గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jun 10, 2020 , 03:08:18

భూసార పరీక్షలతో అన్నదాతలకు మేలు

భూసార పరీక్షలతో అన్నదాతలకు మేలు

 • కోతులనడుమలో వందశాతం సాయిల్‌ టెస్టులు
 • రైతుల చేతికి భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు
 •  కార్డులోనే సమగ్ర సమాచారం-సస్యరక్షణ చర్యలు
 • పెట్టుబడులు తగ్గి, పెరుగుతున్న దిగుబడులు

నేల ఎంత సారంతో ఉంటే రైతుకు అంత మేలు కలుగుతుంది. పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎల్కతుర్తి మండలం కోతులనడుమ రైతులు ముందుకు వచ్చి వందశాతం సాయిల్‌ టెస్టులు చేయించుకున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సహకారంతో నేల స్వభావం, భూమిలో పోషకాలు తదితర అంశాలను పరీక్షించుకొని ‘సాయిల్‌ హెల్త్‌ కార్డులు’ అందుకున్నారు. వాడాల్సిన ఎరువులు, పురుగుమందులపై అవగాహన పెంచుకొని పెట్టుబడులను చాలా వరకు తగ్గించుకోగలిగారు. మూస విధానానికి స్వస్తి పలికి ఆధునిక సేద్యం వైపు సాగుతున్నారు.  

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతులు పంట మార్పిడి చేయకుండా ఒకే పంటను అనేక ఏళ్లుగా పండించడం, విచ్చలవిడిగా ఎరువులు, క్రిమిసంహారక మందు లు వాడుతుండడంతో భూమిలో సారం తగ్గి దిగుబడులు కూడా పడిపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు భూసార పరీక్షలు చేపట్టింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఈ పరీక్షల ఫలితాలు, అధికారుల సూచనలతో సత్ఫలితాలు వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అన్నదాతలు తమ భూ ములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు భూమిలో ఉన్న సూక్ష్మపోషకాల గురిం చి తెలుసుకొని అందుకు అనుగుణంగా సస్యరక్షణ చర్య లు చేపడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. 

‘కోతులనడుమ’లో వంద శాతం టెస్టులు

ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామాన్ని  ఎంపి క చేసుకొని భూసార పరీక్షలు చేశారు. ప్రతి రైతుకు సాయి ల్‌ హెల్త్‌ కార్డు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు కే దామోదర్‌రెడ్డి వివరించారు. ఏవో రాజ్‌కుమార్‌, ఏఈవోలు, శాస్త్రవేత్తలు హాజరై మట్టి నమూనా లు సేకరించారు. రైతు పేరు, సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణం, నీటి పారుదల, నేల స్వభావం, పంటల సాగు, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ తదితర విషయాలను సేకరించారు. గ్రామంలో 271మంది రైతుల భూములకు సార పరీక్షలు చేసి, నేల స్వభావం, పోషకాలు తదితర అంశాలతో కూడిన భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలను 15రోజుల్లోగా అందజేశారు. తర్వాత ఐదు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించి భూసార ఫలితాలు, వాడాల్సిన ఎరువులు, పురుగుమందులపై అవగాహన కల్పించారు.

 పంటల యాజమాన్యంలో సూచనలు

 • భూమిలో సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాను లోపాలను సవరించుకోవాలి.
 • భూమిలో తేమ ఉండాలంటే పశువుల ఎరువు, కోళ్లు, గొర్రెల ఎరువు, పచ్చిరొట్ట, వానపాముల ఎరువులు వేయాలి.
 • పచ్చిరొట్ట వేస్తే మొదటి దఫా నత్రజని ఎరువు వేయాల్సిన అవసరం లేదు.
 • జీవన ఎరువుల వాడకం వల్ల పురుగు మందుల మోతాదు తగ్గించొచ్చు
 • వరి, చెరుకు, మక్క, పశుగ్రాసాలను ఎకరానికి 2కిలోల చొప్పున అజోస్పైరిల్లం వేస్తే 10 శాతం నత్రజని ఎరువును తగ్గించొచ్చు.
 • పత్తి, మిరప, చెరుకు, మక్క, కూరగాయలు, పూలతోటలకు ఎకరానికి 2 కిలోల చొప్పున అజటోబ్యాక్టర్‌ వేస్తే 10శాతం నత్రజని ఎరువు తగ్గించవచ్చు. జీవన ఎరువులను దుక్కిలో తేమ ఉన్నప్పుడు సేంద్రియ ఎరువులో కలిపివేయాలి.
 • రసాయన ఎరువులు వేసేటప్పుడు నత్రజని 3-4 దఫాలుగా వేయాలి. యూరియాకు వేపనూనె లేదా పిండి పట్టించి బురద పదునుపై వేస్తే భాస్వరం ఎరువును సూపర్‌పాస్ఫేట్‌ రూపంలో దుక్కిలో లేదా విత్తిన నెలలోపు వేయాలి. పొటాష్‌ను తప్పనిసరిగా 2-3 దఫాలుగా వాడాలి.
 • నల్ల చవుడు/క్షార నేలలకు ఎకరానికి సూచించిన జిప్సం వేసి చేను బాగు చేయాలి. లేదా పచ్చిరొట్ట వేసి దున్నాలి. 
 • తెల్లచౌడు భూములను లవణ పరిమాణం ఎక్కువగా ఉన్న నేలలను బాగా కలియదున్ని మంచినీటితో మడులు కట్టి 24 గంటల తర్వాత మురుగు కాల్వల ద్వారా నీటిని బయటికి వదలాలి. ఇలా 4-5 సార్లు చేస్తే భూమిలో ఉన్న లవణాలు నీటిలో కరిగి భూమి మామూలు స్థితికి వస్తుంది. పశువుల ఎరువు, చెరువు మట్టి వేసినా నేల స్వభావం మారుతుంది. 

సూక్ష్మ పోషకాల లోప సవరణ

 • వేరుశనగ పంటకు ఎకరాకు 200కిలోల జిప్సంను పూతదశ ముందు వేయాలి.
 • వరిలో జింకులోపం నివారణకు ఎకరాకు 20కి.గ్రా. ఇతర పైర్లకు ఎకరానికి 10కి.గ్రా. చొప్పున జింకు సల్ఫేట్‌ వేయా లి. జింకు సల్ఫేట్‌ ఇతర ఎరువులతో కలిపి వేయకూడదు. ఇలా ప్రతి మూడు పంటలకు ఒకసారి లేదా పైరుపై 0.2శాతం జింకు సల్ఫేట్‌ ద్రావణాన్ని 2-3 సార్లు పిచికారీ చేయాలి.
 • బోరాను లోపం నివారణకు ఎకరానికి 1కి.గ్రా. బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. లేదా 0.2శాతం ద్రావణాన్ని 2సార్లు 7-10రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
 • ఇనుము లోప నివారణకు ఎకరానికి 20 కి.గ్రా. ఐరన్‌ సల్ఫేట్‌ లేదా అన్నభేదిని ఆఖరి దుక్కిలో వేయాలి. లేదా 0.5శాతం ఐరన్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో 2-3సార్లు వేయాలి.
 • మాంగనీసు లోపం నివారణకు ఎకరానికి 10కి.గ్రా. మాంగనీసు సల్ఫేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి లేదా 0.5శాతం మాంగనీసు ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు వేయాలి.
 • రాగి లోపం నివారణకు ఎకరానికి 2కి.గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ 2-3 సంవత్సరాలకు ఒకసారి దుక్కిలో వేయాలి.
 • ఉద్యాన పంటల్లో ఎరువుల సిఫార్సుకు సంబంధిత అధికారులను సంప్రదించాలి. 

భూమి ఎట్లున్నదో తెలుసుకోవాలె  

భూసార పరీక్షలు రైతులకు చాలా మేలు కలిగిస్తయ్‌. పరీక్షలు చేస్తేనే భూమిల ఎంత వరకు పోషకాలున్నయో తెలుస్తది. దాన్ని బట్టే పంటలు, ఎరువులు వేసుకుంటే కావాల్సిన పోషకాలు అంది దిగుబడులు పెరుగుతయ్‌. పెట్టుబడులు కూడా శానా తగ్గినయ్‌.   

    -పోశాల భాస్కర్‌