్లా కేంద్రానికి అతి సమీప గ్రామం నెల్లుట్ల. వ్యాపార, వాణిజ్యపరంగా దినాదినాభివృద్ధి చెందుతున్న జనగామలో కాలుష్యం కూడా అదేస్థాయిలో పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు కాస్త ఆటవిడుపుగానే కాకుండా ఆహ్లాదం పంచేందుకు నెలుట్లలో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి భావించారు. ఈ మేరకు సర్పంచ్‌ చిట్ల స్వరూపారాణి చొరవ తీసుకొని వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో పార్కు పనులకు శ్రీకారం చుట్టారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలకు, అభివృద్ధి పనులకు మోక్షం కలిగింది. సుమారు రూ.85.50 లక్షలతో నెల్లుట్లను అన్ని విధాలా తీర్చిదిద్దారు. పట్టణానికి దీటుగా సెంట్రల్‌ లైటింగ్‌, అంతర్గత సీసీ రోడ్లు వేయడంతో గ్రామం కొత్తరూపును సంతరించుకున్నది. ఏళ్ల తరబడి మురుగునీటితో నిండి ఉండే చెరువును శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు నింపనుండడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

పదెకరాల్లో అర్బన్‌ పార్కు

పల్లె ప్రగతిలో భాగంగా వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన పదెకరాల్లో అర్బన్‌ పార్కు ఏర్పాటైంది. ఇందులో 1500 జామ, 2వేల అల్లనేరేడు, వెయ్యి దానిమ్మ, వెయ్యి ఉసిరి, 500 నిమ్మ, 1500 సీతాఫల, 500 మునగ, 300 చింత, 5వేల టేకు, గులాబీ, మందార, 500 మల్లెపూల మెక్కలు నాటించారు. రూ.10 లక్షలతో పార్కు చుట్టూ రెండు కిలోమీటర్ల మట్టిరోడ్డు, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. సేదదీరేందుకు 60 సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. సకల హంగులతో ఈ పార్కు నెల్లుట్ల, జనగామ పట్టణ ప్రజలకు మార్నింగ్‌ వాక్‌కు వేదిక కానున్నది. మరికొద్ది రోజుల్లో మొక్కలు ఎదిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండగా, అప్పటి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ప్రస్తుత కలెక్టర్‌ నిఖిల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచారు.

తీరనున్న చెరువు సమస్య

మురుగు నీటిమయమైన చెరువుతో 70ఏళ్ల నుంచి నెల్లుట్ల ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. జనగామ పట్టణ మురుగు నీరంతా అక్కడి బతకమ్మకుంటలోకి చేరేది. వానకాలంలో కొద్దిపాటి వర్షానికే ఈ కుంట నిండి, నెల్లుట్ల చెరువులోకి వెళ్లేది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత బతకమ్మకుంటను సుందరంగా తీర్చిదిద్దారు. కుంటలోకి చేరే డ్రైనేజీ నీటిని మున్సిపల్‌ అధికారులు దారి మళ్లించడంతో నెల్లుట్ల చెరువులోకి వస్తుండడంతో నీళ్లు కలుషితమై చేపలు మృత్యువాతపడేవి. నీటిని తొలగించి స్వచ్ఛమైన గోదావరి జలాలను మళ్లించాలని ఇటు గ్రామస్తులతో పాటు సర్పంచ్‌ చిట్ల స్వరూపారాణి, ఎంపీపీ చిట్ల జయశ్రీ విజ్ఞప్తి మేరకు మున్సిపల్‌ అధికారులు, కలెక్టర్‌ స్పందించారు. ఉపా ధి హామీ పథకం కింద చెరువులోని మురుగు నీటి తొలగించడంతో పాటు రూ.కోటితో ప్రత్యేక డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులు చేపట్టారు.

రూ.85.50 లక్షలతో గ్రామాభివృద్ధి

రూ.85.50 లక్షలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. రూ.20 లక్షల ఈజీఎస్‌ నిధులు, 26 లక్షల జీపీ(గ్రామ పంచాయతీ) నిధుల నుంచి అంతర్గ త సీసీ రోడ్లు నిర్మించారు. అవసరమున్న చోట రూ.10లక్షలతో రెండు కిలోమీటర్ల మేర మట్టిరోడు వేశారు. నెల్లుట్ల మెయిన్‌ రోడ్డులో రూ.8 లక్షలతో కొత్త గా తాగునీటి కోసం పైపులైన్‌ ఏర్పాటు చేశారు. వాటర్‌ట్యాంకుల మరమ్మతుల కోసం రూ.4లక్షలు, మహిళలు బతకమ్మ ఆడుకునేందుకు గ్రామానికి చేరువలో ఉన్న బంధంకుంటకు రూ.4లక్షలతో రోడ్డు, లైట్లు వేశారు. పశువుల తాగునీటి కోసం రూ.లక్ష వెచ్చించి నీటి తొట్లు, రూ.12.50 లక్షలతో శ్మశానవాటిక నిర్మించారు.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

నెల్లుట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఊరిలో 1500 మంది మహిళా సంఘం సభ్యుల కోసం రూ.10 లక్షలతో స్త్రీశక్తి భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. నిధుల్లో సగం గ్రామ పంచాయతీ భరిస్తుండగా, మిగిలిన సగం ఎంపీటీసీ నిధుల నుంచి కేటాయిస్తున్నాం.

- చిట్ల జయశ్రీ-ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ, నెల్లుట్ల

ప్రత్యేకాకర్షణగా సెంట్రల్‌ లైటింగ్‌

నెల్లుట్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ రోడ్డుకిరువైపులా వందలాది మంది గృహాలు నిర్మించుకొని వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ-సూర్యాపేట డబుల్‌ రోడ్డును ప్రభుత్వం ఫోర్‌లేన్‌గా విస్తరించింది. అటు అధికారుల చొరవ.. ఇటు ప్రజాప్రతినిధుల పట్టుదలకు తోడు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో నెల్లుట్ల దినదినాభివృద్ధి చెందుతూ పట్టణాన్ని తలపిస్తున్నది. logo