గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 16, 2020 , 00:29:29

ఒంటరి మహిళలకు ‘మాతా..పిత’

ఒంటరి మహిళలకు ‘మాతా..పిత’

  • ఆర్థికాభివృద్ధికి వెల్ఫేర్‌ సొసైటీ చేయూత
  • అభాగ్యులను ఒక్కచోటుకు చేర్చి  కుట్టులో ఉచిత శిక్షణ..  ఉపాధికి బాట 
  • మాస్కులు, బట్ట సంచుల తయారీతో ముందుకు

ములుగు : వారంతా ఒంటరి మహిళలు. స్వశక్తిని నమ్ముకొని ముందుకెళ్లాలన్న వారి లక్ష్యానికి ‘మాతా పిత’ వెల్ఫేర్‌ సొసైటీ అండగా నిలిచింది. అభాగ్యులను ఒక్కచోటుకు చేర్చి కుట్టులో ఉచిత శిక్షణ ఇప్పిస్తూ ఉపాధికి మార్గం చూపుతున్నది. ఆర్థికాభివృద్ధి సాధించేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నదిములుగు జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకున్న ఈ వెల్ఫేర్‌ సొసైటీ ఒంటరి మహిళలను అక్కున చేర్చుకుంటున్నది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నది. దాతల సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పలు కాంట్రాక్టులను మహిళలకు అప్పగిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అండగా నిలుస్తున్నది. ఈ క్రమంలో సొసైటీ సేవలను గుర్తించిన ‘నేస్తం’ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు పింగిలి నాగరాజు రూ.10వేల విలువైన కుట్టు మిషన్‌ను అందించడం, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌ చింతకుంట నారాయణరెడ్డి సైతం ప్రోత్సహించడంతో ఈ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్లాస్టిక్‌ నివారణ కోసం బట్ట సంచులు కుట్టి కలెక్టర్‌ మొప్పు పొందారు. 

మేడారం జాతర వేదికగా..

మేడారం జాతర సమయంలో ప్లాస్టిక్‌ నివారణ కోసం సొసైటీ ముందుకొచ్చి మహిళలతో జ్యూట్‌, బట్ట సంచులు కుట్టించే బాధ్యత చేపట్టింది. ఈ నేపథ్యంలో 5000 సంచులు కుట్టించి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడింది. ప్లాస్టిక్‌ రహిత జాతరలో పాలుపంచుకున్న మహిళలు అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందారు. కాగా, మార్చి నుంచి కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో దానిని తరిమికొట్టేందుకు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించగా మాస్కుల తయారీ బాధ్యతను డీఆర్డీవో అధికారులకు అప్పగించారు. దీంతో ఆ శాఖ అధికారి గతంలో ‘మాతా పిత’ సొసైటీ సభ్యులు మేడారం జాతర సమయంలో ప్లాస్టిక్‌ రహితానికి సహకరించిన తీరును కలెక్టర్‌కు వివరించారు. దీంతో మాస్కులు కుట్టే కాంట్రాక్టును ఒంటరి మహిళలకే అప్పగించారు. 

30 వేల మాస్కులు తయారీ

జిల్లాలోని ప్రజలందరికీ పంపిణీ చేసేందుకు 1.50లక్షల మాస్కులు తయారు చేయించాలని డీఆర్డీవో అధికారులను కలెక్టర్‌ ఆదేశించగా ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బట్ట తెప్పించారు. కటింగ్‌ చేసి ఒంటరి మహిళలకు అందజేశారు. ఏప్రిల్‌ 3 నుంచి మే 16 వరకు 30వేల మాస్కులు కుట్టి అందజేశారు. ఇందుకు గాను ఒక్కో మాస్కుకు రూ.3 చొప్పున వారికి కూలి చెల్లించారు. ఈ లెక్కన 15 మంది సభ్యులు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కో మహిళ రోజుకు 200 మాస్కులు కుట్టగా రూ. 600 కూలి లభించింది.

ఉపాధి పొందుతున్నం

మాతా పిత వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ ద్వారా మాస్కులు కుడుతూ రెండు నెలల నుంచి ఉపాధి పొందుతున్నం. మేడా రం జాతర సమయంలో బట్ట సంచులు కుట్టి ప్లాస్టిక్‌ రహితం కోసం కృషి చేసి నం. ఇప్పుడు కరోనాను అడ్డుకునేందుకు మాస్కులు తయారు చేస్తున్నం. - కన్నం మణి 

వారధిగా సొసైటీ

మాతాపిత వెల్ఫేర్‌ సొసైటీ ఇటు ఒంటరి మహిళలకు, అటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నది. దాతల సహకారంతో కుట్టు మిషన్లు తీసుకొని మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నం. ప్రభుత్వం ఒంటరి మహిళలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలి.

- సంద బాబు, అధ్యక్షుడు


logo