శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jun 18, 2020 , 03:14:13

ఠాణాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

ఠాణాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

  • కమిషనరేట్‌ నుంచి పీఎస్‌లకు స్కానర్ల సరఫరా
  • స్కానింగ్‌, శానిటైజేషన్‌ తర్వాతే స్టేషన్‌లోకి అనుమతి

వరంగల్‌ క్రైం, జూన్‌17 : కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కమిషనరేట్‌ పొలీసులు ఠాణాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తులను వైద్య పరికరాలతో ముందస్తుగానే గుర్తించి ఇతరులను కలువకుండా అడ్డుకుంటున్నారు. అనుమానాలుంటే ఎంజీఎంకు వెళ్లి పరీక్షించుకోవాలని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

కమిషనరేట్‌ పరిధిలోని ప్రతి స్టేషన్‌కు వచ్చేవారిని పరీక్షిచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి, థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేస్తున్నారు. ఆ సమయంలో టెంపరేచర్‌ తక్కువ లేదా ఎక్కువ ఉంటే స్టేషన్‌లోకి అనుమతించడం లేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను మాస్క్‌ ధరించి హ్యాండ్‌ శానిటైజేషన్‌ చేసుకున్న తర్వాతే స్టేషన్‌లోకి అనుమతించి భౌతికదూరం పాటిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి రోజూ పల్సీ ఆక్సీమీటర్లతో హార్ట్‌బీట్‌, ఆక్సిజన్‌ శాతాన్ని పరిశీలిస్తున్నారు. కరోనాను నివారించాలంటే సిబ్బందిని మాత్రమే చెక్‌చేస్తే సరిపోదని స్టేషన్లకు వచ్చేవారిని సైతం చెక్‌ చేయాలని నాలుగు రోజలు క్రితమే కమిషనరేట్‌ నుంచి 50 థర్మోమీటర్లను ఠాణాలకు, ప్రత్యేక విభాగాలకు పంపించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయిస్తున్నారు. సిబ్బందిని సైతం టెంపరేచర్‌ తనిఖీ తర్వాతే అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా జాగ్రత్తపడుతున్నారు.