గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 13, 2020 , 01:41:39

జైలు నర్సరీ ముస్తాబు..

జైలు నర్సరీ ముస్తాబు..

n 17న కేంద్ర కారాగారాన్ని సందర్శించనున్న మంత్రి కేటీఆర్‌

n మొక్కల పెంపకంపై ఎమ్మెల్యే, కలెక్టర్‌, కమిషనర్‌ ఆరా

వరంగల్‌ క్రైం, జూన్‌ 12: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 17న వరంగల్‌ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో సెంట్రల్‌ జైలు నర్సరీని అధికారులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ శుక్రవారం సెంట్రల్‌ జైలును సందర్శించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కుడా ఆధ్వర్యంలో వరంగల్‌ సెంట్రల్‌ జైలు అధికారులు, సిబ్బంది సహకారంతో 14 లక్షల మొక్కలతో నర్సరీ నిర్వహిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఇప్పటికే 65 వేల మొక్కలను తిరిగి కుడాకు జైలు అధికారులు అప్పగించారు. సుమారు 60 రకాల మొక్కలు పెంచడానికి 50 మంది ఓపెన్‌ జైలు ఖైదీలు రోజూ పని చేస్తున్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఒక్కో మొక్కకు కుడా రూ. 5 వెచ్చించి హరితహారం కోసం పెంచుతున్నారు. కుడా నుంచి ముగ్గురు సిబ్బంది నిత్యం నర్సరీ నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నర్సరీని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నట్లు జైలు సూపరింటెండెంట్‌ మురళి తెలిపారు.


logo