బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jun 13, 2020 , 01:35:00

గజ్వేల్‌ మోడల్‌లో తొర్రూరు మార్కెట్‌

గజ్వేల్‌ మోడల్‌లో తొర్రూరు మార్కెట్‌

n శరవేగంగా పనులు

n శాస్త్రీయ పద్ధతిలో ప్లాట్‌ఫాంల నిర్మాణం

n జీప్లస్‌-2కు ప్రణాళిక

n జీప్లస్‌-1 నిర్మాణానికి  రూ.2కోట్ల నిధులు

n ఒకేసారి 300 మంది అమ్మకాలు చేసేలా  డిజైన్‌

n మొదటి దశలో 92 షాపులు

తొర్రూరు : ఆరోగ్యవంతమైన తెలం గాణను నిర్మించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, పట్టణ కేంద్రాల్లో మోడల్‌ మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన తొలి నిర్మాణాన్ని ఇటీవల పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ఇదే డిజైన్‌లో మార్కెట్లను నిర్మిస్తున్నారు. రోడ్లపై దుమ్ముధూళి నడుమ విక్రయించే వెజ్‌, నాన్‌వెజ్‌పై బ్యాక్ట్టీరియా చేరి ప్రజారోగ్యానికి నష్టం జరుగుతుందని భావించిన సీఎం, మోడల్‌ మార్కెట్లను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీలో రూ.2 కోట్లతో జీప్లస్‌-1 పద్ధతిలో మార్కెట్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తొర్రూరు గాంధీ పార్క్‌ ఆవరణలో మార్కెట్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి.

రూ. 2 కోట్లు మంజూరు

తొర్రూరులో మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి మొదటి విడుతగా రూ.2కోట్ల నిధులు మంజూరు చేయించారు. హరిపిరాల క్రాస్‌ రోడ్డులో మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే రహదారిలో సుమారు ఐదు దశాబ్దాలుగా కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. మాంసాహార విక్రయాలకు మాత్రం ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో  రోడ్ల వెంట విక్రయించేవారు. దీంతో వాటిపై దుమ్ముచేరి కలుషితమయ్యేది. దీనికి తోడు దుర్గంధంతో పరిసర ప్రాంతాల వారు ఇబ్బంది ఎదుర్కొనేవారు.

వేగవంతంగా పనులు..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు, కమిషనర్‌ గుండె బాబు మోడల్‌ మార్కెట్‌ నిర్మా ణ పనులు త్వరగా  చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పట్టణ ప్రగతి సందర్భంలో మూడుసార్లు మార్కెట్‌ నిర్మాణ స్థలాన్ని  పరిశీలించారు. కరోనా కారణంగా నెల రోజులకు పైగా పనులు నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన సడలింపులతో వేగవంతంగా కొనసాగుతున్నాయి. 

జీప్లస్‌-2 నిర్మాణానికి ప్రణాళిక

జీ ప్లస్‌-2 తరహా మార్కెట్‌ నిర్మాణానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 2 వేల చదరపు మీటర్ల స్థలం ఉండగా ఇందు లో 724 చదరపు మీటర్లలో రూ.2కోట్ల నిధులతో జీ ప్లస్‌-1 మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. రెండో అంతస్తు నిర్మాణానికి నిధులు మంజూరవగానే ఆ పనులనూ ప్రారంభించనున్నారు. గజ్వేల్‌లో నిర్మించిన మార్కెట్‌ తరహాలోనే తొర్రూరు మార్కెట్‌కూ డిజైన్‌ రూపొందించినట్లు ప్రజా ఆరోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రంజిత్‌ తెలిపారు. భూమి నుంచి మీటర్‌ ఎత్తున ప్లాట్‌ఫాంలను గ్రౌండ్‌, మొదటి అంతస్తుల్లో నిర్మిస్తున్నామన్నారు. తొమ్మిది నెలల కాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 

92 షాపుల నిర్మాణం

మోడల్‌ మార్కెట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 46, మొదటి అంతస్తులో 46 షాపులు నిర్మించనున్నారు. 2.82 మీటర్లు, 2.32 మీటర్ల పొడవు, వెడల్పుతో అన్ని షాపులు ఒకేలా ఉండనున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తులో టాయిలెట్ల నిర్మాణంతో పాటు లిఫ్ట్‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు. 92 షాపుల్లో ఒకేసారి సుమారు 300 మంది విక్రయాలు చేసేలా నిర్మాణాన్ని చేపడుతున్నారు. మార్కెట్‌ చుట్టూ వాహనాలు పార్కింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 


logo