గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 14, 2020 , 00:25:21

కళాకారుల నిలయం.. నటనాలయం

కళాకారుల నిలయం.. నటనాలయం

కరీమాబాద్‌: ఓరుగల్లు కళలు, కళాకారులకు పుట్టినిల్లు.. ఆధునిక పోకడలతో అంతరించిపోతున్న నాటకరంగాన్ని కాపాడుకోవాలని కొంతమంది కళాకారులు తాపత్రయ పడుతున్నారు. ఇందుకోసం ఓ భవనం ఉండాలని భావించి వారంతా ‘నటనాలయం’ ఏర్పాటు చేశారు. నాటకం మనుషుల్లో చైతన్యం నింపుతుంది.. వారిని ఆలోచింపజేస్తుంది.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నాటక రంగాన్ని బతికించుకుని భావితరాలకు అందించాలనే సంకల్పంతో కళాకారులంతా కలిసి  ఉర్సులోని తాళ్ల మండువ సమీపంలో మయూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కళాకారుల విడిదితోపాటు నాటకాలు, సీరియళ్లకు సంబంధించిన రిహార్సల్స్‌ చేసుకునేందుకు ‘నటనాలయం’ పేరుతో ఓ భవనాన్ని నిర్మించుకున్నారు. ఇటీవలే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు భవనాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో కళాకారులు, కళా ప్రదర్శనలకు ఓ వేదికను సైతం ఏర్పాటు చేసుకుంటామని కళాకారులు చెబుతున్నారు.

ఆసక్తి ఉన్న వారికి సభ్యత్వం..

నగరంలోని కొందరు కళాకారులు మయూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ సంస్థను స్థాపించారు. కళాకారులు, కళలపై ఆసక్తి ఉన్న వారిని సంస్థలో సభ్యులుగా చేర్చుకుని దాని ద్వారా డబ్బులను పోగు చేసుకున్నారు. కొందరు దాతలు వారికి సహకరించారు. సంస్థలో పోగైన డబ్బులతో స్థలం కొనుగోలు చేసుకున్నారు. తర్వాత కొంత కాలానికి ఓ భవనం నిర్మించుకుని, కళలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. logo