బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Jun 15, 2020 , 01:33:22

‘10గంటలకు పది నిమిషాలు’ మంచి కార్యక్రమం

‘10గంటలకు పది నిమిషాలు’ మంచి కార్యక్రమం

  • సామాజిక ఉద్యమంలా చేపట్టాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • స్వగృహంలో చెత్తాచెదారం తొలగింపు
  •  కరోనా నేపథ్యంలో ఎవరూ తనను ప్రత్యక్షంగా కలువొద్దని సూచన
  •  ఫోన్‌లో అందుబాటులో ఉంటానని వెల్లడి 

పర్వతగిరి, జూన్‌ 14: వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని తన స్వగృహంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన సతీమణి ఉషతో కలిసి మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ‘10 గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలోని పూల మొక్కలు, చెట్ల పాదుల్లో చెత్తను ఏరివేశారు. నీరు నిల్వ ఉన్నచోట తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రతి ఆదివారం ‘10 గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. కేవలం వీఐపీలే కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులో ఉందన్నారు.

ఫోన్‌లో అందుబాటులో ఉంటా..

పాలకుర్తి రూరల్‌: దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు తనను కొంతకాలంపాటు ఎవరూ ప్రత్యక్షంగా కలువొద్దని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే బాధ్యత తమదేనన్నారు. 24 గంటలూ ఫోన్‌లో అందుబాటులో ఉంటామన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ తప్పనిసరి అన్నారు.


logo