శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 18, 2020 , 03:23:54

స్మార్ట్‌ఫోన్‌లోనే డ్రైవింగ్‌, ఆర్సీలు

స్మార్ట్‌ఫోన్‌లోనే డ్రైవింగ్‌, ఆర్సీలు

  • ఎం-వ్యాలెట్‌ యాప్‌ వినియోగం @ 50 లక్షలు
  • దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ ఆర్టీఏ
  • జాతీయ స్థాయిలో గుర్తింపు

ఆధునిక యుగంలో యాంత్రిక జీవనం మనిషిని ఆగమాగం చేస్తున్నది. ఉదయాన్నే లేచి.. హడావుడిగా తయారై ఏది వెంట తీసుకెళ్తున్నామో.. దేన్ని ఇంట్లోనే మర్చిపోతున్నామో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. తీరా రోడ్డుపైకి వెళ్లాక అబ్బా అది మర్చిపోయామే.. ఇది మర్చిపోయామే అని ఆందోళన చెందడం పరిపాటిగా మారుతున్నది. ఇక పత్రాలు లేకుండా వాహనాలపై వెళ్తున్నపుడు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే ఆ ఇబ్బందులు చెప్పనలవి కావు. ఇలాంటి ఇక్కట్ల నుంచి తప్పించేందుకు రవాణా శాఖ తెచ్చిన ‘ఎం-వ్యాలెట్‌ యాప్‌'  ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నది. రాష్ట్రంలో 50 లక్షల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారంటే ఇది ఏ మేరకు విజయవంతమైందో చెప్పనక్కరలేదు.   

ఖిలావరంగల్‌  : రాష్ట్ర రవాణా శాఖ మొబైల్‌ యాప్‌ ‘ఎం-వాలెట్‌'ను 2016, ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ ద్వారా సంబంధిత పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని సోదాల సమయం లో పోలీసులకు చూపించే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు దీనిని వినియోగిస్తున్న వాహనదారుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షలు దాటింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందనేందుకు ఈ విధానమే నిదర్శనంగా నిలుస్తున్నది. 

దేశానికి రోల్‌మోడల్‌

దేశంలోనే మొదటిసారి ‘ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌'ను ఆవిష్కరించిన రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. తెలంగాణలో వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు తీసుకొచ్చిన ఈ యాప్‌ వివిధ రాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా నిలిచి జాతీయ స్థాయిలో రాష్ర్టానికి గుర్తింపు తెచ్చిపెట్టింది.  

యాప్‌తో ఉపయోగాలు

‘ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌'తో అనేక ప్రయోజనాలున్నాయి. యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వాహన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇతరుల మొబైల్‌ నుంచి కూడా వివరాలను చూసుకోవచ్చు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలును ఉల్లంఘించినప్పుడు ఆ వాహనం ఎవరి పేరుపై ఉన్నది.. నడిపి వ్యక్తి అసలు యజమానా.. కాదా అనే విషయం ఎం-వ్యాలెట్‌లో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి వాహన యజమాని కాకపోతే అతడి ఫోన్‌ నంబరుకు సమాచారం చేరుతుంది. ఒకసారి ఎం-వ్యాలెట్‌లో నమోదు చేసుకున్న తర్వాత వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్‌ లెసైన్స్‌లు పోగొట్టుకున్నా బాధపడాల్సిన అవసరం లేకుండా యాప్‌ను రూపొందించారు.

జరిమానా చెల్లించే సౌలభ్యం

ట్రాఫిక్‌, రోడ్డు రవాణాశాఖ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు దానికి సంబంధించిన ఈ-చలానా కూడా తెలంగాణ ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌లో చూడొచ్చు. పెండింగ్‌ చలానాలు, గతంలో కట్టిన చ లానాల వివరాలు కూడా కనిపిస్తాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, హెల్మె ట్‌, సీటు బెల్టు, సిగ్నల్‌ జంపింగ్‌, మితిమీరిన వేగం, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనల్లో మీరు చేసిన తప్పిదం స్పష్టంగా ఎం-వ్యాలెట్‌లో పొందుపరుస్తారు. అలాగే, చలాన్‌ను కట్టుకునేందుకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా వాహనదారుడు తమ వద్ద ఉన్న క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు ద్వారా జరిమానా చెల్లించే వ్యవస్థను ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌కు అనుసంధానం చేశారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ విధానం

  • గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఎం-వ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
  • యాప్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్‌ కార్డు (ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాహనదారుడు ఆర్సీ ఆప్షన్‌ను క్లిక్‌ చేసుకోవాలి.
  • ఒక వరుసలో వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నంబరు, కింది వరుసలో వాహనం చాసిస్‌ నంబరుకు సంబంధించిన చివరి ఐదు డిజిట్స్‌ను నమోదు చేసి గెట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల వాహనానికి సంబంధించిన ఆర్సీ, పొల్యూషన్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌ తదితర ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలు మొబైల్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. 
  • మొదటి వరుసలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబరు, రెండో వరుసలో పుట్టిన తేదీని నమోదు చేయాలి. కింది భాగంలో చిన్న మార్క్‌పై క్లిక్‌ చేస్తే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలు కనిపిస్తాయి. అందులో జిల్లాను సెలెక్ట్‌ చేసుకొని గెట్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే ఒరిజనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలాగే, యాప్‌లోని ఆర్సీ కార్డుగానీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను ఇతర మొబైల్‌కు షేర్‌ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు.

ఎం-వ్యాలెట్‌ యాప్‌ ఉత్తమం

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ ఉత్తమమైనది. వాహనదారులు పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఎం-వ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. అధికారులు ఎవరడిగినా మొబైల్‌లో పత్రాలను చూపెడితే సరిపోతుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా రానున్న రోజుల్లో సాంకేతికపరంగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సేవలను అందుబాటులోకి తేనుంది.

-పీ పురుషోత్తం, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌  

ప్రతి ఒక్కరూ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకనుగుణంగా అందరూ మారాలి. ఎం-వ్యాలెట్‌ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పోలీసులు వాహన ధ్రువీకరణ పత్రాలు అడిగినప్పుడు ఎం-వ్యాలెట్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి అందులోని పత్రాలను చూపిస్తే సరిపోతుంది. ఈ యాప్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.                                                                                                    -కంచి వేణు, మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ 


logo