మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 17, 2020 , 03:33:16

అతిపెద్ద సెంట్రల్‌ జైలు నర్సరీ

అతిపెద్ద  సెంట్రల్‌ జైలు నర్సరీ

  • 8 ఎకరాల్లో 14 లక్షల మొక్కలు
  • ఖైదీలే తోటమాలులు
  •  60 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకం
  • రోజూ పనులకు 50మంది కేటాయింపు
  • ఒక్కొక్కరికీ రూ.100 చొప్పున కూలి 
  •  పనితో సత్ప్రవర్తన : సూపరింటెండెంట్‌ మురళీబాబు

జైలు అనగానే ఎత్తయిన గోడల మధ్య చీకటి గుహల్లాంటి గదులు.. సంకెళ్లు.. ఊచలు గుర్తొచ్చి భయంకర వాతావరణం కళ్లముందు కదలాడుతుంది. కానీ, ఇక్కడి కారాగారం మాత్రం తీరొక్క మొక్కలతో ఆహ్లాదం పంచుతున్నది. ఎనిమిదెకరాల స్థలంలో 14లక్షల మొక్కల పెంపకంతో ఉద్యానవనాన్ని మరిపిస్తున్నది. రోజూ 50మంది ఖైదీలు తోటమాలులై నర్సరీ పనులు చేస్తుండగా వారికి జైలు యంత్రాంగం రోజు కూలి రూ.100చొప్పున చెల్లిస్తున్నది. వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో ఆవరణంతా ‘హరిత’మయమై దేశంలోనే తొలి, అతిపెద్ద ‘కేంద్ర కారాగార నర్సరీ’గా వరంగల్‌ సెంట్రల్‌ జైలు రికార్డు సృష్టించింది.      

 వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్‌ కేంద్ర కారాగారంలోని ఖైదీలు అతిపెద్ద నర్సరీని నిర్వహిస్తున్నారు. జైలు ప్రాంగణంలోని ఎనిమిదెకరాల స్థలంలో 14 లక్షల మొక్కలు కలిగి ఉండి దేశంలోనే ‘తొలి జైలు నర్సరీ’గా వరంగల్‌ కేంద్ర కారాగారం రికార్డు సృష్టించింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు పంపిణీ చేసేందుకు 60 రకాల పండ్ల మొక్కలు, పూలు, ఔషధ మొక్కలను సైతం ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌ మహానగరంలోని అనేక ప్రాంతాలకు కుడా సైతం ఇక్కడి నుంచే మొక్కలను సరఫరా చేస్తుంది. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను అందించేందుకు కుడాను జిల్లా కలెక్టర్‌ జైలుకు అనుసంధానం చేశారు. అందులో భాగంగా 14 లక్షల మొక్కలు పెరిగే సామర్థ్యంతో ఏర్పాటైన నర్సరీతో, కారాగారానికి పచ్చలహారం తొడిగినట్లయింది. జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఖైదీల్లో కొంతమంది చురుకైనవారిని ఎంపిక చేసి నర్సరీ నిర్వహణపై అవగాహన కల్పించారు. కుడా నుంచి ఇద్దరు పర్యవేక్షకులు సైతం ఖైదీలతో నిరంతరం పనిచేయిస్తున్నారు. 50 మంది ఖైదీలు నిత్యం నర్సరీ పనుల్లో తలమునకలవుతున్నారు. ఇలా పనిచేసినందుకు ఒక్కో ఖైదీకి రోజుకు రూ.100 చొప్పున కూలి చెల్లిస్తున్నారు. కూలి మొత్తం ఖైదీ బ్యాంకు ఖాతాలోనే వేస్తారు. నర్సరీకి కావాల్సిన ఎర్రమట్టిని ములుగు జిల్లా మల్లంపల్లి నుంచితెప్పించి బయట నర్సరీల కన్నా తక్కువ ధరకే మొక్కలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మొక్కల్ని కుడా తీసుకెళ్లింది. ప్రస్తుతం నర్సరీలో 7.5 లక్షల మొక్కలున్నాయి. జైలు నర్సరీలోని ప్రతి మొక్కకూ కుడా రూ.ఐదు చొప్పున చెల్లిస్తున్నది.  

నర్సరీకి నీరు.. నీటిలో చేపలు 

నర్సరీ పర్యవేక్షకుడిగా డిప్యూటీ జైల్‌ సూపరింటెండెంట్‌ కే శ్రీనివాస్‌రెడ్డిని నియ మించారు. ఆయనకు సహాయకులుగా  ముగ్గురు వార్డర్లున్నారు. వీరు నర్సరీకి నీటి కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అంతకుముందు అడవిలా ఉన్న జైలు ప్రాంగణాన్ని అంతా చదును చేశారు. రెండు మూలలకు రెండుచోట్ల పెద్ద పెద్ద గోతులు తీసి అందులోకి వాననీటిని పంపే ఏర్పాట్లు చేశారు. సువిశాల జైలు ప్రాంగణంలో కురిసిన వాన నీరు వృథాగా బయటికి పోకుండా పాండ్లలోకే వెళ్లేలా చర్యలు చేపట్టారు.  నీటి కుంటల ద్వారా జైలు లోపల ఉన్న రెండు పెద్ద బావుల్లో నీటి మట్టం పెరిగిందని సూపరింటెండెంట్‌ మురళీబాబు పేర్కొన్నారు. ఈ నీటికుంటల్లో దాదాపు 5వేల చేప పిల్లల్ని వేశామని, ఈ సారి ఒక్కో చేప కిలో నుంచి కిలోన్నర బరువు పెరిగిందని, జైలు అవసరాలు పోను బయట విక్రయించామని వివరించారు. కాగా, హరితహారం తొలివిడతలో నాటిన టేకు మొక్కలు జైలు ప్రాంగణం చుట్టూ హరిత హారతి పడుతున్నాయి. పెద్ద పెద్ద జైలుగోడలతో పోటీపడి టేకు మొక్కలు ఎదుగుతున్నాయి. తొలి విడత నాటిన 20వేల టేకు మొక్కల్లో దాదాపు ప్రతి మొక్కా పెరుగుతున్నది. 

ఖైదీల్లో సత్ప్రవర్తన 

క్షణికావేశం, పరిస్థితుల ప్రభావం వల్ల జైలుకు వచ్చినవారిలో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడతున్నాం. ఇక్కడికి వచ్చిన వారిని సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే మా పని. పనితో కూడా ఖైదీల్లో సత్ప్రవర్తన అలవడుతుంది. ఖైదీల పూర్వపు వృత్తులు, వారి నైపుణ్యం ఆధారంగా ఇక్కడ వారి సేవలను వినియోగించుకుంటున్నాం. వారి అభి రుచి అనుభవం ఆధారంగా పనులు అప్పగిస్తు న్నాం. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ఖైదీలు భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలని అని ఆలోచించాం. విశాలమైన స్థలా న్ని నర్సరీగా ఎందుకు వినియోగించుకూడదు అనుకున్నాం. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి నర్సరీ ఏర్పాటు చేశాం. ఇంతపెద్ద నర్సరీ కలిగి ఉన్న జైలు దేశంలోనే మాదొక్కటే.   

-ఎన్‌. మురళీబాబు, సూపరింటెండెంట్‌,    వరంగల్‌ కేంద్ర కారాగారం 


logo