శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 08, 2020 , 02:10:59

ఏమరపాటు వద్దు.. అప్రమత్తతే ముద్దు

ఏమరపాటు వద్దు.. అప్రమత్తతే ముద్దు

 • లాక్‌డౌన్‌ నిబంధనలు  సడలిస్తే.. కరోనా లేనట్లు కాదు
 • కనిపించని శత్రువుతో జాగ్రత్త
 • ‘మనకేంలే’ అనుకుంటే నిండా మునుగుడే
 • అజాగ్రత్తగా ఉంటే అందరికీ ముప్పే 

 వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ/ భూపాలపల్లి/ వర్ధన్నపేట/ రెడ్డి కాలనీ/  మహబూబాబాద్‌ టౌన్‌/ స్టేషన్‌ఘన్‌పూర్‌ : ఒకడు మాస్కు లేకుండ బండేస్కొని రయ్యిన దూసుకెళ్తడు..ఇద్దరు దోస్తులు కలిసి చెవులు కొరుక్కుంట బైక్‌పైనే చక్కర్లు కొడుతరు. నలుగురైదుగురు ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటరు. ఒకడు పాన్‌పరాగ్‌ నములుకుంట.. మరొకడు సిగరెట్‌ తాగుకుంట ఇష్టం వచ్చినట్లు రోడ్లపైనే ఊంచుతరు.. కొందరు అవసరం లేకున్నా షాపింగ్‌, మార్కెట్లనుకుంట రౌండ్లేస్తరు. ఆటోలు, కార్లలో పరిమితికి మించి పోతుంటరు. వద్దుమొర్రో అన్నా.. గుంపులుగా చేరి ఒకరిమీద ఒకరు పడుతుంటరు. ‘మాస్కులు పెట్టుకోవాలె.. భౌతిక దూరం పాటించాలె’ అని సర్కారు ఎంత మొత్తుకున్నా.. ‘మనల్ని కాదులే’ అని దులుపుకొనిపోతరు. సామాజిక స్పృహతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తే.. అదికాస్తా దుర్వినియోగం చేసుకుంట అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నరు. తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నరు. ఇప్పటికైనా మేల్కోకుంటే భారీ మూల్యం తప్పదని అటు వైద్యులు, ఇటు అధికారులు హెచ్చరిస్తున్నరు.  

జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కొక్కటిగా మొదలై పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మార్చి మూడో వారంలో ఒక్కటిగా నమోదైన కేసు, లాక్‌డౌన్‌ వల్ల తగ్గుముఖం పట్టిందనుకున్న తరుణంలో నాలుగోవారంలో ఒక్కసారిగా 16.. ఆ తరువాత 27కు చేరాయి. ఈ 27మంది కోలుకొని సురక్షితంగా ఇండ్లకు చేరారు. ఇప్పుడు వలస కార్మికులతో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది.  జయశంకర్‌- భూపాలపల్లి జిల్లాలో ఏడు కేసులు, మహబూబాబాద్‌లో 11, జనగామలో ఏడు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. ఒక్క వరంగల్‌ రూరల్‌ జిల్లాలోనే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్నవారితో వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే అందరికీ పెనుముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

పల్లె చైతన్యం  పట్నాలకేది? 

కరోనా వ్యాప్తిని పల్లెలు ఊరుమ్మడి చైతన్యంతో అడ్డుకోగలిగాయి. ఎక్కడికక్కడ చైతన్యదీప్తులై నిలిచాయి. పట్నాల్లో పటిష్టమైన లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూతో నియంత్రించి, కరోనా ప్రభావిత ప్రాంతాలను క్వారంటైన్‌ జోన్లుగా ఏర్పాటు చేసి నిత్యావసర సరుకుల్ని సైతం పంపిణీ చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా మొదటి నుంచీ గ్రీన్‌ జోన్‌లోనే ఉంటూ వచ్చింది. వరంగల్‌ అర్బన్‌ రెడ్‌జోన్‌గా, జనగామ, జయశంకర్‌-భూపాపల్లి, ములుగు జిల్లాలు ఆరేంజ్‌ నుంచి గ్రీన్‌జోన్లుగా మారాయి. అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో వలస కార్మికుల రూపంలో కరోనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ నేపథ్యంలో పల్లె ప్రజలు అనుసరిస్తున్న  స్వీయనియంత్రణ పట్టణాల్లో కనిపించడం లేదని స్పష్టమవుతున్నది. జనం ఎవరికివారు ఇష్టారీతిగా కనీసం మాస్క్‌లు ధరించకుండా బేపర్వాగా తిరుగుతున్నా రు. కిరాణాషాపులు, వైన్‌షాప్‌లు, జనరల్‌ స్టోర్స్‌ అన్న తేడాలేకుండా గుంపులు గుంపులుగా వచ్చివాలిపోతున్నారు. ముఖానికి మాస్కుల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. ఇది వ్యక్తిగతంగానే కాదు.. ఇతరులకూ నష్టం కలిగిస్తుంది.  

అంతటా నిర్లక్ష్యం..

లాక్‌డౌన్‌లో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు జంకేవారు. కొన్ని సడలింపుల తర్వాత ‘కరోనా వస్తే రాని.. ఏమవుతుంది’ అన్న నిర్లక్ష్యం పెరిగింది. కనీస నిబంధనలు పాటించని వారి తీరును చూస్తే వైద్యులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కేసుల మీదు కేసులు నమోదవుతున్నా, జనం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ కొందరు జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ప్రవర్తిస్తే అందరికీ ప్రమాదమని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

పోలీసులు కూడా రోడ్లపైకి అనవసరంగా, మాస్క్‌లు లేకుండా వచ్చిన వారిని పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారు. అయినా మార్పు రావడం లేదు. పలు ప్రాంతాల్లో జనాలు రోడ్డుపైకి ఒకేసారి వస్తున్నారు. సడలింపుల తర్వాత రోజువారీ వ్యాపారాలు తెరుచుకునే అవకాశం రావడంతో పనులు చేసే ప్రాంతాలు, ఇతర సముదాయాల వద్ద జనం తాకిడి ఎక్కువైంది. కానీ, అక్కడా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. భౌతిక దూరం అన్న మాటే మర్చిపోతున్నారు. మాస్కు ఉన్నా దాన్ని కిందకు పెట్టి మాట్లాడుకుంటూ అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మార్కెట్లలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇక చాలామంది వ్యాపారులు మాస్క్‌లు లేకుండానే రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో నిగ్నమవుతున్నారు. కొంతమంది గుట్కా, పాన్‌ వంటివి నములూతూ ఇష్టానుసారం రోడ్లపైనే ఉమ్మేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 1. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో గానీ, శానిటైజర్‌తో గానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 2. బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మాస్క్‌ ధరించాలి.
 3. జనసంచారం ఉన్నచోట సామాజిక దూరం పాటించాలి.
 4. రోజులో అప్పుడుప్పుడూ చేతులను సబ్బు లేదా ఆల్కాహాల్‌ బేస్డ్‌ జెల్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
 5. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవాలి
 6. ఎవరైనా జ్వరం, తీవ్రమైన జలుబు, శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండాలి.
 7. మీకు జ్వరం, జలుబు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వెంటనే వైద్యుల్ని కలవాలి.
 8. ఇప్పటికే కరోనా సోకిన ప్రాంతాల్లో జంతువులను పొరబాటున కూడా తాకవద్దు..
 9. ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారు వైరస్‌ బారిన పడినట్టు అనుమానాలుంటే 14 రోజుల వరకు క్వారంటైన్‌ కావాలి.  
 10. వైరస్‌ సోకితే ఇంట్లోనే చికిత్స చేయించుకోవాలి
 11. వైద్యుల పర్యవేక్షణలో వారిచ్చే సలహాలతో 17రోజుల పాటు చికిత్స ఉంటుంది.
 12. చిన్నారులు, వృద్ధులు వైరస్‌ బాధితులకు దూరంగా ఉండాలి. ఇదే సమయంలో ఇంట్లోని వారంతా పోషకాహారం తీసుకోవాలి.

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా స్వీయ రక్షణ చాలా ముఖ్యమైంది. ముఖానికి మాస్కులు ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దు. ఒకవేళ తప్పనిసరై బయటకు వస్తే భౌతిక దూరం పాటించాలి. కరోనా బాధితులుంటే ఆ ప్రాం తాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అర్బన్‌ జిల్లాలో ఇప్పటివరకు 31 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎవరూ చనిపోలేదు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులను ప్రజలు నమ్మవద్దు. 

- కే లలితాదేవి, డీఎంహెచ్‌వో, వరంగల్‌ అర్బన్‌

జనంలో భయం లేదు 

తన దాకా వస్తే గానీ ఏదీ తెలియదన్నట్లు.. కరోనా అంటే జనంలో భయం లేకుండా పోయింది. ఇప్పటికి 70కి పైగా కేసులు నమోదు చేశాం. ఎంతో మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. దుకాణాదారులు, వాహనదారులు, పాదచారులకు జాగ్రత్తలు చెప్పాం. ఇది కేవలం అధికారుల బాధ్యతే కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఏదైనా పనిపై బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. వాహనాల్లో పరిమితికి మించి వెళ్లడం, త్రిబుల్‌ రైడింగ్‌లాంటివి వద్దు. గుమికూడడం, నలుగురైదుగురు ఒక్కచోట చేరి బాతాకాని కొట్టడం మంచిది కాదు. ఇప్పటికైనా ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించాలి. 

-అంగోత్‌ నరేశ్‌ కుమార్‌, డీఎస్పీ, మహబూబాబాద్‌logo