ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jun 14, 2020 , 00:14:55

కన్నుమూసేవరకు ప్రాణాలు పోయాలి..

కన్నుమూసేవరకు ప్రాణాలు పోయాలి..

వైద్యో నారాయణో హరి..! వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఆ మాట కొంతమంది వైద్యులకు అక్షరాలా సరిపోతుంది. ఆ కోవలోకే డాక్టర్‌ పర్చ అంజనీదేవి వస్తారు. 1970లో వైద్య వృత్తిలోకి వచ్చిన ఆమె తన కెరీర్‌లో దాదాపుగా 50 వేల కాన్పులు చేశారు. ఆమె చేతి చలువ కోసం ఎక్కడెక్కడి నుంచో రోగులు వెతుక్కుంటూ వస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆలేరు నుంచి ఆటో కట్టుకొని ఆమె ఆత్మీయ స్పర్శ కోసం వస్తున్నారంటే ఆమెపై వారికున్న నమ్మకానికి.. ఆమె సేవలకు నిలువెత్తు నిదర్శనం. నా జీవితంలో  అత్యంత ఇష్టమైనది లేబర్‌రూమే అని చెప్పే అంజనీదేవి వైద్యురాలిగా ఈ ఏడాది యాభై వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా వృత్తి, ప్రవృత్తిలోని అనుభవాలు ఆమె మాటల్లోనే సండే స్పెషల్‌గా నమస్తే తెలంగాణ అందిస్తున ప్రత్యేక కథనం. - వరంగల్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ 

 తల్లి గర్భాలయం నుంచి ఈ లోకాన్ని చూసే నెత్తుటిగుడ్డుకు తొలి స్పర్శ ఆమె. సామాన్యులు దేవుళ్లలా కొలిచే వైద్య వృత్తిని.. ఆమె ఆరాధిస్తుంది. కన్నుమూసే వరకు కన్ను తెరిపిస్తూనే ఉండాలని, ప్రాణాలు పోయాలని ఆశపడుతుంది. అపరబ్రహ్మలుగా కీర్తిపొందిన వైద్యుల జీవితాల్లో అనేక మెరుపులు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభిరుచులు, అనేకానేక ఆసక్తులు ఉంటాయి. అటువంటి అనేక ఆసక్తుల మేళవింపే డాక్టర్‌ పర్చ అంజనీదేవి. ఆమె చేతి చలువ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆలేరు నుంచి ఆటో కట్టుకొని ఆమె ఆత్మీ య స్పర్శ కోసం వస్తున్నారంటే.. ఆమెపై వారికున్న నమ్మకానికి.. ఆమె అనుభవా నికి నిలువెత్తు నిదర్శనం. నా జీవితంలో అత్యంత ఇష్టమైనది లేబర్‌రూమే అని ఆమె ఎంత ఆత్మీయంగా చెబుతారో అంతకంటే ఎక్కువగా మానవీయంగా ఉంటారు. ఆమె వైద్యురాలు మాత్రమే కాదు సుద్ద ముక్కలపై అనేక ఆకృతులకు ప్రాణం పోస్తారు. ఆమె కథారచయిత్రి కూడా. అనేక విలక్షణాలు ఆమె సొంతం. తనకిష్టమైన గణితాన్ని కాదని నాన్న కోసం మెడిసిన్‌ చేసినా.. ఆమె జీవితంలో గుణకారాల సమ్మేళన విజయాలను అంతకంటే ఆత్మతృప్తితో వృత్తి జీవితాన్ని మలుచుకున్న తీరు విశేషమైంది. వైద్య వృత్తిలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు అయిన సందర్భంగా అనుభవాలు ఆమె మాటల్లోనే..

పీయూసీ దాకా ఆటో రిక్షా కూడా...

మాది ఖమ్మం జిల్లా నాగువంచదగ్గర పోలపల్లి. నాన్న కోమరిగిరి అప్పారావు. అమ్మ సుగుణ. నలుగురు తమ్ముళ్లు. ఐదుగురం అక్కాచెల్లెల్లం. ఇంట్లో నేనే పెద్ద. నాన్న స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన వార్ధాలో కొంతకాలం ఉన్నారు. మహిళలకు చదువులు అక్కరలేదు అనుకునే కాలం అది. ఇక ఆ కాలంలో బాల్యవివాహాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సమయంలో మమ్మల్నందరినీ చదివించారు. నా ఎనిమిదోయేట ఖమ్మం వచ్చాం. పీయూసీ వరకు ఖమ్మంలోనే. స్కూల్‌కు ఊళ్లను దాటుకుంటూ నడిచే వెళ్లేది. అసలు పీయూసీ వరకు కనీసం ఆటో ఎక్కడం కూడా ఎరుగను. 

నోటీస్‌బోర్డులు నా జీవితాన్ని మలుపు తిప్పాయి..

నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్‌ అంటే బాగా ఇంట్రెస్ట్‌ ఉండేది. మా మేనమామ జియాలజిస్ట్‌. ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా మ్యాథ్స్‌మీద ఆసక్తిని కలిగేలా అనేక విషయాలు చెప్పేవారు. స్వతహాగా మ్యాథ్స్‌ అంటే ఇష్టం కాబట్టి.. వాటిని వింటూ ఎలాగైనా మ్యాథ్స్‌లో బాగా రాణించాలి అనుకున్నా. అయితే నా జీవితంలో ముఖ్యమైన సంఘటలన్నీ నోటీస్‌బోర్డుల్లోనే జరిగిపోయాయి. పీయూసీ మ్యాథ్స్‌లో చేరిన తరువాత మా ప్రిన్సిపాల్‌ పిలిచి.. ఓ కాగితం ఇచ్చి సంతకం చేయమన్నారు. నేను కూడా ఎందుకు..? ఏమిటీ..? అని అడు గలేదు. సంతకం చేశాక.. రేపట్నుంచి బైపీసీలో కూర్చోమన్నారు. తెల్లారి ప్రిన్సిపాల్‌ దగ్గరికి వెళితే.. అప్పుడు చెప్పారు. ‘అమ్మా.. నిన్ను డాక్టర్‌గా చూడాలనేది మీ నాన్న కోరిక’ అని అన్నారు. అంటే అంతకుముందే నాన్న వచ్చి ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వెళ్లారు. అలా మ్యాథ్స్‌ను వదిలి బైపీసీలో చేరిపోయా. పీయూసీ పూర్తయ్యాక. హైదరాబాద్‌ ఉస్మానియాలో మెడికల్‌ సీటొచ్చింది. అక్కడ చేరిన కొద్దిరోజులకే మళ్లీ నోటీస్‌బోర్డులో నాతోపాటు మరికొంతమందిని కాకతీయ మెడికల్‌ కాలేజీకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అలా వరంగల్‌కు మెడికల్‌ స్టూడెంట్‌గా తొలిసారి వచ్చాను. ఇలా రెండు సార్లు నోటీస్‌బోర్డు నా జీవితాన్ని మలుపుతిప్పితే మూడోసారి మాత్రం ఆర్నెళ్ల చదువును ఆపేసింది. ఎంబీబీఎస్‌ చేస్తున్నప్పుడు డీటెయిన్డ్‌ జా బితాలో నా పేరుంది. అన్ని క్లాస్‌లకు అటెండ్‌ అవుతూ, చదువుకుంటున్న నన్ను డీటెయిండ్‌ చేయడం ఏమిటో అర్థం కాలేదు. ఎవరిని కలువాలో తెలియదు.? ఏం చేయాలో తెలియదు. తెల్లారితే పరీక్ష. ఏమి పాలుపోలేదు. హాస్టల్‌ ఉండదు. ఇంట్లో ఉండి చదువుకోవాలి. వన్‌ ఇయర్‌ స్కాలర్‌షిప్‌రాదు. ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పడ్డాను. తీరా కనుక్కుంటే నా ముందు స్టూడెంట్‌ ఆబ్సెంట్‌ అయితే నేననుకుని అటెండెన్స్‌ రిజిస్టర్‌లో జరిగిన టైపోగ్రాఫికల్‌ మిస్టేక్‌తో నేను ఆర్నేళ్లు లాస్‌ అయ్యాను. 

డాక్టర్‌గా సంతృప్తి...

ఎంబీబీఎస్‌ అయిపోయాక 1970లో పూర్తి స్థాయి వైద్య వృత్తిలోకి వచ్చాను. ములుగు, మహబూబాబాద్‌, ఎంజీఎం, మెటర్నిటీ దవాఖాన ఇలా అనేకచోట్ల పనిచేశాను. కానీ, 1973 నుంచి 80వరకు ఎక్కువ కాలం మహ బూబాబాద్‌లో పనిచేశాను. అక్క డ పనిచేసిన రోజులను ఇప్పటికీ మరిచి పోలేను. భార్యాభర్తల గొడవల వల్ల తొమ్మిది నెలల పిల్లవాడు, తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే దురదృష్టవశాత్తు తల్లి బతికుంది. పిల్లవాడు చనిపోయాడు. అప్పుడు ఆ తల్లి వేదన చూడాలి. ఇప్పటికీ గుర్తు చేసుకుంటే మనసు చలించిపోతుంది. ఈ వృత్తిలోకి వచ్చి 50ఏళ్లు. దాదాపు 50, 60వేల మందికి కాన్పులు చేసి ఉంటాను. రిటైర్‌ అయ్యాక సొంతంగా క్లినిక్‌ ప్రారంభించాను. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్రీగా చేసినప్పుడు ప్రసవాలు చేసుకున్న వారు మళ్లీ నాదగ్గరికే వచ్చి కాన్పు చేసుకున్నపుడు వాళ్లకు బిల్లు వేసేటప్పుడు చాలా బాధనిపించేది. దీంతో ప్రతి శనివారం ఫ్రీగా కాన్పులు చేయడం, ఆపరేషన్లు చేయడం అలవాటుగా చేసుకున్నాను. ఆచరిస్తూ వస్తున్నాను. ఇప్పటికీ నిరుపేదల ని తేలితే హాస్పిటల్‌ చార్జీలు, మెయింటెనెన్స్‌ చార్జీలు మాత్రమే తీసుకుంటాను. నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది లేబర్‌ రూమ్‌. 

పాపం వెంకటేశ్వర్లు

తొర్రూరు అనుకుంటా. ఎవరు చెబితేనో లేదా తెలుసుకొనో మా క్లినిక్‌కు వచ్చాడు. అతడి వివరాలు, కుటుంబ పరిస్థితులు చూసి జాలి వేసింది. అత నికి హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉంది. ఆపరేషన్‌ చేయాలి. రూ.40వేలు ఖర్చవుతాయి. వచ్చే వారమే ఆపరేషన్‌. ఇట్లా చెబుతున్నప్పుడు కళ్ల నీళ్లు వచ్చాయి. అప్పుడు అందరం కలిసి మనిషికి కొంత కలెక్ట్‌ చేసి రూ.40వేలు ఇచ్చి ఆపరేషన్‌ చేయిం కోమన్నాం. అవి తీసుకొని వెళ్లాడు. కానీ కొంత కాలానికి వాళ్ల నాన్న వచ్చి అసలు విషయం చెబితే జాలేసింది. అతని దగ్గర 40వేలున్న విషయాన్ని అతని స్నేహితుడు గమనించి నీ దగ్గరున్న 40వేలు నాకివ్వు నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడట. చెల్లె పెళ్లి చేస్తే నయమే కదా అని తన కూడా ఆరోగ్యాన్ని కాదనుకుని.. ఆ డబ్బు ఇచ్చాడట. కొంత కాలానికి అతని చెల్లెను పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆ మోసం తట్టుకోలేక అతను మరణించాడు. అతను చనిపోయినప్పుడు అతని జేబులో రాసుకున్న కాగితం ఆధారంగా వాళ్ల నాన్న వచ్చి విషయం చెప్పాడు. అమ్మా నా కొడుకు వెంకటేశ్వర్లు జేబులో మీరు చేసిన సహాయం, రాసిన ఉత్తరం చూశాను. అందులో మేడంకు క్షమించమని చెప్పండి అని ఉంది. అందుకే వచ్చి విషయాన్ని చెబుతున్నాను. ఆ వెంకటేశ్వర్లు తండ్రి చెబుతున్నప్పుడు చాలా దుఃఖం వేసింది. 

అనేక కళాకృతుల చేయి..

డాక్టర్‌ అంజనీదేవి సుద్దముక్కపై అద్భుతమైన శిల్పాలు చెక్కుతారు. అమ్మ చిన్నప్పుడు బొగ్గుతో అందమైన గీతలు గీస్తే ఆ గీతలే ఆమెకు స్ఫూర్తి నిచ్చాయి. చెల్లె డ్రాయింగ్‌ టీచర్‌. తనకు డ్రాయింగ్‌ మీ దున్న ఇష్టంతో తన 60వ యేటా డ్రాయింగ్‌ టెస్ట్‌ లో యర్‌ పాసయ్యారు. బీఎఫ్‌ ఏ చేయ్యాలని ఉన్నా చేయలేకపోయారు. తెలుగు కథలు రాయడం ఆమెకు చాలా ఇష్టం. 


logo